గిట్టుబాటు కరువై.. సాగు బరువై..! | - | Sakshi
Sakshi News home page

గిట్టుబాటు కరువై.. సాగు బరువై..!

Aug 10 2025 5:48 AM | Updated on Aug 10 2025 5:54 AM

గుర్రంకొండ : జిల్లాలో రోజురోజుకు అల్లనేరేడు తోటలు అంతరించిపోతున్నాయి. గత రెండేళ్లుగా మార్కెట్‌లో అల్లనేరేడుకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. ఈ సీజన్‌లో మార్కెట్‌లో కిలో రూ. 30 నుంచి రూ. 40 వరకు ధరలు పలకడం గమనార్హం. దీంతో ఈ ఏడాది జిల్లాలో అల్లనేరేడు రైతులు రూ. 40.50 కోట్ల మేరకు నష్టపోయారు. నష్టాలు భరించలేక జిల్లాలో పలు చోట్ల అల్లనేరేడు చెట్లను రైతులు నరికి వేస్తున్నారు.

జిల్లాలో 3240 హెక్టార్లలో పంటసాగు

జిల్లాలో అల్లనేరేడు తోటల పెంపకం 3240 హెక్టార్లలో రైతులు చేపట్టారు. ఎకరం అల్లనేరేడు తోటల పెంపకానికి రూ. లక్ష వరకు ఖర్చు వస్తుంది. మొక్కలు నాటడం దగ్గర నుంచి కాయలు కాసేంతవరకు ఆరు సంవత్సరాల పాటు ఏడాదికి రూ. 80 వేలు చొప్పున తోటల నిర్వహణ ఖర్చు వస్తుంది. ఎరువులు, పురుగు నివారణ మందులు, మొక్కలు ఏపుగా పెరిగేందుకు అవసరమైన కట్టెలు వంటివి ఆరేళ్లపాటు ఖర్చులు వస్తాయి. ఈ లెక్కన ఎకరం తోటకు కాయలు కాసేవరకు రైతుకు రూ. 5 లక్షల వరకు ఖర్చు వస్తుంది. ఆ తరువాత ప్రతి ఏడాది కాయలు కాసే పంట దిగుబడిని బట్టి ఆదాయం ఉంటుంది.

ఎకరాకు రూ. లక్ష ఆదాయం..

ఆరేళ్ల పాటు తోటల్ని కాపాడుకున్న తరువాత మార్కెట్‌లో మంచి ధరలు ఉంటే ఎకరానికి రూ. లక్ష ఆదాయం వస్తుంది. ఏడాదికి ఎకరం తోటలో సుమారు 800 కేజీల నుంచి టన్ను వరకు పంట దిగుబడి వస్తుంది. మార్కెట్‌లో కిలో ధర రూ. 100 పలికితే ఎకరానికి రూ. లక్ష వరకు ఆదాయం రైతుకు సమకూరుతుంది. గత కొన్నేళ్లుగా మార్కెట్‌లో కిలో ధరలు రూ. 100 తగ్గిన దాఖలాలు లేవు. దీంతో జిల్లాలో పలువురు రైతులు అల్లనేరేడు తోటల పెంపకంతో నిలకడైన ఆదాయం వస్తుందని భావించి ఎక్కువగా తోటల్ని సాగు చేశారు.

రెండేళ్లుగా మారిన లెక్కలు..

ఏం జరిగిందో తెలియదు కానీ గత రెండేళ్లుగా అల్లనేరేడు తోటల పెంపకం నష్టాలు తీసుకొచ్చింది. ఓ వైపు ఊజిదోమలతోపాటు ఇతర రోగాలు వ్యాపించడంతో మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు లభించలేదు. ఈ ఏడాది మంచి సీజన్‌లో కిలో రూ. 30 నుంచి రూ. 40 ఽలోపే మార్కెట్‌లో ధరలు పలికాయి. రోగాల కారణంగా కాయలు దెబ్బతినడంతో బయటి రాష్ట్రాల్లో డిమాండ్‌ తగ్గిపోయింది. దీంతో బయటి రాష్ట్రాలకు మన జిల్లా నుంచి ఎగుమతులు చాలా వరకు తగ్గిపోయాయి. దీంతో లక్షలాది రూపాయలు ఖర్చుచేసి సాగు చేసిన అల్లనేరేడుకు ఎకరానికి రూ. 30లోపే ఆదాయం వచ్చింది. దీంతో అటు వ్యాపారులు, ఇటు రైతుల అంచనాలు తప్పాయి. దీంతో ఈ ఏడాది అల్లనేరేడు సాగు చేసిన రైతులు రూ. 40.50 కోట్ల మేరకు నష్టపోయారు. రెండేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

ముఖం చాటేస్తున్న వ్యాపారులు..

రెండేళ్ల క్రితం తోటల వద్దకే వచ్చి తోటల్ని ఏడాదికి ముందే కొనుగోలు చేసే వ్యాపారులు ప్రస్తుతం ముఖం చాటేస్తున్నారు. రైతులు రెండు రకాలుగా తోటల్ని వ్యాపారులకు విక్రయిస్తుంటారు. కాయలు కాయక మునుపే ఎకరా తోటలకు ఒక రేటు నిర్ణయించి ముందుగానే కొనుగోలు చేస్తుంటారు. మరోవైపు రైతులే కాయలు కాసే వరకు వేచి ఉండి ఆ తరువాత వ్యాపారులకు పంటను విక్రయిస్తుంటారు. అయితే ఈ ఏడాది మార్కెట్‌లో ధరలు పుంజుకోక పోవడంతో వ్యాపారులు అల్లనేరేడు తోటలపై ఆసక్తి చూపించలేదు. రైతులు పలుమార్లు వ్యాపారుల్ని సంప్రదించినా ఫలితం కనిపించలేదు. మరోవైపు ఎంతో కొంత అడ్వాన్స్‌ చెల్లించిన వ్యాపారులు మాత్రం విధిలేని పరిస్థితిలో కాయల్ని కోసి మార్కెట్‌కు తరలించి ఎంతో కొంత సొమ్ము చేసుకున్నారు. అయితే రైతులకు మాత్రం నష్టాలు వచ్చియని చూపించి మిగిలిన సొమ్ము చెల్లించలేక ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల వ్యాపారులు పంటకొనుగోలుకు అడ్వాన్స్‌లు చెల్లించినా ధరలు లేకపోవడంతో అటువైపు వెళ్లడం మానేశారు.

నష్టాలు భరించలేక అల్లనేరేడు తోటల్ని నరికేస్తున్న రైతులు

ఈ సీజన్‌లో కిలో రూ. 30 నుంచి రూ.40 ధరలు

జిల్లాలో రూ. 40.50 కోట్ల మేర

రైతులకు నష్టం

తోటల్లోనే వదిలేశాము

ఈ సంవత్సరం అల్లనేరేడు కాయల్ని కొనేవారు లేరు. వ్యాపారులు రెండేళ్ల క్రితం తోటలవద్దకే వచ్చి కొనుగోలు చేశారు. ఈ ఏడాది మేము బలవంతం చేసినా రాలేదు. కూలీల ఖర్చు భరించలేక, మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు సరైన సౌకర్యాలు లేక కాయల్ని చెట్లలోనే వదిలేశాము. ఈ ఏడాది ఒక్క రూపాయి ఆదాయం కూడా రాకపోవడంతో నష్టపోయాం. – సుధాకర, అల్లనేరేడు రైతు, గుర్రంకొండ

చెట్లను కోసేస్తున్నారు

మా ప్రాంతంలో చాలా మంది రైతులు అల్లనేరేడు చెట్లను కోసేస్తున్నారు. మార్కెట్‌లో కాయలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో చాలా నష్టపోయాము. చేసేదిలేక కొంతమంది రైతులు తోటల్లోని చెట్లను వ్యాపారులకు ఉచితంగా ఇచ్చేసి కోసేస్తున్నారు. అల్లనేరేడుకు ఇలాంటి దుస్థితి ఎన్నడూ రాలేదు. – గయాజ్‌, అల్లనేరేడు రైతు, గుర్రంకొండ.

గిట్టుబాటు కరువై.. సాగు బరువై..! 1
1/3

గిట్టుబాటు కరువై.. సాగు బరువై..!

గిట్టుబాటు కరువై.. సాగు బరువై..! 2
2/3

గిట్టుబాటు కరువై.. సాగు బరువై..!

గిట్టుబాటు కరువై.. సాగు బరువై..! 3
3/3

గిట్టుబాటు కరువై.. సాగు బరువై..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement