
ప్రజలే నా బలం.. వైఎస్సార్‌సీపీ నా ఊపిరి
ప్రజలే నా బలం.. వైఎస్సార్‌సీపీ నా ఊపిరి అంటున్నారు ఒంటిమిట్ట వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ వివరాలు. – రాజంపేట
ప్రశ్న : మూడోసారి జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీకు ఈ ఎన్నికలు కలిసివస్తాయని భావిస్తున్నారా?
జవాబు : ఒంటమిట్ట మండల ప్రజలు ఇరగంరెడ్డి కుటుంబానికి అండగా ఉంటూ వస్తున్నారు. రెండు సార్లు జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆదరించారు. మూడోసారి ఆదరిస్తారనే ప్రగాఢ విశ్వాసం నాకు ఉంది.
ప్రశ్న : తటస్థ ఓటర్లు మీకు అండగా నిలుస్తారనుకుంటున్నారా?
జవాబు : ఈ ఎన్నికలో ప్రజలే నాకు బలం. వైఎస్సార్‌సీపీ నాకు ఊపిరి. దశాబ్ద కాలానికి పైగా మండలంలో ప్రజాసేవ చేస్తూ వస్తున్నా. రాజకీయాలకు నేను కొత్తకాదు. తటస్థ ఓటర్లు తప్పకుండా నావైపు మొగ్గు చూపుతారు.
ప్రశ్న : చంద్రబాబు పాలన ప్రభావం ఈ ఎన్నికల్లో ఉంటుందంనుకుంటున్నారా?
జవాబు : కచ్చితంగా ఉంటుంది. చంద్రబాబు పాలనపై వ్యతిరేకత కనిపిస్తోంది. జెడ్పీటీసీ ఎన్నికల నుంచి వ్యతిరేక ఓటు బహిర్గతమవుతోంది. అదే రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో కూడా కొనసాగుతుంది.
ప్రశ్న : టీడీపీ అధికారంలో ఉంది. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం సాహిసించడమే కదా?
జవాబు : వైఎస్సార్‌సీపీ ఽఅధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. అలాగే నాకు అండగా ఓటర్లు, కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, స్కిల్‌డెవలప్‌మెంట్ మాజీ చైర్మన్ కొండూరు అజయ్‌రెడ్డితోపాటు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతోపాటు పార్టీ పెద్దల మద్దతు, సహకారం సంపూర్ణంగా ఉంది. టీడీపీ అధికారంలో ఉన్నా వారికి ఒరిగేది ఏమీ లేదు.
ప్రశ్న : ఈనెల 12న పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుందనే నమ్మకం ఉందా?
జవాబు : పోలింగ్ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీగా నిర్వహిస్తుందని భావిస్తున్నాము. అధికారపార్టీ దౌర్జన్యాలు చేస్తే ఓటర్లు నిశితంగా గమినించి, తగిన రీతిలో ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెబుతారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోలింగ్ జరగాలని వైఎస్సార్‌సీపీ కోరుకుంటోంది. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే. ఆ దిశగా జిల్లా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం దృష్టి సారించాలి.
ప్రశ్న : ఒక జెడ్పీటీసీ స్థానం కోసం పదుల సంఖ్యలో క్యాబినెట్‌ను ఒంటిమిట్టకు రప్పించారు. అంత అవసరమా?
జవాబు : ఈ ఎన్నికలు చంద్రబాబును భయపెడుతున్నాయి. ఇక్కడ ఓడిపోతే తన పాలన ప్రజా వ్యతిరేక పాలన అనేది తేలిపోతుంది. అలా కాకుండా ఉండేందుకు చంద్రబాబు తన
క్యాబినెట్‌ను ఒంటిమిట్టలో మకాం వేశారు. అప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచేందుకు అన్ని ప్రయోగాలు చేస్తున్నట్లుగా సమాచారం వస్తోంది. అన్నింటిని అడ్డుకునేందుకు వైఎస్సార్‌సీపీ క్యాడర్ సిద్ధంగా వుంది.

ప్రజలే నా బలం.. వైఎస్సార్‌సీపీ నా ఊపిరి