
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
గాలివీడు : మండలంలోని కొర్లకుంట పంచాయతీ పెద్దరెడ్డివారిపల్లెకు చెందిన నిర్జీ శంకరయ్య (38) అనే వ్యక్తి అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి కథనం మేరకు.. మృతుడు రజక వృత్తితో పాటు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇతనికి నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. వారిని పోషించడంలో అప్పులు ఎక్కువ చేశాడు. వాటిని తీర్చుకోలేక గురువారం రాత్రి పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు ఆలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనారోగ్యంతో వివాహిత..
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు పట్టణంలోని సూర్య నగర్‌లో నివాసముంటున్న విద్యుత్ శాఖ ఏఈ యోగానంద్ భార్య చిన్న రెడ్డెమ్మ (40) శనివారం ఉదయం ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఈమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతోంది. మానసిక స్థితి బాగాలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
రెండు టిప్పర్లు ఢీ
బి.కొత్తకోట : మదనపల్లె వైపు నుంచి కదిరి వైపు వెళ్తున్న టిప్పర్‌ను మరో టిప్పర్ ఢీకొన్న ఘటన శనివారం రాత్రి మండలంలోని జాతీయ రహదారిపై పెద్దపల్లె వద్ద జరిగింది. వివరాలు ఇలా.. మదనపల్లె నుంచి రెండు టిప్పర్లు ఒకదాని వెంట ఒకటి వెళ్తున్నాయి. ముందు వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ పెద్దపల్లె సమీపంలోకి రాగానే బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అనురాగ్ యాదవ్ (50) టిప్పర్‌లోనే ఇరుక్కుపోవడంతో స్థానికులు బయటకు తీశారు. వైద్యం కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాధితుడు బీహార్‌లోని భేటియా జిల్లా శ్యాంపూర్ గ్రామస్తుడు.

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య