
పిడుగుపాటుతో 47 గొర్రెలు మృతి
తంబళ్లపల్లె : పిడుగుపాటుతో 47 గొర్రెలు మృతి చెందిన విషాద సంఘటన శనివారం మండలంలో జరిగింది. మండలంలోని ఆర్‌ఎన్ తాండా పంచాయతీ బోనాసువారిపల్లెకు చెందిన రెడ్డమ్మ బంగారు తాకట్టు పెట్టి, పలువురు రైతుల వద్ద అప్పులు చేసి గొర్రెలు కొని వాటితో జీవనం సాగిస్తోంది. శుక్రవారం రాత్రి గొర్రెలను షెడ్డులో తోలింది. వర్షం వల్ల పడిన పిడుగు తాకిడికి 47 గొర్రెలు మృతి చెందాయి. శనివారం ఉదయం గొర్రెలు బయట తోలేందుకు వెళ్లగా ఒక్కసారిగా గొర్రెలు మృతి చెందడం చూసి బోరున విలపిస్తూ కుప్పకూలింది. సమాచారం అందుకున్న పశుసంవర్థకశాఖ ఏడీ డాక్టర్ సుమిత్ర, పశువైద్యులు డాక్టర్ విక్రమ్‌రెడ్డి, ఇందులు సంఘటన స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించి మృతి చెందిన గొర్రెలకు పోస్టుమార్టం నిర్వహించారు. పిడుగుపాటుకే మృతి చెందినట్లు నిర్ధారించారు. మరో ఆరు గొర్రెలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా చికిత్స చేశారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి గ్రామానికి వెళ్లి బాఽధితులను ఓదార్చి పరామర్శించారు. రూ.50 వేలు ఆర్థిక సహాయం అందించారు. ప్రభుత్వం బాధితులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ చౌడేశ్వర్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, సర్పంచ్ చెన్నకేశవరెడ్డి, నాయకులు సురేంద్రనాథ్, భాస్కర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, కొండయ్య తదితరులు ఉన్నారు.