
పదవులు ఎప్పుడిస్తారు.. బాబూ!
మదనపల్లె: పొరుగు నియోజకవర్గాల్లో తమ్ముళ్లు అధికారిక పదవులతో దర్జాగా తిరుగుతుంటే..పదవుల వడ్డింపు మాకెప్పుడంటూ తంబళ్లపల్లె, మదనపల్లె, రాజంపేట నియోజకవర్గాలకు చెందిన తెలుగు తమ్ముళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయినా ఇంకా తమవరకు పదవులు దరిచేరకపోవడంపై నియోజకవర్గ నేతలు, పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లోని టీడీపీలో నెలకొన్న వర్గపోరు, స్థానిక నేతలపై అసంతృప్తి కారణంగా పదవుల భర్తీకి అధిష్టానం మొగ్గు చూపడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా సింగిల్‌విండో మండల స్థాయి కమిటీల ఏర్పాటు, ఆ పదవులను ఆశిస్తున్న స్థానిక నాయకులు దీనిపై ఆశలు పెట్టుకున్నారు. మిగతా నియోజకవర్గాల్లో సింగిల్‌విండో త్రీమెన్ కమిటీలను భర్తీ చేస్తూ అందులో ఒకరిని చైర్మన్‌గా ఇద్దరిని సభ్యులుగా నియమిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ ఇన్‌చార్జీలు లేక ఎమ్మెల్యేల సిఫార్సు మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తోంది. అయితే తంబళ్లపల్లె, మదనపల్లె, రాజంపేట నియోజకవర్గాల్లో త్రీమెన్ కమిటీల ఏర్పాటు పూర్తిగా ఆపేశారు. ఒక్కో మండలంలో ముగ్గురు టీడీపీ నేతలకు పదవుల ఆవకాశం వస్తుంది. దీనికోసం పదవులు ఆశిస్తున్న స్థానిక నాయకులు నియోజకవర్గ నేతలు, ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తంబళ్లపల్లెలో ఓడిపోయిన అభ్యర్థి జయచంద్రారెడ్డి ఉండగా మదనపల్లెలో టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ ఉన్నారు. రాజంపేటలో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం ఆ పార్టీ వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. దీంతో అక్కడ ఇన్‌చార్జి లేకపోగా ఇప్పటికీ ఎవరికి పార్టీ బాధ్యతలను అధిష్టానం అప్పగించలేదు. రాజంపేటలో ప్రస్తుతం టీడీపీకి నాయకత్వలోపం ఉంది.
వ్యతిరేకత..తమ్ముళ్లపై ప్రభావం
నియోజకవర్గాల్లో టీడీపీ నేతలపై నెలకొన్న వ్యతిరేకత, వర్గపోరు వల్ల తమ్ముళ్లకు పదవులు దక్కుండా పోతున్నాయి. తంబళ్లపల్లెలో జయచంద్రారెడ్డిపై సీనియర్లు, పార్టీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. బహిరంగంగా, సోషల్‌మీడియాలోనే కాక, ఈ మధ్య పార్టీ కేంద్రకారా్యాలయంలో జరిగిన ముఖ్యల సమావేశంలో జయచంద్రారెడ్డి సమక్షంలోనే వ్యతిరేకత వ్యక్తం చేశారు. అంతకుముందు హార్సిలీహిల్స్‌పై జరిగిన సమావేశంలో మంత్రి జనార్దన్‌రెడ్డి, జోన్–4 ఇన్‌చార్జ్ దీపక్‌రెడ్డి సమక్షంలో జయచంద్రారెడ్డి, వ్యతిరేక వర్గం మధ్య ముష్టిఘాతాలు, బాహాబాహికి తలపడ్డారు. దీంతో సమావేశం అర్ధంతరంగా ముగిసింది. జయచంద్రారెడ్డిని మార్చాలన్న ప్రతిపాదన, డిమాండ్ ఉన్నప్పటికీ ప్రత్యామ్నయ నేత లేకపోవడంతో అధిష్టానం నిశ్శబ్దంగా ఉంది. బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం, ములకలచెరువు, పెద్దమండ్యం, తంబళ్లపల్లె, కురబలకోట మండలాల తమ్ముళ్లకు పదవులు ఎండమావిగా మారింది. మదనపల్లెలో టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి రావడంతో ఆయన్ను పార్టీ సీనియర్లు, మాజీ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. దీంతో నియోజకవర్గం విషయంలో అధిష్టానం పెద్దగా ఆలోచించడం లేదని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే అభివృద్ధి పనులకు అనుమతులు కూడా ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఫలితంగా సింగిల్‌విండో పదవులపై ఆశలు పెట్టుకున్న నిమ్మనపల్లె, మదనపల్లె రూరల్, రామసముద్రం మండలాలకు చెందిన టీడీపీ తమ్ముళ్లు తమకు పదవులు ఎప్పుడిస్తారని ఎదురుచూస్తున్నారు. రాజంపేట నియోజకవర్గంలో భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇన్‌చార్జి ఎవరో తేలకపోవడం, ఆ బాధ్యతను ఆశిస్తున్న నేతలు ఒకరికి మించి ఉండటంతో అక్కడ వర్గపోరు తీవ్రంగానే ఉంది. ఈ పరిస్థితి వల్ల తమకు సింగిల్‌విండో పదవులు దక్కడం లేదంటూ తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలోని మన్నూరు, నందలూరు, పెద్దివీడు,వీరబల్లి, మట్లి, సుండుపల్లె, తిమ్మసముద్రం, చిన్నఓరంపాడు సింగిల్‌విండోలకు త్రీమెన్ కమిటీల నియామకం ఇంతవరకు జరగకుండా పెండింగ్‌లో ఉన్నాయి. దీనితో అధిష్టానం పదవులను ఇచ్చేందుకు ఎప్పుడు కరుణిస్తుందా అని తమ్ముళ్లు ఎదురుచూస్తున్నారు.
తంబళ్లపల్లె, మదనపల్లె, రాజంపేట నియోజకవర్గాల్లో తమ్ముళ్ల ఎదురుచూపు
భర్తీ చేయని సింగిల్‌విండోత్రీమెన్ కమిటీలు
జోన్–4 ఇన్‌చార్జితో చెప్పుకున్నా కుదరని సయోధ్య