‘హరిత’ వేదికగా ఎల్లో పాలిట్రిక్స్‌ | - | Sakshi
Sakshi News home page

‘హరిత’ వేదికగా ఎల్లో పాలిట్రిక్స్‌

Aug 9 2025 5:05 AM | Updated on Aug 9 2025 5:05 AM

‘హరిత’ వేదికగా ఎల్లో పాలిట్రిక్స్‌

‘హరిత’ వేదికగా ఎల్లో పాలిట్రిక్స్‌

ఒంటిమిట్టకు కదులుతున్న కేబినెట్‌

హరిత హోటల్‌లో మంత్రుల మకాం

కార్యకర్తలతో బహిరంగంగా సమావేశాలు

రాజంపేట: ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక వైఎస్సార్‌సీపీకి అనుకూలమనే సంకేతాలతో టీడీపీ అధిష్టానం రాష్ట్ర కేబినెట్‌ను ఇక్కడికి పంపుతోంది . రోజుకొక మంత్రి వస్తున్నారు. ఒక్క జెడ్పీటీసీ స్థానం కోసం కేబినెట్‌ కదిలిరావడం చూసి ఓటర్లు ఆశ్చర్యచకితులవుతున్నారు. కులాలవారీగా మంత్రులను రంగంలోకి దింపుతున్నారు. శుక్రవారం రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి, ఫరూఖ్‌లు ఒంటిమిట్టలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరుగా ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. పోలింగ్‌ నాటికి ఎంతమంది మంత్రులు దిగుతారో చెప్పలేని పరిస్థితి. తమవంతుగా జనసేన నుంచి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌,ఎమ్మెల్సీ అనురాధలు ఉన్నారు.

● ఆదినుంచి వైఎస్సార్‌సీపీకి కంచుకోటగా ఉన్న ఒంటిమిట్టలో జెడ్పీటీసీ స్థానాన్ని కై వసం చేసుకోవాలని అధికారపార్టీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మంత్రులను ఒంటిమిట్టకు పంపిస్తున్నారు. గ్రామాల్లో ఇప్పటికే డబ్బులు, పనులను ఎరవేస్తున్నారు. అయినప్పటికీ ఒంటిమిట్ట మండల వాసులు కూటమి అధికారబలానికి తలొగ్గడంలేదు. దీంతో టీడీపీ అధిష్టానం ఆందోళనకు గురవుతోంది. మరోవైపు వైఎస్సార్‌సీపీ ప్రచార పర్వంలో దూసుకుపోతోంది. ఏ గ్రామానికి వెళ్లినా జనం నుంచి అనుహ్య స్పందన లభిస్తోంది.

● ఒంటిమిట్టకు వస్తున్న మంత్రులకు మాత్రం ఎన్నికల కోడ్‌ వర్తించడంలేదు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈ ఎన్నికల్లో గెలుపోందాలనే ఉద్దేశంతో సర్వం ఒడ్డుతున్నారు. ఎన్నికల కోడ్‌ను అధికారులు పక్కాగా అమలు చేయాలి.అయితే ఆ పరిస్థితులు ఇక్కడ కనిపించడంలేదు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఒంటిమిట్టలో అమలుకావడంలేదన్న విమర్శలున్నాయి.

● ఒంటిమిట్ట రామాలయానికి సమీపంలో ఉన్న ఏపీ టూరిజంకు సంబంధించిన హరిత హోటల్‌ ఇప్పుడు జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో ఎల్లో పాలిట్రిక్స్‌కు వేదికగా మారిందన్న విమర్శలు వెలువడ్డాయి. ఇక్కడి నుంచి మంత్రుల మంతనాలు, కార్యకర్తలు, నాయకుల భేటీలు జరిగిపోతున్నాయి.అయితే హరిత హోటల్‌ నిర్వాహకులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. యాత్రికులు వచ్చేందుకు వీలులేని పరిస్థితులు ఏర్పడ్డాయి.ఇది హరిత హోటలా..కూటమి కార్యాలయమా అన్న అనుమానాలు తలెత్తున్నాయి.

● ఈనెల 12న ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉపఎన్నిక పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ అమలు ఎక్కడా కనిపించడంలేదు. ఎన్నికల అధికారులు కూడా పత్తా లేకుండా పోయారనే విమర్శలున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే పోలింగ్‌ నాటికి పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ఒంటిమిట్ట ప్రాంతీయులు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement