
సెలవురోజుల్లో పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు
రాయచోటి టౌన్: జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని యాజమాన్యాల పాఠశాలలు ప్రభుత్వం ప్రకటించిన సెలవు దినాలలో పాఠశాలలు నిర్వహించరాదని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రహ్మణ్యం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందుకు విరుద్ధంగా ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
ధర్మకర్తలమండలి
నియామకానికి దరఖాస్తులు
రాయచోటి టౌన్: జిల్లా వ్యాప్తంగా నాలుగు ఆలయాలకు సంబంధించి ధర్మకర్తల మండలి నియామకం కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా దేవదాయశాఖ అధికారి సి. విశ్వనాఽథ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాయచోటిలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయం, మదనపల్లె పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం, గుర్రంకొండ మండలం చెర్లోపల్లిలోని శ్రీ రెడ్డెమ్మ దేవస్థానం, తంబల్లపల్లెలోని మల్లయ్యకొండ మల్లికార్జునస్వామి ఆలయాల ధర్మకర్తల మండళ్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ అయిందన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 26 లోగా దేవదాయశాఖ వారు ఇచ్చిన ప్రొఫార్మా ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
జిల్లాస్థాయి హాకీ ఎంపికలు
రాయచోటి జగదాంబసెంటర్: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని జిల్లా స్థాయి హాకీ పోటీలకు ఎంపికలు శుక్రవారం జరిగినట్లు జిల్లా హాకీ సెక్రటరీ నాగేశ్వరరావు తెలిపారు.ఎంపికై న క్రీడాకారులు జోనల్ స్థాయిలో తిరుపతిలో జరిగే హాకీ టోర్నమెంట్‌లో పొల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా హాకీ ఫౌండర్ చంద్రశేఖర్, శాప్ కోచ్ చంద్రశేఖర్, రాజు స్కూల్ హాకీ కోచ్ నారాయణ, క్రీడాకారులు పాల్గొన్నారు.
జిల్లాలో వర్షం
రాయచోటి: జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి. జిల్లాలోని కుంభంవారిపల్లి (కెవీపల్లి)లో 110.2 మిల్లీమీటర్లు, కోడూరులో 107.2 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదైంది. పుల్లంపేట 5.4, గుర్రంకొండ 6.6, రామసముద్రం 7.2, కురబలకోట 10 మిల్లీ మీటర్ల వంతున వర్షపాతం నమోదైంది. నందలూరు 96.4, చిన్నమండెం 92, కలికిరి 72.2, రాజంపేట 69.8, టి సుండుపల్లి 60.2, పెద్దమండెం 57.8, బి కొత్తకోట 55, ములకల చెరువు 42, నిమ్నపల్లి 41.4, కలకడ 40.2, వాల్మీకిపురం 38.4, పెద్దతిప్ప సముద్రం 37, సంబేపల్లి 36.4, తంబళ్లపల్లి 36.4, గాలివీడు 34.4, రామాపురం 33.4, పీలేరు 34.4, లక్కిరెడ్డిపల్లి 30., రాయ చోటి 27.2, వీరబల్లి 27. చిట్వేలి 24.8, ఓబులవారిపల్లి 24, మదనపల్లి 16.2, పెనగలూరులో 12.8 మిల్లీ మీటర్లు వంతున వర్షం కురిసింది.