
పదేళ్లుగా సబ్ కలెక్టరేట్‌లో పాగా..
రాజంపేట : రెవిన్యూ శాఖ గుండె లాంటింది సబ్ కలెక్టరేట్. ఈ శాఖలో ఎన్నో కీలక వ్యవహారాలు సాగుతుంటాయి. అయితే ఇద్దరు వ్యక్తులు కార్యాలయాన్ని తమ చేతుల్లోకి తీసుకుని నడిపిస్తున్నారే ఆరోపణలున్నాయి. పదేళ్ల నుంచి డిప్యూటేషన్ పేరుతో ఇక్కడే పాగా వేశారంటే.. ఏ స్ధాయిలో వారి అధికారాలు చెల్లుబాటు అవుతున్నాయో తెలుస్తోంది. అధికారులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. రెవెన్యూ శాఖలో భూములకు సంబంధించిన కీలక వ్యవహారాల ఫైల్‌కు వీరి ఆమోదం లభించాలి. అప్పుడే రైతుల పనులు సక్రమంగా జరిగిపోతాయి. అన్ని వ్యవహారాలు ఆ ఇద్దరితోనే నేరుగా జరుగుతున్నాయని బహిరంగంగా చర్చ సాగుతోంది.
పదేళ్లుగా ఒకే చోట...
రెవెన్యూ పరంగా అసైన్‌మెంట్, వెబ్‌ల్యాండ్ కరెక్షన్, 22ఏ,(డాట్‌ల్యాండ్), ల్యాండ్ అసైనేషన్, అల్ట్రీనేషన్‌తోపాటు భూములకు సంబంధించి వివిధ పనులు చాలా కీలకం. పదేళ్ల నుంచి కీలకమైన ఆ విభాగాలకే ఆ ఇద్దరు ఉద్యోగులు పరిమితమయ్యారు. ఇతర మండల రెవెన్యూ కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉన్నా.. మళ్లీ డిఫ్యుటేషన్‌పై సబ్ కలెక్టర్‌కు వచ్చి కొనసాగుతున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. రెవెన్యూపరంగా అత్యధిక నాలెడ్జ్ కలిగిన అధికారులు చాలామంది ఉన్నా.. వీరితో ఎందుకు పనిచేయించుకుంటున్నారో తెలియడం లేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. వీరికి ఇక్కడ పనిచేసే అవకాశం కల్పించిన ఆ ఉన్నతాధికారి ఇపుడు పనిచేయడం లేదు. సబ్ కలెక్టర్, ఆర్డీవోలు మారినా.. వీరు మాత్రం ఫెవీకాల్ వీరుల్లా సబ్ కలెక్టరేట్‌లోనే ఉండిపోతున్నారు. కొన్నేళ్లుగా ఇలాంటి భూపరమైన కీలక విభాగాలు ఇద్దరి చేతిలో పెట్టుకున్నారంటే సబ్ కలెక్టరేట్‌లో రెవెన్యూ పరిపాలన పరిస్థితి ఏవిధంగా ఉందో ఇటే అవగతమవుతోంది.
పట్టించుకోని సబ్ కలెక్టర్, ఆర్డీవోలు
సబ్ కలెక్టరేట్‌లో ఇద్దరు ఉద్యోగులు కీలకమైన ల్యాండ్ వింగ్ రెవెన్యూ విభాగంలో డిప్యూటేషన్ సాకుతో ఏళ్ల తరబడి కొనసాగుతున్నారంటే కారణాలు అనేకమే ఉన్నాయనే విమర్శలున్నాయి. కొత్తగా వచ్చిన సబ్‌కలెక్టర్ గానీ, ఆర్డీవోలు గాని వీరి గురించి ఆలోచన చేయడం లేదు. రైతులు ఆ ఇద్దరి పైస్థాఽయి ఉన్నతాధికారులను కలవకుండా నేరుగా వీరి వద్దకు వచ్చి పని చక్కబెట్టుకొనిపోతుంటారనే ఆరోపణలున్నాయి. ఏళ్ల తరబడి ఒకే విభాగాన్ని అంటిపెట్టుకున్న వీరిని నూతనంగా నియమితులైన సబ్ కలెక్టర్ భావనతోనైనా ప్రక్షాళన జరుతుందా అని ఉద్యోగుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఏయే విభాగాలు ఎవరెవరు చూస్తున్నారనే అంశంపై ఇప్పటికే ఆమె దృష్టి సారించారు. భూపరమైన విభాగాలు తమ ఆధీనంలో ఉంచుకొని విధులు నిర్వహిస్తున్న వారి వ్యవహారంపై ఆమె ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.
విధులు వేరే చోట.. కీలకమైన
విభాగాలు వారి చేతిలోనే
పట్టించుకోని సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు