
రైతులను బెదిరించి.. డబ్బు డిమాండ్
మదనపల్లె రూరల్ : వ్యవసాయ అవసరాలకోసం ఎద్దులు, ఆవు కొనుగోలు చేసి తమిళనాడుకు తీసుకువెళ్తున్న రైతుల వాహనాన్ని అడ్డగించి డబ్బు డిమాండ్ చేసిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్‌లో విలేకరులకు వివరాలను ఆయన వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై జిల్లా ఆరణి తాలూకా మయూరు గ్రామానికి చెందిన రైతులు బాలాజీ, కమలకన్నన్ అనంతపురం జిల్లా గోరంట్ల పశువుల సంతలో వ్యవసాయ అవసరాల కోసం ఆవు, మూడు దూడలు, రెండు ఎద్దులను కొనుగోలు చేశారు. టీఎన్97ఏ1451 నెంబర్ లారీలో తమిళనాడుకు తీసుకువెళ్లేందుకు బయలుదేరారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం బైపాస్ రోడ్డులోని ఆర్టీవో కార్యాలయం సమీపానికి చేరగానే.. పట్టణంలోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన రాజేంద్ర ప్రసాద్ కుమారుడు చేగూరి నాగార్జున(36), నీరుగట్టువారిపల్లెకు చెందిన శివకుమార్ కుమారుడు ఉరుపు సురేష్‌కుమార్ (27) అడ్డుకున్నారు. పశువుల తరలింపునకు సంబంధించిన ధ్రువపత్రాలు చూపించమని అడిగారు. రైతులు ఇవ్వగా.. వాటిని చించి వాహనంతోపాటు వెళ్లాలంటే రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు ఒప్పుకోకపోవడంతో దౌర్జన్యంచేసి దాడికి పాల్పడ్డారు. అంతేగాక ఆ పశువుల యజమాని మురళిదాసానికి ఫోన్ చేసి నగదు ఇవ్వకపోతే మీ మనుషులను చంపేస్తామని బెదిరించారు. సాయంత్రం పోలీస్ స్టేషన్‌కు తరలిస్తామంటూ కోర్టుభవన సముదాయం వద్దకు చేరుకోగా, నిందితులకు మద్దతుగా మరికొంతమంది వచ్చారు. రైతులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లేందుకు సిద్ధమవడంతో నిందితులు పరారయ్యారు. రైతు బాలాజీ ఫిర్యాదు మేరకు సీఐ కళావెంకటరమణ కేసు నమోదు చేశారు. నిందితులైన నాగార్జున, సురేష్‌కుమార్‌లను చిప్పిలి హంద్రీనీవా కాలువ సమీపంలో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఈ కేసులో మరింతమంది నిందితులు ఉన్నారని, విచారణ అనంతరం వారిని అరెస్టు చేస్తామన్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై గాయత్రి తదితరులు పాల్గొన్నారు.
ఇద్దరు నిందితుల అరెస్ట్