
బుద్దునికొండ కథ సుఖాంతం
మదనపల్లె : నెలరోజులుగా మదనపల్లెలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన బుద్దునికొండపై తథాగతుని తల వేరుచేసిన ఘటనపై వివాదం ముగిసింది. డీఎస్పీ మహేంద్ర పోలీసులు, సంఘాలతో సమావేశమై సమన్వయం నెలకొల్పడంతో ఉద్రిక్త పరిస్థితులకు తెరపడింది. గత జూలై 2వ తేదీన మదనపల్లె సమీపంలోని బుద్దునికొండపై భారతీయ అంబేడ్కర్ సేన ప్రతిష్టించిన బుద్ధ విగ్రహం తల వేరుచేసి చేతుల్లో ఉంచిన ఘటన వెలుగుచూసింది. దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని బాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు శివప్రసాద్ డిమాండ్ చేయగా, పోలీసులు వీఆర్‌ఓ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిరాహారదీక్ష చేయడం, పోలీసులు భగ్నం ప్రయత్నం, తర్వాత అరగుండుతో నిరసనలు..ఈ వ్యవహరంపై బాస్ శ్రేణులపై మూడు కేసులు నమోదు చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాల్లో విమర్శలు తీవ్రం చేసిన బాస్ నేతలు..ఈ నెల 9న మదనపల్లెలో నిరసనకు పిలుపునిచ్చారు. ఇద్దరు మైనర్ పిల్లలు కారణమని ఎస్పీ ప్రకటించడం, దీన్ని బాస్ వ్యతిరేకించడం జరిగిపోయింది. డీఎస్పీ మహేంద్ర, సీఐలు సత్యనారాయణ, రామచంద్ర, వీకేసీ పార్టీ ఏపీ, తెలంగాణ ఇన్‌చార్జి బాలసింగం, బాస్ ప్రతినిధులు కేవి.రమణ, గణపతి, శ్రీనివాసులు, ముత్యాలమోహన్, దొరస్వామి తదితరులతో గురువారం చర్చలు జరిపారు. ఘటన దర్యాప్తు విషయంలో పరస్పరం సహకరించుకోవాలని డీఎస్పీ మహేంద్ర, సంఘాల నేతలు నిర్ణయించారు. కేసులపై న్యాయపరంగా ముందుకు తీసుకెళ్తామని డీఎస్పీ సూచించగా ఈ విషయంలో బాస్, వీకేసీలు పోలీసులకు సహకరిస్తారని స్పష్టం చేశారు. చలో మదనపల్లె నిరసన కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నట్లు వారు ప్రకటించారు. ఈ నెల 23న వీకేసీ పార్టీ జాతీయ అధ్యక్షుడు తిమావళవన్ మదనపల్లెకు వస్తున్నారని, బుద్దునికొండ సందర్శించి అదే రోజు నూతన బుద్దుని విగ్రహ ప్రతిష్ట చేస్తారని బాస్ నేతలు తెలిపారు. దీంతో ఇప్పటిదాకా నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది.
డీఎస్పీ సమక్షంలో
వీకేసీ, బాస్ నేతలతో చర్చలు
రేపటి చలో మదనపల్లె నిరసన రద్దు