పెద్దిరెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేకే అక్రమ అరెస్టు | - | Sakshi
Sakshi News home page

పెద్దిరెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేకే అక్రమ అరెస్టు

Aug 1 2025 11:29 AM | Updated on Aug 1 2025 11:29 AM

పెద్దిరెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేకే అక్రమ అర

పెద్దిరెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేకే అక్రమ అర

మదనపల్లె రూరల్‌ : వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ కలిసి ఎంపీ మిథున్‌రెడ్డిని లేని లిక్కర్‌ స్కామ్‌లో అక్రమంగా అరెస్ట్‌ చేయించారని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నిసార్‌అహ్మద్‌ అన్నారు. కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించాలని, అక్రమంగా అరెస్ట్‌ అయి జైలులో ఉన్న రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు కావాలని కోరుతూ బుధవారం పట్టణంలోని ప్రసన్న వెంకటరమణస్వామి, బైపాస్‌రోడ్డు సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిసార్‌అహ్మద్‌ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు తారాస్థాయికి చేరాయనేందుకు ఎంపీ మిథున్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ ఓ ఉదాహరణ అన్నారు. దశాబ్దాలుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబానికి ఉన్న ప్రజాదరణను చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారన్నారు. మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదంలో ఫైల్స్‌ దగ్ధమైతే పెద్దిరెడ్డి చేయించారని తప్పుడు కేసులు పెట్టారన్నారు. అటవీ భూములు కబ్జాచేశారని, బుగ్గమఠం భూములు ఆక్రమించారని, అక్రమ మైనింగ్‌ చేశారని కేసుల మీద కేసులు బనాయించారన్నారు. ప్రతి కేసులోనూ న్యాయపోరాటం చేస్తూ తాము ఏ తప్పు చేయలేదని పెద్దిరెడ్డి కుటుంబం నిజాయితీని నిరూపించుకుంటూనే ఉందన్నారు. అయినా పెద్దిరెడ్డి కుటుంబంపై వ్యక్తిగతంగా చంద్రబాబుకు ఉన్న ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు లేని లిక్కర్‌ స్కాంను తెరపైకి తీసుకువచ్చి మిథున్‌రెడ్డిని ఇరికించి అక్రమంగా అరెస్ట్‌ చేయించారన్నారు. అయితే, ఆయన కడిగిన ముత్యంలా కేసుల నుంచి బయటకు వస్తాడన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ ఈశ్వర్‌నాయక్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు డి.మహేష్‌, ఆవుల మల్లికార్జున, శారదారెడ్డి, అపర్ణ, వినుతాభాయి, మల్లికార్జునరెడ్డి, మధు, నర్సింహులు, యూనస్‌, ఖిజర్‌ఖాన్‌, జబీవుల్లా, యాసిన్‌, జహీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement