కేవీపల్లె : తనకు దొరికిన సెల్‌ఫోన్‌ను పోలీసులకు అప్పగించి ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. మండలంలోని గుండ్రేవారిపల్లె క్రాస్‌కు చెందిన నూరుల్లా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇందులో భాగంగా గురువారం ప్యాసింజర్స్‌తో కేవీపల్లె నుంచి గుండ్రేవారిపల్లె క్రాస్‌కు బయలుదేరాడు. అయితే మార్గం మధ్యలోని గరిమిట్ట సమీపంలో రోడ్డుపై సెల్‌ఫోన్ పడి ఉండటాన్ని గుర్తించాడు. సుమారు రూ. 30 వేలు విలువైన ఫోన్‌ను నిజాయితీతో సీపీఐ నాయకులు శ్రీనివాసులతో కలసి పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐ వెంకటస్వామికి అందజేశారు. పోగొట్టుకున్న సెల్‌ఫోన్ మండలంలోని దేవాండ్లపల్లెకు చెందిన వెంకటేష్‌దిగా గుర్తించి ఆయనకు అప్పగించారు. నిజాయితీని చాటుకున్న ఆటో డ్రైవర్ నూరుల్లాను అభినందించారు.
భార్యపై కత్తితో దాడి
మదనపల్లె రూరల్ : భార్యపై భర్త కత్తితో దాడి చేసిన సంఘటన బుధవారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. బసినికొండలో నివాసమున్న కుళ్లాయి నాయక్(40) తన భార్య సుజాతబాయి (36)పై అనుమానంతో మద్యం తాగి రోజూ గొడవపడేవాడు. అదే విధంగా భర్త మద్యం సేవించడంపై భార్య సుజాతబాయి సైతం గొడవకు దిగేది. ఈ క్రమంలో బుధవారం రాత్రి కుళ్లాయి నాయక్ భార్యపై అనుమానం వ్యక్తం చేసి గొడవకు దిగడంతో వాగ్వాదం పెరిగి ఘర్షణకు దారి తీసింది.
దీంతో ఆవేశానికి లోనైన భర్త తన భార్యపై కత్తితో దాడి చేసి శరీరంపై రెండు చోట్ల పొడిచాడు. గమనించిన స్థానికులు బాధితురాలిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే సుజాతబాయి బంధువులు, కుటుంబ సభ్యులు కుళ్లాయి నాయక్‌పై దాడి చేసి కొట్టారు. దీంతో అతను గురువారం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఘటనపై తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
ఆటో–ట్రాక్టర్ ఢీ.. ముగ్గురికి గాయాలు
పీలేరురూరల్ : ఆటో – ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన మండలంలోని మొరవవడ్డిపల్లె వద్ద జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వేపులబైలుకు చెందిన ఎ. సురేష్ (45) తన ఆటోలో క్యాటరింగ్ చేసేందుకు తలపులకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో పీలేరుకు వస్తూ మార్గమధ్యంలో జాండ్లకు చెందిన షేక్ షకీలా (35), రొంపిచెర్ల మండలం చిచ్చిలివారపల్లె పంచాయతీ గొల్లపల్లెకు చెందిన ప్రభావతి (40) పీలేరుకు వెళ్లడానికి ఆటో ఎక్కారు. అయితే మొరవవడ్డిపల్లె వద్ద పీలేరు నుంచి తలపులకు వెళుతున్న ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ కింద ఆటో పడి నుజ్జునుజ్జయింది. ఆటోలో ఉన్న సురేష్, షకీలా, ప్రభావతికి తీవ్ర గాయాలు కాగా 108 వాహనంలో చికిత్స నిమి త్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్ర మాదం తీవ్ర స్థాయిలో జరిగినా ఆటోలో ముగ్గు రు ప్రాణాలతో బయటపడడంతో పెనుప్రమాదం తప్పింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆటో డ్రైవర్ నిజాయితీ

ఆటో–ట్రాక్టర్ ఢీ