
అంగళ్లులో హై టెన్షన్.!
కురబలకోట : అన్నమయ్య జిల్లాలోనే అత్యంత వివాదాస్పద భూమిగా పేరు గాంచిన అంగళ్లులోని 220 సర్వే నెంబరు భూమిని గురువారం సర్వేయర్లు కొలతలు నిర్వహించారు. హై టెన్షన్.. ఆపై కట్టుదిట్టమైన భారీ పోలీస్ భద్రత మధ్య మూడు బృందాలతో ఈ సర్వే నిర్వహించారు. రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ పహారాలో తహసీల్దార్ ధనుంజయులు పర్యవేక్షణలో ఉదయం నుంచి మద్యాహ్నం వరకు మండల సర్వేయర్ భువనేశ్వరి నేతృత్వంలో పకడ్బందీగా సర్వే నిర్వహించారు. రెవెన్యూ, పోలీసు వర్గాలు, భూ బాధితుల కథనం మేరకు..అంగళ్లులోని మిట్స్ యూనివర్సిటీ (కదిరి రోడ్డు) మార్గంలో హైవే పక్కన 220 సర్వే నెంబరు ఉంది. ఇందులో నాలుగు లెటర్లలో 69.42 ఎకరాల భూమి ఉంది. ఇందులో 220/4లోని ఐదున్నర ఎకరం అత్యంత వివాదాస్పద భూమిగా మారింది. దీనిపై రాయలసీమ జిల్లాల్లోని పులివెందుల, అనంతపురం, తిరుపతి, హిందూపురం తదితర ప్రాంతాల భూ కబ్జాదారుల కన్నుపడింది. మదనపల్లెకు చెందిన రియల్టర్ స్టోర్ రాజు, అంగళ్లు సుబహాన్ స్వాధీనంలో ఈ భూమి ఉంది. 2017 నుండి ఇక్కడ ప్లాట్లు వేసి 72 మందికి విక్రయించారు. అయితే ఈ భూమి తమదేనని మరికొందరు గత పదేళ్లగా ఈ భూమిపైకి రావడం దౌర్జన్యంగా ఆక్రమించడం జరుగుతూ వస్తోంది. ఫెన్సింగ్ వేయడం ఆ తర్వాత దీనిని అదే స్థాయిలో స్వాధీనంలో ఉన్న భూ ఆసాములు తొలగించడం జరుగుతూ వస్తోంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటుండడంతో పోలీసులకు, రెవెన్యూ అధికారులతో పాటు స్థానికులకు కూడా తలనొప్పిగా పరిణమించింది. రాష్ట్రంలో అధికారం మారినప్పుడల్లా అధికార పార్టీ అండతో ఈ భూమిపై పెత్తనం సాగించడం పరిపాటిగా వస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఈ భూమిలో తమకు మూడు ఎకరాల 15 సెంట్లు భూమి ఉందని దీన్ని సర్వే చేసి హద్దులు చూపాలని తిరుపతికి చెందిన చల్లా వెంకటేశ్వర్లు ఇటీవల స్థానిక తహసీల్దారుకు అర్జీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఆ సర్వే నెంబరులోని 35 మంది రైతులకు గురువారం సర్వే నిర్వహిస్తున్నట్లు ముందుగా నోటీసులు కూడా పంపారు. దీంతో ఒక్కసారిగా అంగళ్లు పరిసర ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది. గురువారం రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో సబ్ డివిజన్‌లోని ఎస్‌ఐలు, పోలీసులు 50 మంది దాకా బందోబస్తు నిర్వహించారు. మండలంలోని సర్వేయర్లు వీఆర్‌ఓల సహకారం వీఆర్‌ఏల సాయంతో మూడు బృందాలుగా మొత్తం సర్వే నెంబరులోని భూమిని భౌగోళిక సర్వే నిర్వహించారు. తొలుత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా పోలీసులు అప్పటికప్పుడే వాటిని సద్దుమణిగించారు. మొత్తానికి హైటెన్షన్ మధ్య సర్వే ప్రశాంతంగా జరిగింది. మధ్యాహ్నం తర్వాత ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా భారీ పోలీసు బందోబస్తుతో అంగళ్లుతో పాటు పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు పెంచింది. సర్వే సందర్భంగా పెద్ద సంఖ్యలో జనం హైవేపై గుమికూడారు. సర్వే నివేదిక సిద్ధమైన తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాలతో తదుపరి చర్యలు ఉంటాయని తహసీల్దారు ధనుంజయులు తెలిపారు.
ఇప్పట్లో తేలేలా లేదు..
ఈ భూమిపై హైకోర్టులో ఓ కేసు నడుస్తుండగా మదనపల్లె సివిల్ కోర్టులో మరో ఏడు కేసులు కొనసాగుతున్నాయి. దీన్ని బట్టి ఇప్పట్లో 220 భూ వివాదం కొలిక్కి వచ్చేలా లేదు. ప్రస్తుతం సర్వే నిర్వహించినా ఏ మాత్రం ప్రభావం చూపుతుందో చెప్పలేని పరిస్థితి. దీంతో ఈ భూ వివాదానికి కామా తప్ప ఫుల్ స్టాప్ పడే అవకాశాలు ప్రశ్నార్థకమేనని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అంగళ్లు పరిసర ప్రాంతాల్లో భూములు రేట్లు భగ్గుమంటున్నాయి. దీంతో పలువురు పాత భూ రికార్డులు, లింకు డాక్యుమెంట్లు తిరగేస్తున్నారు. డబ్బు ఆశే భూ వివాదాలకు ప్రధాన కారణంగా మారుతోంది.
ఈ భూమి మాదే..కాదు మాది
పదేళ్లుగా కొనసాగుతున్న
220 భూ వివాదం
భారీ పోలీస్ బందోబస్తు మధ్య
సమగ్ర భూ సర్వే

అంగళ్లులో హై టెన్షన్.!