
హంద్రీ–నీవా ఈఈ పోస్టుకు పోటాపోటీ
మదనపల్లె: హంద్రీ–నీవా రెండో దశశ ప్రాజెక్టులో భాగమైన పుంగనూరు ఉపకాలువ (పీబీసీ)లో కాంక్రీట్ లైనింగ్ పనులు జరుగుతుండటంతో ఈ పనులు చూసే ఎగ్జిక్యూటిన్ ఇంజనీర్ బాధ్యతల కోసం ముగ్గురు డీఈఈ (ప్రస్తుతానికి)లు ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. సత్యసాయి జిల్లా కదిరి డివిజన్–11 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నీలకంఠారెడ్డి ఈనెల 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. ప్రసుతం ఆయన పీబీసీ లైనింగ్ పనుల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్నారు. ఆయన ఉద్యోగ విరమణ అయ్యాక ఆ స్థానంలో పని చేసేందుకు డీఈఈ హోదా కలిగిన ముగ్గురు ఇప్పటికే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇద్దరికి డీఈఈ నుంచి ఈఈ పదోన్నతి లభించే అవకాశం ఉండటంతో పదోన్నతి తర్వాత ఒకరికి అవకాశం దక్కవచ్చు. మరొక డీఈఈ సత్యసాయి జిల్లా కదిరిలో సుదీర్ఘ కాలం పని చేయడంతోపాటు అక్కడి టీడీపీ నేతలతో మంచి సంబంధాలున్న కారణంగా గట్టిగా పోటీ ఇస్తున్నట్టు తెలిసింది. అయితే ఈఈ అర్హత ఉన్న వాళ్లకి మాత్రమే పీబీసీలో విధులు నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలి. అలా కాకుండా ప్రస్తుతం పీబీసీలో జేఈ స్థాయి ఉద్యోగికి డీఈగా అదనపు బాధ్యతలను అప్పగించి అత్యధిక భాగం పర్యవేక్షణ బాధ్యతలను కేటాయించినట్టుగా ఈఈ విషయంలోనూ వ్యవహరిస్తే ఏ స్థాయి ఉద్యోగికై నా అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సింది లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే ఈ విషయంలో జోక్యం చేసుకునేలా కనిపిస్తోంది. హంద్రీ–నీవాలో ఇప్పటికి మంజూరు కాని పనులను..ఈ పనులకు సంబంధం లేని ప్రాజెక్టు డివిజన్‌కు తిరుపతి సీఈ కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇది ఓ టీడీపీ ఎమ్మెల్యే ఒత్తిడి వల్ల జరిగిందని తెలుస్తోంది. ఇలా ఇష్టారీతిన సాగుతున్న నిర్ణయాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే ఈఈ బాధ్యతల అప్పగింతలో విచిత్రాలు జరిగినా ఆశ్చర్యం లేదు. ఇలా ఉండగా ఇప్పటికే ఈఈగా బాధ్యతలు చూస్తున్న ఓ అధికారి..నీలకంఠారెడ్డి ఉద్యోగ విరమణ చేశాక ఆయన బాధ్యతల పరిధిని కూడా తనకే అప్పగించేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనితో రూ.366 కోట్ల వ్యయంతో జరుగుతున్న పీబీసీ లైనింగ్ పనుల్లో ఈఈ బాధ్యతల కోసం పోటీ తీవ్రంగా ఉంది. ప్రభుత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాలి.
ప్రభుత్వ స్థాయిలో
ముగ్గురు డీఈల తీవ్ర ప్రయత్నాలు