
‘స్వాతంత్య్ర’ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు
రాయచోటి : భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జిల్లా పోలీసు పరెడ్ గ్రౌండ్‌లో కనుల పండువగా నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ముందస్తు ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు బాధ్యతాయుతంగా కృషి చేయాలని సూచించారు. కేటాయించిన విధులు పక్కాగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాల కార్యక్రమాలను ప్రతిబింబిస్తూ వివిధ శాఖలు ఏర్పాటు చేసే శకటాల ప్రదర్శన ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకునేలా ఉండాలన్నారు. అలాగే ఆయా శాఖల ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటాద్రి, డీఆర్‌ఓ మధుసూదన్ రావు, ఆర్డీఓ శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.