
దయనీయ స్థితిలో హాస్టల్ విద్యార్థులు
రాయచోటి : ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ.. దయనీయ స్థితిలో ఉన్నారని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో నెలకొన్న పారిశుద్ధ్య, ఆరోగ్య సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం వారు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పిలుపు మేరకు నాలుగు రోజులుగా సంక్షేమ హాస్టళ్లబాట పేరుతో జిల్లా వ్యాప్తంగా అనేక వసతి గృహాలను వారు పరిశీలించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయన నివేదికను జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్‌కు అందజేశారు. అనంతరం విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు జంగంరెడ్డి కిషోర్ దాస్ మాట్లాడుతూ జిల్లాలోని చాలా హాస్టళ్లలో పారిశుద్ధ్య పరిస్థితులు అత్యంత దిగజారిన స్థితిలో ఉన్నాయన్నారు. తాగునీటి సమస్యలు, నేలపై నిద్రించాల్సిన పరిస్థితులు, దోమల దాడులతో విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికీ చాలా హాస్టళ్లలో దుప్పట్లు, దోమతెరలు పంపిణీ కాలేదన్నారు. మరుగుదొడ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. తలుపులు లేని మరుగుదొడ్లతో విద్యార్థినులు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ విద్యార్థుల విద్యాభ్యాసంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. వీటితోపాటు నిధుల కొరత కారణంగా మెనూ అమలు కావడం లేదన్నారు. పురుగులున్న బియ్యంతో వండిన అన్నం, కుళ్లిన కూరగాయలతో తయారు చేసిన కూరలు విద్యార్థుల ఆరోగ్యానికి హాని చేస్తున్నట్లు తెలిపారు. ఫలితంగా ఆహారం తిన్న విద్యార్థులు తరచూ విషజ్వరాలు, వాంతులు, విరేచనాలతో ఆసుపత్రుల పాలవుతున్నారన్నారు. అంతేకాక కాస్మోటిక్స్ చార్జీలు అందకపోవడం వల్ల వ్యక్తిగత పరిశుభ్రత కూడా ప్రశ్నార్థకమవుతోందని మథనపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యానికి విద్యార్థుల ఆరోగ్యం బలవుతున్న నేపథ్యంలో విద్యార్థి విభాగం ఈ ప్రధాన డిమాండ్లపై కలెక్టర్‌కు వినతిపత్రంగా సమర్పించింది.
ప్రధాన డిమాండ్లు..
మెస్ బిల్లులు, కాస్మోటిక్ చార్జీలు తక్షణమే విడుదల చేయాలి, శిథిలావస్థకు చేరిన హాస్టళ్లల్లో మరమ్మతులకు నిధులు కేటాయించాలని, గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని, హాస్టల్ వార్డన్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, జిల్లావిద్యాశాఖాధికారులు వారానికి ఒకరోజు హాస్టళ్లలో బస చేయాలని, పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచాలని, ప్రతి నెల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాయచోటి నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షుడు వసంతం మణికంఠరెడ్డి, రాజంపేట నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షులు అబ్దుల్ ఖాన్, పీలేరు అధ్యక్షులు లోకనాథం, జిల్లా ప్రధాన కార్యదర్సి నరేష్, రాష్ట్ర కార్యదర్శి హేమంత్, బీసీ విభాగం నాయకులు శివకుమార్, బాబు గౌడ్, రాయచోటి పట్టణ అధ్యక్షులు ఫయాజ్, జిల్లా కార్యదర్శులు అంజాద్ బాష, శివకుమార్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ వసతి గృహాలను పరిశీలించిన వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం
సమస్యలపై కలెక్టర్‌కు
వినతిపత్రం అందజేత

దయనీయ స్థితిలో హాస్టల్ విద్యార్థులు