వైభవంగా సీతారాముల కల్యాణం
కలికిరి(వాల్మీకిపురం): స్థానిక పట్టాభిరామాలయంలో శుక్రవారం శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని శుక్రవారం సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు. స్వామి వారికి అర్చన, అభిషేకం, తోమాలసేవ జరిపారు. అనంతరం విశేష అలంకరణలో ముస్తాబైన ఉత్సవ మూర్తులను మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలోని ఆస్థాన మండపంలో సాంప్రదాయ బద్ధంగా తీసుకెళ్లి ఆశీనులను చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. చివరగా హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిపారు. కార్యక్రమంలో ఆలయ అధికారి కృష్ణమూర్తి, నాగరాజ, భక్తులు పాల్గొన్నారు.


