ఏసీబీ వలలో ట్రాన్స్‌కో ఏఈ
రాయచోటి/గాలివీడు: రాయచోటి విద్యుత్ శాఖ పరిధిలోని గాలివీడు సబ్‌స్టేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ సత్యమూర్తి, అతని డ్రైవర్ రైతు నుంచి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. కడప రేంజ్ అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ జి.సీతారామరావు ఆధ్వర్యంలో సోమవారం ఈ ఆపరేషన్ నిర్వహించారు. గాలివీడు మండలం ఎగువగొట్టివీడు గ్రామం కుమ్మరపల్లెకు చెందిన రైతు ఎర్రయ్యగారి నాగేశ్వర తన పొలం వద్ద విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు గాలివీడు మండలం సబ్‌స్టేషన్ అసిస్టెంట్ ఇంజినీర్ సత్యమూర్తిని కలిశారు. పొలం వద్ద ట్రాన్స్‌ఫర్ ఏర్పాటుకు గత ఏడాదిలో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు ఆధారంగా ట్రాన్స్‌కో అధికారులు పొలం ఫీల్డ్ వెరిఫికేషన్ చేపట్టి ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ మేరకు విద్యుత్ శాఖకు డబ్బులు కూడా చెల్లించారు. శాఖపరంగా అన్ని చర్యలు తీసుకున్నా పొలం వద్ద ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడంలో ఇంజనీర్ రెండు వారాలుగా ఆలస్యం చేస్తూ వచ్చారు. విద్యుత్ స్తంభాలు, వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు రూ.15 వేలు లంచంగా ఇవ్వాలని ఆ రైతును డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో సదరు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ మేరకు సోమవారం రాయచోటిలోని వై జంక్షన్ శివాలయం దగ్గర రైతు యర్రగారి నాగేశ్వర నుంచి రూ.15 వేలు డబ్బులు తీసుకుంటున్న సమయంలో డ్రైవర్ ఎన్.శ్రీనివాసులుతో పాటు ఏఈ సత్యమూర్తిని అదుపులోకి తీసుకున్నామని వివరించారు.


