ఆటో ద్విచక్ర వాహనం ఢీ: ఇద్దరికి గాయాలు
గాలివీడు : ఆటో ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరికి గాయాలైన సంఘటన మంగళవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. నూలివీడుకు చెందిన యోగాంజులు, పార్వతి ద్విచక్ర వాహనంపై చాకిబండలోని దేవాలయానికి వెళ్లి వస్తున్నారు. గాలివీడు– రాయచోటి ప్రధాన రహదారిలో ఆటో వస్తోంది. స్థానిక పెట్రోల్ బంక్ వద్దకు రాగానే మేకలను తప్పించబోయే ఆటో అదుపుతప్పి పరస్పరం ఢీకొన్నాయి. ఇద్దరికి గాయాలయ్యాయి. మరో ఇద్దరు చిన్న పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి.
వృద్ధ దంపతులకు..
మదనపల్లె : పొలం వద్ద పామును చూసి భయపడి వృద్ధ దంపతులు గాయాల పాలైన సంఘటన మంగళవారం చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలంలో జరిగింది. కొండామర్రి పంచాయతీ కొటూరుకు చెందిన ఇబ్రహీం సాహెబ్ (75), అతడి భార్య మొరంబీ(70) గ్రామ సమీపంలో ఉన్న పొలం వద్దకు వెళ్లారు. అక్కడ అల్లనేరేడు చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఉన్నపాటుగా చెట్టుపైకి చూడగా కొమ్మలపై పెద్ద పాము కన్పించింది. దీంతో కంగారుపడి ఇద్దరు పక్కకు దూకే క్రమంలో గుంతలో పడి గాయపడ్డారు. గమనించిన కుటుంబసభ్యులు 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.
మద్యం మత్తులో కుమారుడిపై కత్తితో దాడి
రైల్వేకోడూరు అర్బన్ : మద్యం తాగి రోజూ రచ్చ చేస్తున్నావంటూ.. కుమారుడు మందలించడంతో కోపోద్రిక్తుడైన తండ్రి మచ్చుకత్తితో దాడి చేసిన సంఘటన మంగళవారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. రైల్వే కోడూరు మండలం వీవీకండ్రిక పిట్టావాండ్ల గ్రామంలో నివాసముంటున్న చింతల వెంకటయ్య మంగళ వారం తెల్లవారు జామున ఫూటుగా మద్యం తాగాడు. ఇంటికి వచ్చిన ఆయనను రోజూ మద్యం తాగి రచ్చ చేస్తున్నావంటూ కొడుకు చింతల శివ మందలించాడు. తండ్రీ, కొడుకుల మధ్య మాటా మాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన తండ్రి వెంకటయ్య తన ఇంట్లో మచ్చుకత్తితో కొడుకుపై దాడి చేశాడు. శివ తలకు తీవ్రగాయమవడంతో హుటాహుటిన కోడూరు సామాజిక ఆరోగ్యకేంద్రంలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం తిరుపతి ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
మదనపల్లె : రుణదాతల ఒత్తిడి అధికం అవడంతో ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం మదనపల్లె మండలంలో జరిగింది. అంకిశెట్టిపల్లెకు చెందిన సాదిక్ బాషా, నసీజ్‌తాజ్ దంపతుల కుమారుడు నయాజ్(28) బాడుగ ఆటో నడుపుతూ తల్లిని పోషించుకుంటున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం పలువురి వద్ద రూ.1.5 లక్షలు అప్పుచేశాడు. ప్రతినెలా సక్రమంగా వడ్డీలు చెల్లిస్తున్నాడు. కొంత కాలంగా ఆర్థిక అవసరాలు పెరిగి ఇబ్బందులు తలెత్తడంతో ఏడు నెలల నుంచి వడ్డీలు చెల్లించలేకపోయాడు. మంగళవారం రుణదాతలు అప్పు ఒకేసారి చెల్లించాలని ఒత్తిడి చేయడంతో మనస్థాపం చెంది ఇంటి వద్దే సుసైడ్ నోట్ రాసి ఎలుకల మందు తిని ఆత్మహత్యయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్నారు.
రిమ్స్ మార్చురీలో గుర్తు తెలియని
వృద్ధురాలి మృతదేహం
కడప అర్బన్ : కడప నగర శివారులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(రిమ్స్)లో అనారోగ్యంతో ఈ నెల 8న గుర్తుతెలియని వృద్ధురాలు(65) చికిత్స నిమిత్తం వార్డులో చేరారు. ఈ నెల 14న పరిస్థితి విషమించి మృతిచెందారు. దీంతో ఆమె మృతదేహాన్ని మార్చురీలో వుంచారు. ఆచూకీ తెలిసినవారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని రిమ్స్ అధికారులు తెలియజేశారు.
ఆటో ద్విచక్ర వాహనం ఢీ: ఇద్దరికి గాయాలు
ఆటో ద్విచక్ర వాహనం ఢీ: ఇద్దరికి గాయాలు
ఆటో ద్విచక్ర వాహనం ఢీ: ఇద్దరికి గాయాలు


