జూద క్రీడలకు పాల్పడితే కఠిన చర్యలు
రాయచోటి : సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరించారు. పండుగ పేరుతో కోడిపందేలు, పేకాట, గుండాట వంటి జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా జిల్లా ప్రజలకు ఎస్పీ తెలియపరిచారు. పందేల కోసం స్థలాలు ఇచ్చిన యజమానులు కూడా నిందితులుగా పరిగణించి కేసులు నమోదు చేస్తామన్నారు. పోలీసు కేసులు నమోదైతే ఉద్యోగాలు, పాస్‌పోర్టు రావడం కష్టమవుతుందన్నారు. యువత తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచామని, నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టులు తప్పవని స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలపై సమాచా రం ఉన్న వారు స్థానిక పోలీసు స్టేషన్‌కు లేదా డయల్ 112కు ఫిర్యాదు చేయాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
శుభాకాంక్షలు :
జిల్లా ప్రజలు, పోలీసులు, వారి కుటుంబ సభ్యులకు, మీడియా సోదరులకు ఎస్పీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలను ప్రకటన ద్వారా తెలియజేశారు.
అన్నమయ్య జిల్లా ఎస్పీ
ధీరజ్ కునుబిల్లి


