ఆ ఊళ్లకు సంక్రాంతి లేదు!
● తరతరాలుగా వస్తున్న పాతకాలంనాటి ఆచారం
● పూర్వీకుల సాంప్రదాయాన్ని ఆచరిస్తున్న నేటితరం యువత
● కలసికట్టుగా గ్రామ కట్టుబాట్లు అమలు
గుర్రంకొండ: తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి పండుగకు మొదటిస్థానం ఉంది. పంటలు బాగా పండి ధాన్యరాశులు ఇంటికి చేరుకొన్న తరువాత వచ్చే తొలి పండుగ ఇదే. పంటలు పండించడానికి సాయపడే పశువులకు భక్తితో చేసుకొనే రైతు పండగ కూడా ఇదే. అందుకే ఆరుగాలం కష్టపడి పనిచేసే ప్రతిరైతూ ఈ పండుగను ఘనంగా జరుపుకొంటారు. ఇందుకు భిన్నంగా సంక్రాంతి పండుగను జరుపుకోని కొన్ని పల్లెలు ఉన్నాయంటే నమ్ముతారా... ఆ ఊళ్లలో సంక్రాంతి చేసుకోవడం నిషేధం.. అవును ఇదే నిజం.. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలోని 18 గ్రామాల్లో ఈ ఆచారం ఉంది. పాత కాలం నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని నేటి ఆధునిక యువత కూడా పూర్వీకుల సాంప్రదాయాన్ని ఆచరిస్తుండడం విశేషం. గతంలో ఎప్పుడో.. ఎందుకో పెద్దలు ఏర్పాటు చేసుకొన్న కట్టుబాట్లను ఇప్పటికీ గ్రామస్తులు కలసి కట్టుగా అమలు చేస్తుండడం ఆ ఊళ్ల ప్రత్యేకత.
● పురాతన ఆచారాలకు నిలయంగా మారుమూల టి.పసలవాండ్లపల్లె పంచాయతీలో మొత్తం 18 గ్రామాలను చెప్పుకోవచ్చు. వీరి పురాతన ఆచారం ప్రకారం ఆయా గ్రామాల్లో ఈపండుగను జరుపుకోవడం నిషేధం. పల్లెల్లో పశువులను సింగారించడం. అందంగా అలంకరించడం, మేళతాళాలతో ఊరేగించడం వంటి దృశ్యాలు ఇక్కడ కనిపించవు. గ్రామపొలిమేర్లలో చిట్లాకుప్పల వద్దకు పశువులను తీసుకెళ్లడం, పాడిఆవుల ఆరాధ్యదైవమైన కాటమరాయుడికి పూజలు నిర్వహించడం వంటి దృశ్యాలు మచ్చుకై నా కనిపించవు.
పాడిఆవులపై ఎంతో ప్రేమ కలిగిన ఈ గ్రామాల్లో పాడిఆవులతో వ్యవసాయం చేయడం నిషిద్ధం. సాధారణంగా రైతులు ఇప్పటికీ చాలా గ్రామాల్లో పాడిఆవులతో వ్యవసాయం చేస్తుంటారు. ఈ 18 గ్రామాల్లో మాత్రం పాడిఆవులతో వ్యవసాయ పనులు చేయరు. గోమాతను భక్తిశ్రద్ధలతో పూజించే సంస్కృతి ఇక్కడ మాత్రమే ఉండడం విశేషం.
ఆచారాలను పాటిస్తున్నాం
మాపూర్వికులు, పెద్దలు ఆచరించిన ఆచారాలను,సాంప్రదాయాలను ఇప్పటికీ పాటిస్తున్నాం. మాగ్రామదేవత శ్రీపల్లావలమ్మ ఉత్సవాల రోజున అమ్మవారి ఆవులను ఆలయం వద్దకు తీసుకొని వచ్చి పూజలు నిర్వహిస్తాం.
– బ్రహ్మయ్య, ఆలయపూజారి, బత్తినగారిపల్లె
పాడిఆవులతో వ్యవసాయమూ చేయరు..
ఆ ఊళ్లకు సంక్రాంతి లేదు!


