ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి
రొంపిచెర్ల : ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం చిచ్చిలివారిపల్లె గ్రామ పంచాయతీలోని మల్లెలక్రాస్‌లో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అన్నమ్మయ్య జిల్లా పీలేరు మండలం తలపలకు చెందిన నాగేశ్వర కుమారుడు లీలాకుమార్ (23) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం ఉదయం 7 గంటలకు మామిడి చెట్లకు మందు పిచికారి చేసేందుకు ట్రాక్టర్ తీసుకుని పీలేరు వైపు వస్తుండగా రొంపిచెర్ల మండల పరిధిలోని మల్లెల క్రాస్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లీలాకుమార్ తీవ్రంగా గాయ పడ్డాడు. అతడిని చికిత్స కోసం 108 వాహనంలో పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పుటికే అతడు మృతి చెందాడు. ప్రస్తుతం భార్య గర్భిణిగా ఉందని బంధువులు తెలిపారు. రొంపిచెర్ల పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గురైన ట్రాక్టర్‌ను రొంపిచెర్ల పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కేన్సర్ బాధితుడికి
ఎంపీ ఆర్థిక సాయం
సుండుపల్లె : మండల పరిధిలోని భాగంపల్లె గ్రామ పంచాయతీ దిన్నెమీద బలిజపల్లెకు చెందిన బోనంశెట్టి నాగరాజ కుమారుడు నాగచైతన్య (14) బోన్ బ్లడ్ కేన్సర్‌తో ప్రాణాపాయ స్థితిలో వేలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి ప్రత్యేక చొరవ తీసుకుని ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి ద్వారా బాధితుని చికిత్స కోసం రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మంచి మనసున్న నాయకుడిగా తమ కుమారుని చికిత్సకు ఆర్థిక సహాయం అందజేసి ఎంపీకి బాధితుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఒంటిమిట్ట : సంక్రాంతి పండుగలో భాగంగా మూడవ రోజు కనుమనాడు టీటీడీ సంప్రదాయబద్ధంగా నిర్వహించే పార్వేట ఉత్సవానికి ఒంటిమిట్ట రామయ్య బయలుదేరుతాడు. దాని కోసం టీటీడీ ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక నాగేటి తిప్పపై ఉన్న పార్వేట మండపాన్ని రంగు రంగు విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. పార్వేట అంటే తెలుగులో వేట అని అర్థం. ఇది దైవిక వేటను సూచిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ వేటలో ఉత్సవ మూర్తులను వేటగాళ్ల రూపంలో అలంకరించి, రాక్షసులను వేటాడినట్లుగా పూజలు చేస్తారు. అనంతరం గ్రామోత్సవంలో జగదభిరాముడు భక్తుల ఇంటి ముంగిళ్లకు వెళ్లి కటాక్షించి, తిరిగి ఆలయానికి తీసుకొస్తారు. ఈ ప్రక్రియ దేవతలు వేటగాళ్ల వలె అడవులకు వెళ్లి దుష్టశక్తులను సంహరించి, ప్రజలను రక్షించడాన్ని సూచించే ఒక పౌరాణిక వేడుక. దీని ఏటా ఒంటిమిట్టలో టీటీడీ వారు వైభవంగా నిర్వహిస్తారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
జమ్మలమడుగు : గుర్తు తెలియని వాహనం ఢీకొని మైలవరం మండలం బెస్తవేముల గ్రామానికి చెందిన మదన మోహన్ (30) మృతి చెందాడు. సోమవారం అర్థరాత్రి దాల్మియా పరిశ్రమ వద్దనుంచి స్కూటర్‌లో జమ్మలమడుగుకు వస్తుండగా తాడిపత్రి బైపాస్ రోడ్డులో ఉన్న సాయి శివాని కల్యాణ మండపం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొంది. మదన మోహన్ అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానిక అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఒంటిమిట్ట : మండల కేంద్రంలోని కడప–చైన్నె జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ చామా రాధ (35)మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చెర్లోపల్లి నుంచి తన అమ్మగారి ఊరు ఖాజీపేటకు తమ్ముడితో ద్విచక్రవాహనంలో రాధ వెళుతుండగా రామతీర్థం సమీపాన ఉన్న చెరువు కట్టపై గల దెబ్బతిని గుంతలు పడ్డ రహదారిపై అదపు తప్పి కింద పడ్డారు. ప్రమాదంలో చామా రాధ తలకు తీవ్రగాయమైది. తిరుపతిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.


