అరవైలో..ఇరవై !
రాజంపేట టౌన్ : ఐదు పదుల వయసు దాటితేనే శరీరంలో సత్తువ తగ్గుతూ వస్తుంది. ఇక ఆరుపదుల వయసు దాటితే చిన్న పని చేసినా అలసట వస్తుంది. అయితే రాజంపేట క్రికెట్ క్లబ్ (ఆర్‌సీసీ) వెటరన్ క్రీడాకారులు అందుకు భిన్నం అనే చెప్పాలి. అంతేకాక ఈ మాజీ క్రీడాకారులకు ఓ ప్రత్యేకత కూడా ఉంది. సంక్రాంతి సందర్భంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనాల పేరిట చిన్ననాటి మిత్రులు కలుసుకుంటుండటం ఇప్పుడు సర్వసాధారణమైంది. అయితే క్రికెట్ వల్ల పరిచయమైన చిన్ననాటి స్నేహితులు చిన్నప్పుడు వారు క్రీడ ఆడిన రాజంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానం (పెద్ద గ్రౌండ్)లోనే బుధవారం భోగి పండుగ రోజున సరదాగా క్రికెట్ ఆడి అలనాటి తీపి గుర్తులను నెమరవేసుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న ఆర్‌సీసీలో అనేక మంది క్రికెట్ ఆడుతూ వచ్చారు. వారిలో కొంత మందికి ఆరు పదుల వయసు దాటి ఉండగా, మరికొంత మంది నాలుగు పదుల వయసులో ఉన్నారు. కొంత మంది మధ్య వయసు రీత్యా దాదాపు ఇరవై సంవత్సరాల వ్యత్యాసం ఉంది. అలాగే వీరిలో కొంత మంది రాజకీయంగా, ఉద్యోగ రీత్యా ఉన్నత హోదాల్లో ఉండి రిటైర్డ్ అయిన వారు కూడా ఉన్నారు. అయినప్పటికీ వయసు, హోదాలు పక్కన పెట్టి అందరూ కలిసి మెలసి స్నేహితుల్లా క్రికెట్ ఆడటం గొప్ప విషయం అనే చెప్పాలి. అందరూ కూడా వెటరన్ క్రీడాకారులైనప్పటికీ క్రీడా మైదానంలోకి అడుగు పెట్టగానే చిన్నపిల్లల్లా మారిపోయి క్రికెట్ మ్యాచ్ ఆడి చిన్ననాటి స్నేహంలోని మాధుర్యాన్ని ఆస్వాదించారు.
విజయం సాధించిన అబ్దుల్లా జట్టు
వెటరన్ క్రీడాకారుల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో ఒక జట్టుకు షేక్ అబ్దుల్లా, మరో జట్టుకు వడ్డే రమణ కెప్టెన్‌లుగా వ్యవహరించారు. వడ్డే రమణ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌ను ఎంచుకొని నిర్ణీత 15 ఓవర్లలో రమణ జట్టు 63 పరుగులు చేసింది. అనంతరం 64 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన అబ్దుల్లా జట్టు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 10 ఓవర్లలోనే 64 పరుగులు చేసి విజయం సాధించింది. ఇదిలావుంటే అబ్దుల్లా జట్టులో పోలా సాయివైభవ్‌రెడ్డి మూడు ఫోర్‌లు, మూడు సిక్స్‌లతో 31 పరుగులు చేయడంతో ఆ జట్టుకు విజయం సునాయాసమైంది. క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు తరలి రావడం విశేషం. కాగా రిటైర్డ్ హెడ్‌మాస్టర్ ఎ.శంకర్‌రాజు, అన్నమాచార్య యూనివర్సిటీ ఉద్యోగి రంగా అంపైర్లుగా వ్యవహరించారు.
ఫ్రెండ్లీ మ్యాచ్‌తో వెటరన్ క్రీడాకారుల సందడి
భోగి రోజు.. ఆత్మీయ కలయికకు
వేదికై న గ్రౌండ్
హోదాలు.. వయో భేదాలు పక్కన పెట్టి..
రాష్ట్రంలోనే ప్రత్యేకత
సంతరించుకుంటున్న ఆర్‌సీసీ
అరవైలో..ఇరవై !


