పండగంటే... ఆ రోజుల్లోనే !
‘ఏం రామచంద్రప్పా.. ఇంటికాడ అందరూ బాగున్నారా..కొడుకులు ఏం చేస్తున్నారు..పిల్లపాపలు బాగున్నారా..వాళ్ల పనులేవో వాళ్లు చేసుకుంటూంటారులే’ అంటూ శివరాం పలకరింపుతో కనసానివారిపల్లిలో రచ్చబండ ముచ్చట్లు మంగళవారం మొదలయ్యాయి. ‘పల్లెల్లో మునుపటిలా పరిస్థితులు యాడుండాయి, సంక్రాంతి పండగకు అందరూ ఊరికి వచ్చినారు గాని ఊరు అభివృద్ధే తలకిందులయినాది’ అంటూ రామచంద్రప్ప అందుకున్నాడు.
అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం కనసానివారిపల్లిలో రైతులు, మహిళలు, వృద్ధులు రోజూ ఒకచోట చేరి రచ్చబండ కబుర్లు, ఊరు విషయాలు చెప్పుకుంటుంటారు. అలా పెద్ద పండగ సంక్రాంతి గురించి ‘ఆ రోజుల్లోనే పండగంటే’.. అంటూ ముచ్చట్లు చెప్పుకుంటూనే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనపై చర్చ మళ్లింది. ‘జగన్‌బాబు పాలనలో ఆఫీసులకు సచివాలయం, పంటల సాగుకు ఆర్బీకేలు, రోగమోస్తే హెల్త్ సెంటర్లు ఊరు, ఇంటికాడనే ఉండేటివి. ఊరు పొలిమేర దాటిపోలా కద మామ. ఈడనే పంపేటోడు జగన్. ఎరువు మూటకి అంగళ్లకో..మదనపల్లెకో పోతాంటివి..ఇప్పడు సూడు ఎలా ఉండాదో’..అని నిరాశలో మునిగిపోతూ చర్చ కొనసాగించుకొంటూ పోయారు. ‘చంద్రబాబు పాలన వచ్చాక ఏది మాట్లాడేది సెప్పరా సామి.. ఏదొటి మాట్లాడితే ఇదేందిరా ఈళ్లు ఇలా అంటావుండారు అంటారు. ముందుమాదిరి ఎరువులు యాడ వస్తండాయి సెప్పరా మామ..ఆగ్రికల్చరోళ్లు కనబళ్ల కద’ అని అంటుంటే.. మహిళా రైతు రాజమ్మ అందుకుంది. ‘ఏం సెప్తావులే సామి ఇత్తనాలు, ఎరువులు, ఈడ నుండే ఆర్బీకేలో తీసుకుంటుంటిమి..కాలు బయటపెట్టింది లేదు, చార్జీ ఖర్చు లేదు, తిరిగే పని తప్పింది కదా అప్పుడు..ఈయాల సూడు ఎలా ఉండాదో..ఇంటిముందిరే ఆఫీసు ఉంది కాని పనిలేక పాయే..ఏదన్నా పని కావాలన్నా సేద్యం పనులు వదిలి తిరగాల్సి వస్తాంది..అంతేకాదు నాయనా ఫించన్ కోసం సూత్తా ఉండేటోళ్ల బాధ సూడు పాపం ఎప్పుడిస్తారా అని కాపు కాస్తాన్నారు’ అంటూ నిట్టూర్చింది. వ్యవసాయ కూలీ లక్ష్మిదేవి మాట్లాడుతూ ‘ఓ అయ్యో.. పోయిన గవర్నమెంటులో మాదిరి ఈడ ఇలేజి క్లినిక్‌లో ఏం సూడ్డం లేదు, మదనపల్లికి పోతావుండారు జనం. పైసలిచ్చి ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాలంటే చానా కష్టం కద, అప్పోసొప్పోజేసి సూపించుకోవాల సామి. సూయించడం అంటే గుర్తుకొచ్చిందిగాని..జగన్ ఇచ్చిన మదనపల్లి గవర్నమెంటు కాలేజీని కూడా ప్రైవేటికి ఇస్తా ఉండాడంట సెంద్రబాబు..ఆపేసిన పనులు జేసేందుకు కాసులు లేవంట గదా, అదేమోకాని మామ ఎన్టీవోడి ఇగ్రహం పెడ్తాన్నారంట గద అమరావతిలో. దానికి 1,700 కోట్లు ఖర్చు చేస్తారట. ఈ గొన్నమెంటుకు ప్రాణమున్నోళ్ల కంటే విగ్రహాలకే యాల్యూషన్ ఎక్కువనుకుంటాను. ఇది ఇడ్డూరంగా లేదా..జగన్ ఇచ్చిన పథకాలు తీసేసి..కొన్నిదాండ్లకి పేర్లు మార్చేసిరి. జగన్ పాలనలో జనానికి బాగుండేది. పండగంటే ఆ రోజుల్లోనే’ అంటూ వర్తమాన రాజకీయాలపైనా ముచ్చట కొనసాగించారు.
మళ్లీ చర్చ కొనసాగిస్తూ...‘మనూరు పరిస్థితి ఏమిటిరా’ అందరూ సమీక్షకు దిగారు. ‘పోయిన వర్షాకాల పంట, మొన్న శనగ పంట పోయినాది కద..దానికి పెభుత్వం ఏమిచ్చింది. జగన్‌కాలమే బాగుండె.., యాళకు బీమా, పంటపోతే నష్ట పరిహారం, భరోసా..ఠంచనుగా ఖాతాలకు డబ్బులు పడేవికదా గుర్తు లేదా. పోయినతూరి వాన ల్యాకపొతే ఉలవలు ఇచ్చిరి. ఈసారి యాడిచ్చినారో, ఎవరికి ఇచ్చినారో నీకు తెలుసేమిట్రా’ అని రామచంద్రప్ప అంటే.. ‘అదేరోయ్ అప్పడైతే సెక్రటరి చెప్పేటోడు, ఇప్పడు సెప్పేటోళ్లు యాడున్నారు, సెక్రటరి, సచివాలయ ఆఫిసర్లు మనూళ్లోనే ఉంటాఉండిరి, జగన్ ఇచ్చేవన్ని సెబుతావుండ్రి, ఇస్తావుండే..ఇప్పడు ఏముందిలే..అంటూ శివరాం నిట్టూర్చాడు. ‘సరేకాని జగన్ ఉండగా మనూరి రోడ్లు బాగుపడినాయి శివరాము, ఎన్ని బిల్డింగులు వచ్చినాయి, ఆఫీసర్ సర్లు ఎంత మందుండిరి.. ఆ కతే వేరుకదా’ అంటూ రామచంద్రప్ప గత పాలనను గుర్తుకు తెచ్చుకుంటూ బాదపడసాగాడు. ‘ఏమైనా పరిపాలనంటే వైఎస్సోళ్లదే’ అనుకుంటూ ఎవరి పనులకు వాళ్లు పోసాగారు.
– టైలర్ షామీర్ బాషా(మదనపల్లె)


