మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి.. మనస్తాపంతో నిద్రమాత్రలు మింగి | Sakshi
Sakshi News home page

మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి.. మనస్తాపంతో నిద్రమాత్రలు మింగి

Published Tue, Aug 22 2023 1:52 AM

- - Sakshi

అన్నమయ్య :భర్త తనను ఇంటి నుంచి గెంటివేసి, రెండోపెళ్లి చేసుకున్నాడని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో ఓ వివాహిత ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన సోమవారం మదనపల్లెలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కురవంకకు చెందిన డేరంగుల రమేష్‌, బాబూకాలనీకి చెందిన శివజ్యోతికి 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.

పిల్లలు లేరు. దీంతో శివజ్యోతిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ రమేష్‌ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశాడు. శివజ్యోతి తండ్రితో కలిసి బాబూకాలనీలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో మొదటిభార్యకు తెలియకుండా చరితను రెండో వివాహం చేసుకుని ఒక బిడ్డకు తండ్రి అయ్యాడు. విషయం తెలుసుకున్న శివజ్యోతి శనివారం భర్త ఇంటి ముందు తనకు న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేసింది.

భర్తపై తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రెండు రోజులుగా పోలీసులు ఫిర్యాదుపై స్పందించకపోవడం, భర్తపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో శివజ్యోతి మనస్తాపం చెంది ఆదివారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సల అనంతరం ఆమె తేరుకోకపోవడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్‌ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement