విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, నాయకులతో కలిసి నిరసన తెలుపుతున్న జనసందోహం
బాబు రెండేళ్ల దగాపై ప్రజా ఉద్యమం..
‘వెన్నుపోటుకు రెండేళ్లు’ ర్యాలీల్లో ఉప్పొంగిన జనహోరు
రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల కేంద్రాల్లో ప్రజలతో కలసి కదం తొక్కిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు, నాయకులు
పేర్లు రాసుకుంటాం.. కేసులు పెడతామంటూ పోలీసుల ద్వారా సర్కారు బెదిరింపులు
అయినా లెక్క చేయకుండా తరలివచ్చిన యువత, మహిళలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు
సూపర్ సిక్స్‌సహా ఎన్నికల హామీలు అమలు చేయకుండా మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంaగా నినాదాలు
మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ ప్లకార్డులతో ర్యాలీలు
రెండేళ్లకే ఈ స్థాయిలో ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదంటున్న రాజకీయ విశ్లేషకులు
సాక్షి, అమరావతి, నెట్‌వర్క్: సూపర్ సిక్స్ సహా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 143 హామీలను అమలు చేయకుండా చంద్రబాబు సర్కార్ దగా చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజాగ్రహ జ్వాల నింగికెగిసింది. చంద్రబాబు మోసాల పాలనపై ప్రజలతో కలసి ఎక్కడికక్కడ వైఎస్సార్ సీపీ క్యాడర్, నాయకులు తిరగబడ్డారు. నల్ల బెలూన్లు ఎగరవేశారు.. బైక్ ర్యాలీలు నిర్వహించారు.. కూటమి మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటే కేసులు పెడతామంటూ అడుగడుగునా బారికేడ్లు, చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పోలీసుల ద్వారా సర్కారు బెదిరింపులకు దిగినా ప్రజలు ఖాతరు చేయలేదు.
మా పేర్లు రాసుకోండి..! ఏమేం కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి..! వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీల్లో పాల్గొని తీరుతామంటూ నియోజకవర్గాల కేంద్రాలకు శుక్రవారం జనం స్వచ్ఛందంగా, తండోపతండాలుగా తరలివచ్చారు. యువత, మహిళలు, రైతులు పోటెత్తారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి వెన్నుపోటు పొడిచిన టీడీపీ–జనసేన కూటమి సర్కార్ తీరుపై వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి సమరశంఖం పూరించారు.

పులివెందులలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు

విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నిరసన ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నేతలు, ప్రజలు

నెల్లూరులో బైక్ ర్యాలీ చేపట్టిన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు
ప్రజా ఉద్యమానికి వైఎస్ జగన్ పిలుపు..
సూపర్ సిక్స్ సహా 143 హామీలతో టీడీపీ–జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోతో ఎన్నికల ప్రచారం చేసింది. కానీ.. అధికారంలోకి వచ్చాక ఆ మేనిఫెస్టోను తుంగలో తొక్కింది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోకుండా అన్ని వర్గాలను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు రెండేళ్ల దగా పాలనపై ఈనెల 4 నుంచి 12వతేదీ వరకూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆమేరకు నిరసన కార్యాచరణ షెడ్యూలును ప్రకటించారు.

చంద్రబాబు చేసిన మోసం, దగా, వెన్నుపోటుకు సంబంధించి ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో బుక్‌లెట్‌ను విడుదల చేసి.. అది గ్రామ గ్రామానా, ఇంటింటికీ చేర్చాలని దిశా నిర్దేశం చేశారు. వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈనెల 4న అన్ని మండల కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ నిర్వహించిన నిరసన ర్యాలీల్లో జనం స్వచ్ఛందంగా కదలివచ్చి కదం తొక్కుతూ టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను దహనం చేశారు. ఈనెల 8, 9న నియోజకవర్గాల కేంద్రాల్లో చంద్రబాబు సర్కార్ దగా పాలనపై వైఎస్సార్‌సీపీ నిర్వహించిన సదస్సులకు ప్రజలు కదలివచ్చి.. కూటమి సర్కార్ మోసాలను వివరిస్తూ గళం విప్పారు.

రెండేళ్లలో ఇంత ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న సర్కారిదే..
నియోజకవర్గాల కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ శుక్రవారం చేపట్టిన నిరసన కార్యక్రమాలకు భారీ ఎత్తున జనం కదలివస్తారని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా పసిగట్టిన చంద్రబాబ సర్కార్ యధావిధిగా పోలీసులను ప్రయోగించింది. నియోజకవర్గాల కేంద్రాలకు ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు తరలివెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీన్ని ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఏమాత్రం లెక్క చేయకుండా ఉప్పెనలా కదిలి రావడంతో అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ చేపట్టిన నిరసన ర్యాలీలు, కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఇంత ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని సర్వత్రా చర్చ జరుగుతోంది.



