
ప్రజలకు ఏ సమస్య వచ్చి నా వైఎస్సార్‌సీపీ తలుపు తడుతున్నారు.. చంద్రబాబు ఎలాగూ చేయడని మాకు చెబుతున్నారు
ఇది తట్టుకోలేకే వైఎస్సార్‌సీపీపై చంద్రబాబు కుట్రలు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు
పనిగట్టుకుని తప్పుడు కేసులు.. తప్పుడు వాంగ్మూలాలతో వేధింపులు
చంద్రబాబు వేసిన తప్పుడు విత్తనం చెట్టవుతుంది
దెబ్బ తిన్నవాడు రేపు మేం అధికారంలోకి వచ్చాక నా మాట వినే పరిస్థితి ఉండకపోవచ్చు
ఇప్పటికైనా తప్పు తెలుసుకుని మేలుకో.. తప్పుడు సంప్రదాయాన్ని సరిదిద్దుకో..
లేదంటే మూడేళ్లలో మా ప్రభుత్వం రాగానే వడ్డీతో సహా చెల్లిస్తాం
ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు ఉండదా?
బీసీ మహిళ, జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారికపై దాడి దుర్మార్గం
మహానటి అంటూ బీసీ మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారా?
దాన వీర శూర కర్ణ కంటే గొప్పగా నటించేది చంద్రబాబే
ఈనాడు టాయ్‌లెట్ పేపర్‌కు ఎక్కువ.. టిష్యూ పేపర్‌కు తక్కువ
మామిడి, పొగాకు రైతులకు నేను సంఘీభావం తెలపడం తప్పా?
సినిమా డైలాగులు చెబితే చంద్రబాబుకు వచ్చి న నష్టమేంటి?
మరి బాలకృష్ణ, పవన్ సినిమాల్లో ఇంతకంటే దారుణమైన డైలాగుల మాటేంటి?
తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లలేని పరిస్థితి
హైకోర్టు ఆదేశాలున్నా సీఐ గన్ చూపించి బెదిరించడాన్ని చూశాం
మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై పచ్చ సైకోల విధ్వంసం
తిరిగి ఆయన పైనే కేసు.. దాడి చేయించిన ఎమ్మెల్యేపై ఎలాంటి కేసులు లేవు
మనం బిహార్‌లో ఉన్నామా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా?
ప్రజలకు ఏ సమస్య వచ్చినా చంద్రబాబు ఎలాగూ చేయడని తెలిసే ఆయన్ను ఎవ్వరూ కలవడం లేదు. మళ్లీ వచ్చేది వైఎస్సార్‌సీపీనే అని మా తలుపులు తడుతున్నారు. మా దగ్గరకు వచ్చి ప్రజలు వాళ్లకు జరిగిన అన్యాయాలు, సమస్యల గురించి చెబుతుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. అందుకే ప్రతిపక్ష పార్టీని అణచి వేయాలని, తద్వారా ప్రజల గొంతు నొక్కేయడానికి కుట్రలు చేస్తున్నారు. ఇందులో భాగంగా విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. – వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
చంద్రబాబూ.. మాపై నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు. ప్రజల తరఫున మా పోరాటం ఆగేది లేదు. మీ ప్రభుత్వం మహా అయితే మూడేళ్లు ఉంటుంది. మళ్లీ అధికారంలోకి వచ్చేది మా ప్రభుత్వమే. నువ్వు పెట్టే తప్పుడు కేసులకు నీతోపాటు నీకు పావులుగా మారిన వారందరికీ వడ్డీతో సహా చెల్లిస్తాం.. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు దుష్ట సంప్రదాయానికి తెరతీస్తూ వేసిన విత్తనమే రేపు విష వృక్షమవుతుంది.
రేపు మేం అధికారంలోకి వచ్చాక మీతోపాటు టీడీపీ నేతల పరిస్థితి ఏమిటి? ఈ రోజు దెబ్బతిన్న వారు రేపు ఊర్కోరు కదా.. నేను చెప్పినా సరే మావాళ్లు వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలిన వాళ్లకే ఆ బాధ తెలుస్తుంది. ఇప్పుడైనా మేలుకో.. తప్పు తెలుసుకో.. తప్పుడు సంప్రదాయాన్ని సరిదిద్దుకో.. లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. - వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ. టీడీపీ, జనసేన, బీజేపీ అధికారపక్షంగా ఉన్నాయి. ప్రజల అభిప్రాయాలను సమీకరించడం.. ప్రజలకు సంఘీభావంగా వారితో గొంతు కలపడం.. ప్రజలకు తోడుగా నిలబడి వారి పక్షాన పోరాటం చేయడం ప్రతిపక్షం ధర్మం. విశాల ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ప్రతిపక్షంగా మా ధర్మాన్ని మేం నిర్వర్తిస్తున్నాం’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా ఎన్నికల్లో ఇచ్చి న 143 హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను అడ్డగోలుగా మోసం చేసి పరిపాలన సాగిస్తున్నారని ఎత్తి చూపారు.
‘చంద్రబాబుపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయింది.. ఏ సమస్య వచ్చి నా చంద్రబాబు పరిష్కరించండని, ఆయన్ను కలిసినా వృథాయేనని ప్రజలకు బాగా అర్థమైంది. గట్టిగా మూడేళ్లు కళ్లు మూసుకుంటే చంద్రబాబు ఓడిపోతాడు. వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని ప్రజలు మా తలుపులు తడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలు, అన్యాయాలు, సమస్యల గురించి ప్రజలు మాకు చెబుతుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు.
ప్రతిపక్ష పార్టీని అణచి వేయాలని, తద్వారా ప్రజల గొంతు నొక్కాలని కుట్రలు చేస్తున్నారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తప్పుడు ఫిర్యాదులు, వాంగ్మూలాలు, సాక్ష్యాలతో వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు’ అంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఇప్పటికైనా తప్పు తెలుసుకుని పద్ధతి మార్చుకోకపోతే, రేపు తాము అధికారంలోకి వచ్చాక తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. ‘అయ్యా చంద్రబాబూ.. నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు. ప్రజల తరఫున మా పోరాటం ఆగేది లేదు. మీ ప్రభుత్వం కన్ను మూసుకుని కన్ను తెరిస్తే మహా అయితే మూడేళ్లు ఉంటుంది.
నీవు పెట్టే కేసులకు, నీతో పాటు నీకు పావులుగా మారిన అధికారులకు.. ఇద్దరికీ వార్నింగ్ ఇస్తున్నా.. వడ్డీతో మీరంతా చెల్లించాల్సి ఉంటుంది. ఇది మాత్రం మర్చిపోవద్దు’ అని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన రాష్ట్రంలో పరిస్థితిపై మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. సాక్ష్యాధారాలతో సహా చంద్రబాబు ప్రభుత్వ వ్యవహార శైలిని కడిగి పారేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
ప్రజల సమస్యలను దారి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్
» చంద్రబాబు చేసే ప్రతిపని కూడా టాపిక్ డైవర్ట్ చేసే ఆలోచనతో చేస్తున్నారు. నా పర్యటనల తర్వాత చంద్రబాబు దగ్గరుండి తప్పుడు కేసులు పెట్టించడం పరిపాటిగా మారింది.
» మిర్చి ధరలు దారుణంగా పడిపోయిన నేపథ్యంలో ఫిబ్రవరి 19న గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లాను. మా ప్రభుత్వ హయాంలో క్వింటా మిర్చి ధర రూ.21వేలు–రూ.27 వేలు పలికితే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అది రూ.8–11వేలకు పడిపోయింది. ఆ రైతులకు తోడుగా, సంఘీభావంగా మద్దతు ఇస్తూ మిర్చి యార్డుకు వెళ్లింది జగనే. అది తప్పా? అలా వెళ్లినందుకు జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న నాకు సెక్యూరిటీని విత్‌డ్రా చేశాడు. ఆయనకు మూడ్ వచ్చి నప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తాడు. చంద్రబాబు ఆదేశాలతో ఆ రోజు ఒక్క పోలీసు సహకరించకపోగా, మాపైనే కేసు పెట్టారు.
» ఏప్రిల్ 8న శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో స్థానిక ఎమ్మెల్యే వర్గీయుల చేతిలో హత్యకు గురైన మా పార్టీ బీసీ నాయకుడు కురబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లాను. హెలిప్యాడ్ దగ్గర సరైన భ్రదత లేదు. జనం తాకిడితో హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది. తిరిగి మాపైనే తప్పుడు ప్రచారం చేశారు. పైలట్ల పైనా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి విచారణ పేరుతో వేధించారు. రామగిరిలో నా పర్యాటన తర్వాత మా పార్టీ ఇన్‌చార్జి తోపుదుర్తి ప్రకాశ్‌పై కూడా కేసు పెట్టారు. ఇది ధర్మమేనా?

» జూన్ 11న ప్రకాశం జిల్లా పొదిలిలో ధరలేక ఇబ్బంది పడుతున్న పొగాకు రైతులకు సంఘీభావంగా వెళ్లాను. 40–50 వేల మంది రైతులు సంఘీభావంగా వచ్చారు. అదే సమయంలో చంద్రబాబు ఓ 40 మందితో 200 మంది పోలీసుల సెక్యూరిటీ ఇచ్చి రాళ్లు వేయించి, టాపిక్‌ను డైవర్ట్ చేయడానికి ప్రయత్నించాడు. అక్కడికీ రైతులు చాలా సమ్యమనంతో వ్యవహరించారు. 50 వేల మంది.. చంద్రబాబు పంపిన 40 మందిపై పడి ఉంటే బతికేవాళ్లా? అయినా ఆ తర్వాత మూడు కేసులు పెట్టి, 15 మంది రైతులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. మేము రైతులకు అండగా నిలబడితే చంద్రబాబుకు వచ్చి న నష్టమేంటి? ఇదీ చంద్రబాబు శాడిజం!
» గత ఏడాది పోలీసుల వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న మా పార్టీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు జూన్ 18న పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి వెళ్లాను. నా కార్యక్రమానికి ఎవ్వరినీ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. నా కార్యక్రమాలకు ఎవ్వరినీ రానివ్వకుండా అడ్డుకోవడం.. నాయకులు, కార్యకర్తలకు నోటీసులు ఇచ్చి బెదిరించడం.. ఇళ్లల్లోనే నిర్బంధించేలా చెక్‌పోస్టులు పెట్టడం.. లాఠీచార్జీలు చేయించడమే చంద్రబాబు పని. అక్కడ పోలీసులు నాకు భ్రదత కల్పించడానికి లేరు.. నా కార్యక్రమానికి ఎవ్వరినీ రాకుండా చూసుకోవడానికి నిలబడ్డారు. మాపై ఐదు కేసులు పెట్టారు.
చంద్రబాబు కుట్రల నేపథ్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. పొలిటికల్ గవర్నెన్స్‌తో చంద్రబాబు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తీరుతో రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొంది. ప్రజాస్వామ్యం, చట్టం, రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారాయి. రాష్ట్రంలో ఒకే ఒక ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీ మాత్రమే ఉంది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా పలుకుతున్న పార్టీ కూడా వైఎస్సార్‌సీపీనే. రైతులకు, అక్కచెల్లెమ్మలకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, చివరికి ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా కూడా వైఎస్సార్‌సీపీనే స్పందిస్తోంది. ప్రతిపక్షంగా మేము ఏడాదిగా అదే చేస్తున్నాం. -వైఎస్ జగన్
కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ అయిన బీసీ మహిళ హారికకు ఆత్మగౌరవం లేదా అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నా. చేతిలో అధికారం ఉంది కదా అని చంద్రబాబు శాడిజం ప్రదర్శిస్తున్నారు. ఇంతటి హేయమైన దాడి చేసి, సిగ్గులేకుండా దుర్భాషలాడి ఒక బీసీ మహిళను పట్టుకుని మహానటి అని టీడీపీ వాళ్లు ఎగతాళి చేస్తున్నారు. మీరు తప్పు చేసి, కారు అద్దాలు పగలగొట్టి.. తిరిగి ఆమెను మహానటి అంటారా? (దాడి చేసిన వీడియో క్లిప్పింగ్ ప్రదర్శిస్తూ). ఎవరు మహా నటులు? దాన వీర శూర కర్ణ కంటే గొప్పగా యాక్టింగ్ చేస్తున్న చంద్రబాబు కాదా! చంద్రబాబు లైవ్ యాక్టింగ్ చూసి ఎన్టీఆర్ ఎక్కడికో వెళ్లిపోవాలి. ఈ ఘటనలో నాగార్జున యాదవ్ అనే మరో జెడ్పీటీసీ భర్తను దారుణంగా కొట్టారు. - వైఎస్ జగన్
విశాల ప్రజా ప్రయోజనాలే లక్ష్యం
» చంద్రబాబు ఎగరగొట్టిన రైతు భరోసా సొమ్మును డిమాండ్ చేస్తూ, రైతులకు గిట్టుబాటు ధరరాని దుస్థితిని లేవనెత్తుతూ, ఉచిత పంటల బీమాను ఎత్తివేసిన పరిస్థితుల్లో ప్రశ్నిస్తూ, సమయానికి ఇచ్చి న ఇన్‌పుట్ సబ్సిడీని నీరుగార్చిన విధానాన్ని ఎండగడుతూ గత ఏడాది డిసెంబర్ 13న అన్నదాతకు అండగా వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్త ధర్నాకు పిలుపునిచ్చి రైతులకు తోడుగా నిలిచింది.
» డిసెంబర్ 24న కరెంట్ చార్జీల బాదుడుపై ప్రభుత్వాన్ని నిలదీశాం. ఎన్నికలప్పుడు చార్జీలు తగ్గిస్తానన్న పెద్దమనిషి తగ్గించకపోగా, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏడాది తిరగక మునుపే రూ.15 వేల కోట్లు బాదడాన్ని నిరసిస్తూ పోరుబాట నిర్వహించాం.
» పిల్లల చదువులతో చంద్రబాబు చెలగాటం ఆడుతూ వారికి ఇవ్వాల్సిన విద్యా, వసతి దీవెన బకాయిలు ఇవ్వకపోగా, చివరికి పిల్లల చదువులు ఆపేసి పనులకు వెళ్తున్న పరిస్థితుల మధ్య వారికి తోడుగా నిలబడుతూ మార్చి 12న యువత పోరు చేపట్టాం. నిరుద్యోగ భృతి సంగతి ఏమిటని.. గత ఏడాదికి సంబంధించి ఒక్కొక్కరికి ఇవ్వాల్సిన రూ.36 వేలు ఎగ్గొట్టిన తీరుపై యువతకు తోడుగా పోరాటం చేశాం.
» జూన్ 4న చంద్రబాబు చేసిన మోసాలను నిలదీస్తూ ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వేలాది మంది బాధిత ప్రజలతో కలిసి చంద్రబాబు ఎగ్గొట్టిన సూపర్ సిక్స్, సెవన్ హామీలను ఎత్తి చూపించాం. ఏడాదిగా ప్రజలకు చంద్రబాబు ఇవ్వాల్సిన బాకీలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన బాండ్ల సంగతి ఏమిటని నిలదీస్తూ వెన్నుపోటు దినం చేశాం.
» ఇప్పుడు బృహత్తర ప్రణాళిక తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ పేరిట బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ అన్న నినాదంతో చంద్రబాబు చేసిన మోసాలను ఎత్తి చూపిస్తున్నాం. ప్రజలను చైతన్య వంతులను చేస్తూ.. చంద్రబాబు ఇచ్చిన బాండ్ల గురించి ప్రజలకు తెలియజేస్తూ.. ఆ బాండ్లను టీడీపీ నాయకులకు చూపిస్తూ ఏడాదిలో ఇవ్వాల్సిన డబ్బులు ఎంత అని లెక్కించి చంద్రబాబును అడిగేట్టుగా జూన్ 25న కార్యక్రమం ప్రారంభించాం. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఘనంగా జరిగింది. ఇప్పుడు మండల స్థాయిలో జోరుగా సాగుతోంది.
» జూలై 21 నుంచి గ్రామ స్థాయిలోకి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తాం. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే చంద్రబాబు గతంలో అన్న మాటలు.. గతంలో ఇచ్చిన బాండ్లు.. మేనిఫెస్టో .. చంద్రబాబు చేస్తున్న మోసం.. ఏడాదిగా ఎంత బాకీ ఉన్నాడు.. అన్ని వివరాలు ఒక్కచోటే తెలుస్తాయి. తద్వారా గ్రామ స్థాయిలో చంద్రబాబును నిలదీసేట్టుగా చైతన్య కార్యక్రమాలు చేపట్టాం. మేము చేసే ప్రతి పనిలో విశాల ప్రజా ప్రయోజనాలు కనిపిస్తాయి. ప్రజలకు సంబంధించి ప్రతి అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీయించడమే మా బాధ్యత.
మాట వినకుంటే వేధింపులే
» మా ప్రభుత్వ హయాంలో పోలీసులు అత్యుత్తమ పనితీరుతో తలెత్తుకుని సేవలందించారు. మా సంస్కరణలతో పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ నడిచింది. స్పందన కార్యక్రమం ద్వారా వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమస్యల కంటే పోలీసులు, కలెక్టర్లు టీడీపీ వారి సమస్యలనే ఎక్కువగా పరిష్కరించే వారు. వివక్ష చూపించకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా పోలీసింగ్ అనేది పరిష్కరించడంలో ముందుండేది. ఈ రోజు అలాంటి అధికారులు చంద్రబాబు మాట వినకుంటే.. వాళ్ల పరిస్థితి దారుణంగా మారుతోంది.
» డీజీ స్థాయి అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులను సైతం వేధింపులకు గురి చేశారు. చంద్రబాబు మాట వినకుంటే తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారు. మరో డీజీ స్థాయి అధికారి సునీల్‌కుమార్, అడిషనల్ డీజీ సంజయ్‌లను దళిత ఆఫీసర్లు అని కూడా చూడలేదు. బీసీ ఆఫీసర్ ఐజీ కాంతిరాణా టాటాను, ఎస్సీ అధికారి, డీఐజీ విశాల్ గున్నీపై తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్ చేశారు. ఎందరో ఎస్పీ స్థాయి అధికారులపై తప్పుడు కేసులు పెట్టి విచారణల పేరుతో వేధిస్తున్నారు.
» నలుగురు నాన్ కేడర్ ఎస్పీలు, ఒక కమాండెంట్ స్థాయి అధికారి, 22 మంది అడిషనల్ ఎస్పీలు, 55 మంది డీఎస్పీలకు పోస్టింగులు లేవు. మరో ఆరుగురు డీఎస్పీలు, ముగ్గురు అడిషనల్ కమాండెంట్లు, ఇద్దరు అసిస్టెంట్ కమాండెంట్లను హెడ్‌క్వార్టర్‌కు రిపోర్టు చేయిస్తున్నారు. ఎనిమిది మంది డీఎస్పీలను సస్పెండ్ చేశారు. 80–100 మంది ఇన్‌స్పెక్టర్లు, వందలాది మంది కానిస్టేబుళ్లు వీఆర్‌లో ఉన్నారు. చంద్రబాబు మాట విననివారి పరిస్థితి ఇది. రాష్ట్రంలో ఎంతటి దుర్మార్గపు పాలన నడుస్తుందో చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు.
డీఐజీ ఓ మాఫియా డాన్
» చంద్రబాబు తన మోచేతి నీళ్లు తాగే అధికారులను పెట్టుకుని, వాళ్లను అవినీతిలో భాగస్వాములను చేసుకున్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఏమంటే.. డీఐజీ అనే వ్యక్తి ఓ మాఫియా డాన్. ఆ జోన్‌లో ఆయన కింద సీఐలు, ఓ డీఎస్పీ ఉంటారు. అదే ఆయన ఆర్మీ. సదరు నియోజకవర్గంలో ఇసుక, మద్యం, బెల్టుషాపుల అనుమతులు, పరిశ్రమల నుంచి మామూళ్ల వసూళ్లు, పేకాట క్లబ్బులు నడిపే విషయంలో డీఐజీ ఆధ్వర్యంలో సీఐలు డబ్బులు వసూలు చేయడమే పని.
» ఇక్కడ పోలీసులు వసూలు చేసి రివర్స్‌లో ఎమ్మెల్యేలకు ఇవ్వడం విచిత్రం. సగం ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు. మిగిలిన సగ భాగం పైన ఉన్న పెద్దబాబు, చిన్నబాబుకు తీసుకెళ్తున్నారు. ఇలా వసూళ్ల దందాను డీఐజీలతో నడిపిస్తున్నారు. ఇవన్నీ చూసి భరించలేక కొంత మంది ఐపీఎస్ అధికారులు.. సిద్ధార్థ కౌశల్ యంగ్‌స్టర్ రాజీనామా చేసి వీఆర్‌ఎస్ తీసుకుని వెళ్లిపోతున్నారు. ఢిల్లీకి పోవడానికి చంద్రబాబు రిలీవ్ చేయడు.. ఇక్కడే ఉండి వేధింపులు ఎందుకని రాజీనామాలు చేస్తున్నారు.
45 ఏళ్ల ఇండస్ట్రీకి మౌలిక హక్కులు తెలియవా?
» చంద్రబాబు 45 ఏళ్ల ఇండస్ట్రీలో రాజకీయ పార్టీకి మౌలికంగా ఉన్న హక్కులు ఏమిటో తెలీదా? ఈ పెద్ద మనిషి ఇన్నాళ్లు రాజకీయాలు ఎలా చేశాడు? మీటింగులు పెట్టుకోవడం, ప్రజల దగ్గరకు వెళ్లడం.. వాళ్లను చైతన్య వంతులు చేయడం.. ఇవన్నీ రాజకీయ పార్టీల హక్కులు కావా? ప్రభుత్వం ఏదైనా అన్యాయం చేసినా, నష్టం జరిగినా, ప్రభుత్వం మోసం చేసినా, ఆ ప్రభుత్వాన్నిప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు లేదా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని చెప్పడానికి నిన్నటి గుడివాడ ఘటన కళ్లెదుట కనిపిస్తున్న సాక్ష్యం.
» గుడివాడలో అక్కడి స్థానిక (గుడ్లవల్లేరు) జెడ్పీటీసీ సభ్యురాలు, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ బీసీ మహిళ హారికపై టీడీపీ సైకోలు కర్రలతో, రాళ్లతో దాడి చేశారు. ఆమె చేసిన తప్పేంటి? ఎందుకు దాడి చేశారు? దుర్భాషలాడుతూ.. నోటికొచ్చి నట్టు ఎందుకు తిట్టారు? చంద్రబాబు చేసిన మోసాలను నిలదీస్తూ ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుంటే తప్పేముంది? కారులో వెళ్తుంటే దారి మధ్యలో అడ్డగించారు. సాయంత్రం 5 గంటలకు దాడి మొదలైంది. 6.30 గంటల వరకు హారికను, ఆమె భర్తను కారులో ఉంచి తిడుతూ.. కొడుతూ.. కారు అద్దాలను ధ్వంసం చేస్తూ దాడికి తెగబడ్డారు. ఇవన్నీ పోలీసుల సమక్షంలో జరుగుతున్నా, వారు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు.
» ఇంత దారుణంగా హారికను టీడీపీకి చెందిన శాడిస్టులు దాడి చేసినట్టు స్పష్టంగా వీడియోల్లో కనిపిస్తుంటే ఎంత మందిపై కేసులు పెట్టారు? ఎంత మందిని అరెస్టు చేశారు? పై నుంచి ఫోన్లు చేసి దాడికి పంపించారు. 8న పేర్ని నాని ఓ డైలాగ్ గురించి మాట్లాడితే.. 11న మూడు రోజుల తర్వాత గుడివాడ ప్రోగ్రాంకు వెళ్తుంటే పథకం పన్ని, దారికాచి దాడి చేశారు.
కళ్లముందు కనిపిస్తున్న ఈ వీడియోను పక్కనపెట్టి హారిక భర్త రాముపై తప్పుడు కేసు పెట్టారు. ఆయన తన కారుతో గుద్దారని కేసు. హారిక, రాము ముందర సీటులో కాదు.. వెనుక సీటులో కూర్చున్నారు. హారిక జెడ్పీ చైర్‌పర్సన్.. అది ప్రభుత్వ కారు. డ్రైవర్‌ను ప్రభుత్వం ఇచ్చి ంది. ఒక బీసీ మహిళకు మీరు ఇస్తున్న గౌరవం ఇదేనా? మళ్లీ వీళ్లు బీసీల గురించి మాట్లాతారు? సిగ్గుండాలి. ఎక్కడైనా దూకిచావాలి వీళ్లంతా?
» మరుసటి రోజు పేర్నినాని, కైలే అనిల్ కుమార్.. పెడనలో సభ పెట్టిన వారందరిపై మరో కేసు పెట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా క్యాడర్ మీటింగులు పెట్టుకోకూడదా? చంద్రబాబు చేసిన మోసాలను క్యాడర్ మీటింగ్‌లో ప్రస్తావిస్తూ బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ .. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో.. క్యూఆర్ కోడ్ రిలీజ్ చేయకూడదా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేమా? దాడుల నుంచి పోలీసులు రక్షించడం పక్కనపెడితే పోలీసుల సమక్షంలోనే చేస్తున్న దాడులు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఇది సరిపోదన్నట్టు దగ్గరుండి పోలీసులే బాధితులపై తప్పుడు కేసులు పెడుతున్నారు.
ఆ సినిమాలే ఆపేయొచ్చు కదా?
» సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దర్ని రిమాండ్‌కు పంపారు. నీకు అ డైలాగులు నచ్చకపోతే సెన్సార్ బోర్డుకు చెప్పి వాటిని తీసేయించొచ్చు కదా? నిజానికి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాల్లో డైలాగులు ఇంకా దారుణంగా ఉంటాయి. సినిమాల్లో డైలాగులు, మంచి పాటలు సహజంగానే పాపులర్ అవుతాయి. మంచి పాట పాడితే తప్పు అంటావ్.. మంచి డైలాగు పోస్టర్లు పెట్టినా, మాట్లాడినా తప్పంటావ్.. సినిమా వాళ్లు చేసే హావభావాలు చేస్తే తప్పంటావ్.. బయట ఎవరైనా సరే.. ఇలా అన్నా తప్పే.. అలా అన్నా తప్పే.. అంటే ఎలా? అలాంటప్పుడు సినిమాలను ఆపేయండి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేదా? ఆలోచన చేసుకోవాలి.
» ఎవరో ఏదో సినిమా డైలాగులు కొట్టినంత మాత్రాన, పోస్టర్లు ప్రదర్శించిన మాత్రాన మీకొచ్చే నష్టమేమిటి? గుమ్మడి కాయ దొంగ అంటే భుజాలు తడుముకోవడం అన్నట్టుగా ఉంది వీళ్ల తీరు.. 131 మందికి నోటీసులు ఇచ్చారు. సినిమా డైలాగులు పోస్టర్లు పెట్టినందుకు ఇద్దర్ని రిమాండ్‌కు పంపించారు. చంద్రబాబు పేరు ఎవరు చెబితే వాళ్లను పిలిపించుకోవడం.. రోజంతా కూర్చోబెట్టుకోవడం.. వేధించడం చేస్తున్నారు. చార్జిషీట్లు చూస్తే ‘అండ్ అదర్స్’ అని ఖాళీగా పెట్టి.. వాళ్లు టార్గెట్ చేసిన వాళ్లను ఇన్‌స్టాల్‌మెంట్ బేస్‌లో చేరుస్తున్నారు.
» స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ‘అండ్ అదర్స్’లో అందర్నీ చేర్చి ఎత్తి లోపలేయడం.. ఎందుకింత కుట్రలో అర్థం కావడం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనసులు గెలుచుకొనేలా పాలన చేయాలి. అదీ సత్తా. అంతే కానీ ఓ పక్క అన్యాయమైన పాలన చేస్తూ నిన్ను ఎవరైనా ప్రశ్నిస్తే వాడు ఇట్టా అన్నాడు.. అట్టా అన్నాడంటూ కేసులు పెట్టి వేధించడం ఎంతవరకు సమంజసం? పోలీసుల దారుణాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. కొడుకును కోల్పోయిన ఆ పెద్దాయనను పరామర్శించేందుకు నేను వెళ్లాను. ఆ చనిపోయిన వ్యక్తి మా పార్టీకి చెందిన సర్పంచ్. పోలీసుల వేధింపులు వల్ల ఆయన చనిపోతే బెట్టింగ్ వలన చనిపోయాడంటూ దొంగ కేసులు పెట్టడం దుర్మార్గం.
రైతులు రౌడీషీటర్లా?
» మరొక వైపు ధరల్లేక తీవ్ర కష్టాల్లో మామిడి రైతులుంటే.. వారికి సంఘీభావం తెలిపేందుకు నేను జూలై 9న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వెళ్లాను. మా ప్రభుత్వ హయాంలో ఇదే తోతాపురి మామిడి ధర కిలో రూ.25–29 ఉంది. చంద్రబాబు సీఎం అయ్యాక రూ.2–3కు పడిపోయింది. మే 10–15 తేదీల్లో తెరవాల్సిన ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలను జూన్ 2వ, 3వ వారమైనా తెరవలేదు. ఫ్యాక్టరీలు నెల ఆలస్యంగా తెరవడం, ఒకేసారి పంట మార్కెట్‌కు రావడం, సప్లయి ఎక్కువ కావడంతో రేటు పడిపోయింది. ఇది మానవ తప్పిదం కాదా?
» చంద్రబాబు తనకు సంబంధించిన బినామీలు.. గల్లా ఫుడ్స్, శ్రీని ఫుడ్స్ వంటి వాటికి మేలు చేసేందుకే ఇదంతా చేశారు. మీరు ప్రకటించిన ధర ప్రకారం ఎంత మంది రైతులకు కిలోకు రూ.12 వచ్చి ంది. ఇది కూడా రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాని ధర. పొరుగునున్న కర్ణాటకలో కేంద్ర మంత్రి కుమారస్వామి లేఖ రాస్తే కిలో రూ.16 చొప్పున కేంద్రం కొనుగోలు చేస్తోంది. నువ్వు మాత్రం ఇక్కడ కిలో రూ.12కు కొనిపిస్తానని చెబుతున్నావు.
» 2.20 లక్షల ఎకరాల్లో 6.50 లక్షల టన్నుల పంట అమ్ముకునే దారి లేక 76 వేల రైతు కుటుంబాలు చంద్రబాబు పుణ్యమా అని అల్లాడిపోతున్నాయి. వారికి సంఘీభావం తెలిపేందుకు నేను అక్కడకు వెళ్తే.. తప్పా? నేను వెళ్లడం ఏమైనా నేరమా? బంగారుపాళ్యం పర్యటనలో రైతులు పాలుపంచుకోవడం తప్పా? ఈ పర్యటనలో వందల మందిని నిర్బంధించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 2 వేల మందికి ఎందుకు నోటీసులు ఇచ్చారని అడుగుతున్నా.
» ముగ్గురు ఎస్పీలు, 9 మంది డీఎస్పీలు, 2 వేల మంది పోలీసులు, ప్రతి గ్రామానికి, ప్రతి సందుకు చెక్ పోస్టులు పెట్టారు. వీళ్లంతా నాకు సెక్యురిటీ కోసం కాదు.. నా కార్యక్రమానికి ఎవరూ రాకుండా అడ్డుకునేందుకు ఏర్పాటు చేశారు. బైకులకు పెట్రోల్ పోయకూడదని చివరికి పెట్రోల్ బంకులకు కూడా నోటీసులు ఇచ్చారు. అయినా సరే కడుపు మండిన రైతులు వేలాదిగా తరలి వచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం, దేశం దృష్టికి సమస్య వెళ్లాలని మామిడి కాయలను రోడ్లపై పారబోసి నాతో కలిసి వచ్చారు. ఈ పర్యటనపై ఐదు కేసులు పెట్టారు. 20 మందిని అరెస్ట్ చేశారు.
ఈనాడు.. అదీ ఒక పేపరేనా?
» రైతుల కోసం, రైతుల తరఫున, రైతులకు సంఘీభావం తెలిపేందుకు చేపట్టిన కార్యక్రమం అది. ఇదేదో నేరమన్నట్టుగా రైతులను, ప్రతిపక్షాన్ని పట్టుకొని రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులు, దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈనాడు.. అదీ ఒక పేపరేనా? ఈనాడు పేపరు చూస్తుంటే ‘టాయిలెట్ పేపర్‌కు ఎక్కువ.. టిష్యూ పేపర్‌కు తక్కువ’ అన్నట్టుగా ఉంది. ఏమిటా రాతలు? ఓ పక్క ధర లేక రైతులు రోడ్డు మీదకు వస్తుంటే రైతులందరూ బ్రహ్మాండంగా కేరింతలు కొడుతున్నారని రాస్తున్నారు.
» మామిడి పండ్లను రోడ్లపై వేసినందుకు వాళ్లపై కేసులు పెట్టారు. తమకు అన్యాయం జరిగిందని రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రశ్నించకూడదు. రోడ్డెక్కి నిలదీయకూడదన్నట్టుగా ఉంది చంద్రబాబు పాలన తీరు. ఎన్నికల్లో ఇచ్చి న సూపర్ సిక్స్, సూపర్ సెవెన్‌తో సహా 143 హామీలన్నీ నెరవేర్చేశామని ప్రజలంతా భావించాలట! వారంతా ఆనందంగా కేరింతలు కొడుతున్నట్టుగా భావించాలన్నది చంద్రబాబు ఉద్దేశం. కాదు.. కుదరదు అని ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు.. తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు.. అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం. పాలకుడని చెప్పుకునేందుకు చంద్రబాబుకు, మీడియా అని చెప్పుకునేందుకు ఈ ఎల్లో మీడియాకు సిగ్గుండాలి.
ఇది పైశాకత్వం కాదా?
» రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో చెప్పాలంటే.. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటికి తాను వెళ్లలేని పరిస్థితి. కోర్టు ఆదేశాలు ఉన్నా ఆయన ఎప్పుడు అక్కడకు వెళ్లాలని ప్రయత్నం చేసినా పోలీసులు అడ్డుకుంటున్నారు. సీఐ ఏకంగా గన్ చూపిస్తున్నాడు. (వీడియో చూపిస్తూ).. అసలు బీహార్‌లో ఉన్నామా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా? అర్థం కావడం లేదు. ఏకంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై ఒక పథకం ప్రకారం పచ్చ సైకోలు, పచ్చ శాడిస్ట్‌లు పోలీసుల సమక్షంలోనే ఇంట్లోకి చొరబడి ధ్వంసం చేసిన ఘటన చేశాం.
» ప్రసన్న నిజంగా ఇంట్లో ఉండి ఉంటే చంపేసి ఉండేవారు. (పోలీస్ సైరన్ మోగుతూ వాహనం ఇంటి బయటే ఉండగానే ఇంట్లోకి చొరబడుతున్న ఘటనకు సంబంధించిన వీడియోను ప్రదర్శిస్తూ). అదృష్టవశాత్తు ప్రసన్న ఇంట్లో లేడు. ఇంట్లో ఉండి ఉంటే మనిషే లేకుండా చేసే వారు. దాడి చేయించిన, ధ్వంసం చేయించిన ఎమ్మెల్యేపై కానీ, వాళ్ల మనుషులపై కానీ ఎలాంటి చర్యలు.. కేసులుండవు. ఎలాంటి అరెస్ట్‌లు చేయరు. తిరిగి ప్రసన్నపైనే పోలీసులు కేసులు పెట్టారు. ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా? ఈ రాష్ట్రంలో ఇక ఎవరికి రక్షణ ఉన్నట్టు? ఇది శాడిజం కాదా? పైశాచికత్వం కాదా? రాజకీయ కుట్రలతో రాష్ట్రంలో ఒక దుష్ట సంప్రదాయాన్ని తీసుకొచ్చి , దాన్ని కొనసాగిస్తున్నారు.
అన్నింటికీ ఒకటే మోడస్ ఆపరండా
» ఒక కేతిరెడ్డి, పెద్దిరెడ్డి, ప్రసన్నకుమార్‌లే కాదు.. కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వల్లభనేని వంశీ, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోసాని కృష్ణమురళితో సహా ఎంతో మందిపై తప్పుడు కేసులు పెట్టారు. వీరితో పాటు 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుతో సహా కృష్ణమోహన్, ధనుంజయరెడ్డి వంటి జీవితంలో మచ్చలేని రిటైర్డ్ అధికారులపై.. ఇలా ఎంతో మందిపై తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తున్నారు. అన్నింటికీ ఒకటే మోడస్ ఆపరండా. తమకు కావాల్సినట్టుగా వాంగ్మూలాలు తీసుకోవడం, వాటి ఆధారంగా ఇష్టమొచ్చి నట్టు అరెస్టులు చేయడం.
» ఇదే మోడస్ ఆపరండాతో దేశంలో ఎవరినైనా, ఎక్కడైనా.. ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు అని చంద్రబాబు చూపిస్తున్నాడు. ప్రధాని మోదీ, అమిత్‌షాలను కూడా అరెస్ట్ చేయొచ్చు. ఎలాంటి మినహాయింపు లేదు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడైన నాతో పాటు మా పార్టీకి చెందిన గ్రామ, రాష్ట్ర స్థాయి నాయకులు, చివరికి సోషల్ మీడియా కార్యకర్తలపై కూడా ఇదే మోడస్ ఆపరండాతో తప్పుడు ఫిర్యాదులు, తప్పుడు వాంగ్మూలాలు.. తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెడుతున్నారు.
» ఇదే సంప్రదాయాన్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కొనసాగిస్తే.. దెబ్బలు తిన్న వీళ్లు ప్రతిచర్య మొదలు పెడితే మీ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించుకోమని అడుగుతున్నా. మీరు ప్రారంభించిన ఈ తప్పుడు సంప్రదాయం విష వృక్షంగా మారుతుంది. ఎల్లకాలం రోజులన్నీ ఒకేలా ఉండవు. అధికారం ఎవరి చేతుల్లోనూ శాశ్వతంగా ఉండదు. ఈరోజు పైన మీరు ఉన్నారు. నాలుగేళ్ల తర్వాత మేము పైకి వస్తాం. మీరు కిందకు వస్తారు. అప్పుడు పరిస్థితి ఏమిటి? తప్పు తెలుసుకో.. తప్పుడు సంప్రదాయాన్ని సరిదిద్దుకో.. లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.