కరెంట్‌ బకాయిలపై బాధ్యత తీసుకోండి

YSRCP MPs made a request to Union Power Minister - Sakshi

కేంద్ర విద్యుత్‌ మంత్రికి వైఎస్సార్‌ సీపీ ఎంపీల బృందం వినతి

తెలంగాణ నుంచి రూ.6,111 కోట్ల విద్యుత్‌ బకాయిలు

దీర్ఘకాలంగా పెండింగ్‌తో ఆర్థిక ఇబ్బందుల్లో ఏపీ విద్యుత్‌ సంస్థలు

కేంద్రం ఆదేశాల మేరకే నాడు ఏపీ జెన్‌కో విద్యుత్‌ సరఫరా

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించాల్సిన రూ.6 వేల కోట్లకుపైగా విద్యుత్‌ బకాయిలను వెంటనే చెల్లించేలా చొరవ తీసుకోవాలని వైఎస్సార్‌ సీపీ ఎంపీల బృందం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. విభజన నష్టాలతోపాటు కోవిడ్‌ కారణంగా రాబడి కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి బకాయిల వసూలు అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణకు విద్యుత్తు సరఫరా చేసినందున బకాయిలు చెల్లించేలా బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మన్నవరంలో విద్యుత్‌ ఉపకరణాల తయారీ జోన్‌ నెలకొల్పాలని కోరారు.

పన్నుల వాటాలో మినహాయించైనా..
ఏపీ జెన్‌కోకు తెలంగాణ డిస్కమ్‌లు చెల్లించాల్సిన రూ.6,111 కోట్ల బకాయిలను వెంటనే ఇప్పించి నష్టాల్లో ఉన్న విద్యుత్‌ సంస్థలను ఆదుకోవాలని వైఎస్సార్‌ సీపీ ఎంపీల బృందం కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ను కోరింది. పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభా పక్షనేత పీవీ మిధున్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీల బృందం బుధవారం ఆర్కే సింగ్‌ను కలుసుకుని పలు అంశాలతో వినతిపత్రాన్ని సమర్పించింది. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్‌  బకాయిల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది.

రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం ఆదేశాల మేరకు ఏపీ జెన్‌కో 2014 జూన్‌ 2 నుంచి 2017 జూన్‌ 10 వరకు తెలంగాణ డిస్కమ్‌లకు విద్యుత్‌ సరఫరా చేసినట్లు గుర్తు చేశారు. ఈ బకాయిలను తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకూ చెల్లించలేదని తెలిపారు. కేంద్ర విద్యుత్‌ శాఖ అధికారులతో గతేడాది నవంబర్‌ 8న తెలుగు రాష్ట్రాల అధికారుల చర్చల సందర్భంగా సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని సూచించినా ఇంతవరకు కొలిక్కి రాలేదని తెలిపారు. తెలంగాణ వాటాగా కేంద్రం విడుదల చేసే పన్నుల ఆదాయం నుంచైనా మినహాయించి ఆంధ్రప్రదేశ్‌కు బకాయిలను చెల్లించాలని విజయసాయిరెడ్డి కోరారు.

వినతిపత్రంలో ఇతర అంశాలు..
► చిత్తూరు జిల్లా మన్నవరంలో ఎన్‌బీపీపీఎల్‌ ప్లాంట్‌ కోసం కేవలం 5 ఎకరాలను మాత్రమే వినియోగిస్తోంది. వృథాగా ఉన్న మిగిలిన 748 ఎకరాలను ఎన్టీపీసీ – ఏపీఐఐసీ  జాయింట్‌ వెంచర్‌తో పవర్‌ ఎక్విప్‌మెంట్‌ తయారీ కోసం మాన్యుఫాక్చరింగ్‌ జోన్‌గా మార్చాలి.
► కరువు నివారణకు రాయలసీమ డ్రాట్‌ మిటిగేషన్‌ ప్రాజెక్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో 27 ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. రూ.12,500 కోట్ల మేర ఆర్థిక సాయం అందించేందుకు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఎస్పీవీ కింద ప్రతిపాదించిన అన్ని ప్రాజెక్టులను ఒకే ప్రాజెక్టుగా పరిగణించి రుణ సదుపాయం కల్పించాలి. 

ఆక్వా రైతులకు బీమా
కేంద్ర మత్స్యశాఖ మంత్రికి వైఎస్సార్‌సీపీ ఎంపీల వినతి
పెద్దఎత్తున విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్న ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు ఆక్వా రైతులకు బీమా పాలసీ అమలు చేయాలని వైఎస్సార్‌ సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆక్వా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోందని, కేంద్రం మద్దతిస్తే మెరుగైన తోడ్పాటు అందించవచ్చని నివేదించారు. ఆక్వా ఉత్పత్తులను ప్రోత్సహించి అభివృద్ధి చేసేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతుభరోసా కేంద్రాల ద్వారా ఆక్వా ల్యాబ్స్‌ ఏర్పాటు చేశారని తెలిపారు. సీడ్, ఫీడ్‌ అందజేయడంతోపాటు మెరుగైన గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్లు వివరించారు.

వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఎంపీల బృందం బుధవారం ఢిల్లీలో కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలాను కలుసుకుని ఈమేరకు పది అంశాలపై వినతిపత్రాన్ని అందజే సింది. ఎంపీలు మోపిదేవి వెంకటరమణరావు, గురుమూర్తి, బెల్లాన చంద్రశేఖర్, వంగా గీత వీరిలో ఉన్నారు. దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టిందని తెలిపారు. విజయనగరం జిల్లా చింతపల్లి, విశాఖపట్నం జిల్లా భీమిలి, రాజయ్యపేటల్లో రూ.75 కోట్లతో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లను ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన కింద కేంద్రం అనుమతించిందన్నారు.

నెల్లూరు జిల్లా తడ, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో చేపల వేటకు వెళుతున్న మత్స్యకారులు పలు సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. తరచూ ఘర్షణలు చోటు చేసుకోవడం, పరస్పరం కేసులు నమోదు కావడంతో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు తెలిపారు. దీన్ని శాశ్వతంగా పరిష్కరించేందుకు పులికాట్‌ సరస్సులో ఇసుకమేట డ్రెడ్జింగ్‌కు రూ.45 కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. నిధులు వెంటనే విడుదల చేయాలని కోరగా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. 

వినతిపత్రంలో ఇతర ముఖ్యాంశాలివీ..
► సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆక్వా కల్చర్‌ అథారిటీ ప్రాంతీయ కార్యాలయానికి కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో భూమి కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
► ఆక్వా రంగం ఆర్జించే విదేశీ మారక ద్రవ్యంలో రూ.15,600 కోట్ల వాటా ఏపీదే.
► ఆక్వా రంగానికి పవర్‌ టారిఫ్‌ తోడ్పాటు ఇవ్వాలి. 
► రూ.40 కోట్లతో విశాఖ జిల్లా బండారుపల్లిలో ఆక్వా క్వారంటైన్‌ సెంటర్‌కు సవరించిన అంచనాలతో కేంద్రం గ్రాంటు మంజూరు చేయాలి. 
► విశాఖలో నౌకాదళ విన్యాసాల సమయంలో జీవనోపాధికి ఇబ్బంది పడుతున్న మత్స్యకారులకు రూ.10 వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలి.
► బుడగట్లపాలెం, చింతపల్లి, ముక్కాం గ్రామాల్లో జెట్టీలు ఏర్పాటు చేయాలి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top