అభివృద్ధి, విభజన హామీలపై రాజీలేని పోరాటం 

YSRCP MPs On CM YS Jagan Development Andhra Pradesh - Sakshi

రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన శుభపరిణామం 

మేనిఫెస్టో హామీ నెరవేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

గోదావరి వరదలకు, పోలవరానికి లింకా! 

పీపీఏ–కేంద్రం సమన్వయంతోనే పోలవరం ప్రాజెక్టుపై నిర్ణయం  

మీడియాతో వైఎస్సార్‌సీపీ ఎంపీలు

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రంగాల అభివృద్ధి, విభజన హామీలపై రాజీలేని పోరాటం చేస్తామని వైఎస్సార్‌సీపీ ఎంపీలు స్పష్టం చేశారు. ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న రామాయపట్నం పోర్టుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనుండటం శుభపరిణామమన్నారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో మంగళవారం వైఎస్సార్‌సీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, వంగా గీత, బెల్లాన చంద్రశేఖర్, పోచ బ్రహ్మానందరెడ్డి మీడియాతో మాట్లాడారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. 14 పోర్టులు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని, దీంట్లో భాగంగానే రామాయపట్నం పోర్టుకి సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేస్తున్నారని తెలిపారు.

ఏపీ పునర్విభజన చట్టంలో దుగరాజుపట్నం పోర్టును పొందుపరిచినా, ఆ పోర్టు నిర్మాణానికి ఆలస్యం జరుగుతున్న పరిస్థితుల్లో రామాయపట్నం పోర్టును కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని అనేకమార్లు పార్లమెంటు లోపల, బయట కోరామని గుర్తుచేశారు. చివరికి కేంద్రం చేపట్టకపోయినా రామాయపట్నం పోర్టు కూడా ఆలస్యం అవుతున్నందున పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం.. దీన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారని చెప్పారు. త్వరలోనే మచిలీపట్నం పోర్టు కూడా వస్తుందని చెప్పారు.  

ప్రతిపాదనలు ఆమోదించాలి 
ఎంపీ వంగా గీత మాట్లాడుతూ ఏపీలో ఎయిర్‌ పోర్టులు, రోడ్లు, ఫిషింగ్‌ హార్బర్ల ఏర్పాటు కోసం తమ పార్టీ ఎంపీలంతా పార్లమెంటులో గళం వినిపిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన్‌గడ్కరీ చేసిన 38 ఫ్లైఓవర్ల వాగ్దానాన్ని త్వరగా నెరవేర్చాలన్నారు. సింహాచలం, అంతర్వేది, అన్నవరం దేవాలయాలను టూరిజం పరిధిలోకి తీసుకుని అభివృద్ధి చేయాలని కోరామన్నారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని, విభజన తర్వాత రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు, విభజన హామీలు నెరవేర్చాలని డిమాండు చేస్తున్నామన్నారు. గోదావరి వరదలకు పోలవరం ప్రాజెక్టు ఎత్తుకు లింకు పెడుతూ రాజకీయ కామెంట్లు చేయడం సరికాదన్నారు.

జూలైలో గోదావరికి ఈ స్థాయి వరదలు ఎప్పుడూ రాలేదని తెలిపారు. ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ జాతీయ ప్రాజెక్టు పోలవరానికి సంబంధించి ఏ నిర్ణయమైనా పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్రం సమన్వయంతోనే జరుగుతుందని చెప్పారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టులు అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వ్యవసాయం, పరిశ్రమలు, మౌలికవసతులు, సేవలకు సంబంధించి అన్నిరంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషిచేస్తున్నారని చెప్పారు.

9 ఫిషింగ్‌ హార్బర్ల ద్వారా మత్స్యసంపద పెంచడంతోపాటు ఉపాధి అవకాశాలు పెంచుతున్నామన్నారు. వైద్యరంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో మరో 13 వైద్య కళాశాలలకు కూడా త్వరితగతిన అనుమతులివ్వాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి, చొరవతో రాష్ట్రంలో సంక్షేమంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయని చెప్పారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top