బడ్జెట్‌ నిరుత్సాహ పరిచింది

YSRCP MP Vijayasaireddy Response On The Union Budget - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోస్‌లా ఉంటుందనుకున్న కేంద్ర బడ్జెట్‌ నిరుత్సాహ పరిచిందని వైఎస్సార్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చెప్పారు. పైకి స్టైల్‌గా కనిపించినా.. వాస్తవంగా అందులో ఏమీ లేదన్నారు. ఆర్థిక మంత్రి సబ్‌కా వికాస్‌ అని చెప్పినప్పటికీ రాష్ట్రాలకు ప్రయోజనకారిగా లేదని తెలిపారు. మంగళవారం ఏపీ భవన్‌లో ఎంపీలు మిధున్‌రెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, మార్గాని భరత్, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, తలారి రంగయ్య, వంగా గీత, చింతా అనూరాధ, గొడ్డేటి మాధవి, గురుమూర్తి, రెడ్డెప్ప, మాధవ్, ఎంవీవీ సత్యనారాయణ, లావు శ్రీకృష్ణదేవరాయలు, పోచ బ్రహ్మానందరెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

ఎఫ్‌ఆర్‌బీఎంలో ఇదేమిటి?
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జీఎస్‌డీపీలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని 3 శాతంగా నిర్ధారించినా, దానికన్నా ఎక్కువ రుణాలు తీసుకున్నారు. ఆ మొత్తాన్ని ఇప్పుడు రాష్ట్రానికి నిర్థారించిన రుణ సేకరణలో తగ్గించే ప్రయత్నం జరిగింది. దీనిని వెంటనే ప్రధాని దృష్టికి తీసుకెళ్లాం. ఎఫ్‌ఆర్‌బీఎం కేంద్రం, రాష్ట్రాలకు ఒక్కటే. కానీ కేంద్రం ఆ పరిధి దాటొచ్చని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దాటొద్దు అంటూ ద్వంద్వ ప్రమాణాలు పాటించడం అభ్యంతరకరం. మూల ధన వ్యయం కింద గతంలో రాష్ట్రాలకు రూ.15 వేల కోట్లు ఇవ్వగా, ఈసారి లక్ష కోట్లు ఇస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు.

ఇది స్వాగతించదగినదే అయినా, కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి ఇస్తున్న మొత్తం 4.047 శాతం మాత్రమే. దీంతో రాష్ట్రానికి వచ్చేది రూ.4 వేల కోట్లే. కేంద్ర పన్నుల్లో మహారాష్ట్రకు 6.31 శాతం, మధ్యప్రదేశ్‌కు 7.8 శాతం, యూపీకి 17.9 శాతం ఇస్తున్నారు. ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. అయినా అన్యాయం జరుగుతోంది. గతేడాది ఆంధ్రప్రదేశ్‌కు రూ.35 వేల కోట్లు రాగా, యూపీకి రూ.1.53 లక్షల కోట్లు ఇచ్చారు. జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు ఆదాయం తగ్గినందువల్ల మరో 5 ఏళ్లు రాష్ట్రాల వాటా పొడిగించాలని కోరినా ఏ ప్రస్తావనా లేదు.

నదుల అనుసంధానం ఖర్చు తిరిగివ్వాలి
నదుల అనుసంధానం అభినందనీయం. గోదావరి– కృష్ణా,  కృష్ణా–పెన్నా అనుసంధానం పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొంత ఖర్చు చేసింది. ఆ ఖర్చును తిరిగివ్వాలి. పీఎం గతి శక్తిలో తూర్పు తీరం డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ (ఖరగ్‌పూర్‌ నుంచి విజయవాడ వరకు), రాష్ట్రంలోని పోర్టులను కలుపుతూ డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ పనులు చేపట్టాలి. భోగాపురం జాతీయ రహదారిని వేగంగా పూర్తి చేయాలి. పీఎం జన ఆరోగ్య యోజన కింద మధ్య తరగతికి ఆరోగ్య బీమా అందించాలి. ఉపాధి హామీలో కవరేజ్‌ పెంచలేదు. పీఎం కిసాన్‌ పథకంలో భూమి లేని రైతులను పూర్తిగా వదిలేశారు.

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరుతున్నాం. ధాన్యం సేకరణకు స్పష్టమైన పాలసీ లేదు. విశాఖ ఉక్కు, ఎల్‌ఐసీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నాం. ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్‌ అనేది ఇప్పటికే రాష్ట్రంలో సచివాలయాల్లో మొదలు పెట్టాం. స్టాంప్‌ డ్యూటీకి దేశమంతా ఒకే విధానం ఉండాలన్న అంశాన్ని కేంద్రం ప్రతిపాదించినప్పుడు స్పందిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పింఛన్‌  విధానంలో అదనంగా 4%, అంటే 14%వరకు పన్ను రాయితీ ఇవ్వడం అభినందనీయం. క్రిప్టో కరెన్సీపై కేంద్రం నిర్ణయం స్వాగతించదగ్గది.

చదవండి: పనికిమాలిన పసలేని బడ్జెట్‌ ఇది: సీఎం కేసీఆర్‌ 

మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌ టీడీపీకి ప్రయోజనకారి
నేషనల్‌ టెలి మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌ మంచి నిర్ణయం. దీని వల్ల ప్రయోజనం పొందేది టీడీపీయే. ఆ పార్టీలో చాలా మందికి మెంటల్‌ సమస్యలు వచ్చాయి. దాన్ని వారు వినియోగించుకోవాలి. 

సీఎం నివేదించిన అంశాలపై సానుకూల స్పందన ఆశిస్తున్నాం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాన మంత్రికి నివేదించిన 10 అంశాలను కమిటీ ముందుంచాము. వాటి మీద సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం. సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలులో ముందున్న రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టుతో పాటు 13వ షెడ్యూల్‌లో ఉన్న అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం. వాటికి సానుకూల స్పందన వస్తుందని భావిస్తున్నాం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top