జీరో అవర్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమ ప్రాంతంలో.. ముఖ్యంగా వైఎస్సార్ కడప జిల్లాలో అరటి రైతులు తీవ్రసంక్షోభంలో ఉన్నారని, ధరలు భారీగా పతనం కావడంతో దిక్కుతోచనిస్థితిలో ఉన్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల పులివెందుల ప్రాంతంలో అరటి రైతుల కష్టాలను స్వయంగా పరిశీలించారని, ఆయన సూచన మేరకు ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకొస్తున్నానని చెప్పారు.
కరవు ప్రాంతమైనప్పటికీ రైతులు ఆధునిక టిష్యూ కల్చర్ (జీ9/కావెండిష్ రకం) ఎకరాకు 60–70 టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నారన్నారు. ప్రధాన సాగుప్రాంతమైన పులివెందులలో ఇటీవల వరకు టన్ను రూ.22 వేలు పలికిన అరటి ధర నెలరోజుల్లోనే టన్ను వందల రూపాయలకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి దిగుబడి వచ్చినా గిట్టుబాటుధర లేకపోవడంతో పంటను అమ్ముకోలేక రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. గెలలు చెట్ల మీదే పండి కుళ్లిపోతున్నాయని, కొన్నింటిని పారవేస్తున్నారని తెలిపారు.
మరోవైపు వర్షాభావ పరిస్థితులు, కరవు కారణంగా 2025 ఖరీఫ్ సీజన్‌లో సాగు గణనీయంగా తగ్గిపోయిందన్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో సాధారణ సాగుతో పోలిస్తే 19–35 శాతం మాత్రమే సాగు జరిగిందని చెప్పారు. ధరలు పడిపోయిన నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు ముంబై, కోల్‌కతా వంటి ప్రాంతాలకు రైలుమార్గం ద్వారా అరటిని తరలించాలని సీఎం ఆదేశించారని, అయితే ఇంతటి తీవ్రమైన సంక్షోభంలో ఉన్న రైతులకు ఇది ఏమాత్రం సరిపోదని తెలిపారు.
కేవలం అధిక దిగుబడినిచ్చే టిష్యూ కల్చర్ పద్ధతులను ప్రోత్సహిస్తే సరిపోదని, మార్కెట్ కుప్పకూలినప్పుడు, ప్రకృతి సహకరించనప్పుడు రైతులకు స్థిరమైన ఆదాయం లభించేలా భరోసా కల్పించాలి్సన అవసరం ఉందని చెప్పారు. కేంద్ర వ్యవసాయశాఖ తక్షణమే స్పందించి రాయలసీమ అరటి రైతులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కడప విమానాశ్రయానికి రూ.606.4 కోట్లు
వైఎస్సార్‌సీపీ ఎంపీ మేడా రఘునాథరెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు
వైఎస్సార్ కడప జిల్లాలోని కడప విమానాశ్రయానికి ఉడాన్ పథకం కింద 2024–25లో రూ.606.4 కోట్లు కేటాయించినట్లు కేంద్ర పౌరవిమానయానశాఖ సహాయమంత్రి మురళీధర్ మోహల్ తెలిపారు. ఈ నిధులను పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చుచేసినట్లు చెప్పారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్‌సీపీ ఎంపీ మేడా రఘునాథరెడ్డి ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. ఈ విమానాశ్రయాన్ని 2017 మార్చి 30న రూ.99.36 కోట్లతో రీజనల్ కనెక్టివిటీ స్కీం కింద గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం కడప నుంచి చెన్నై, విజయవాడ, హైదరాబాద్‌కు ఇండిగో విమానాలు రాకపోకలు సాగిస్తున్నట్లు చెప్పారు.
జీపీఎస్ స్ఫూఫింగ్ నిజమే
ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో జీపీఎస్ స్ఫూఫింగ్ జరిగినమాట వాస్తవమేనని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎస్.నిరంజన్‌రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఢిల్లీ విమానాశ్రయంలో ఈ స్ఫూఫింగ్‌కు గురైనట్లు చెప్పారు. దేశంలో 15 విమానాశ్రయాలు ఉడాన్ పథకం కింద పనిచేయడంలేదని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహల్ నిరంజన్‌రెడ్డి మరో ప్రశ్నకు జవాబిచ్చారు.
పరిశ్రమలకు సకాలంలో ఆర్థిక సహాయాన్ని చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నిరంజన్‌రెడ్డి ప్రశ్నకు ఆ శాఖ సహాయ మంత్రి శోభ కరన్‌దాల్జే చెప్పారు. దేశంలో సింగిల్ స్క్రీన్‌లు తగ్గుతున్నాయని, వాటి నిర్మాణం, పునరుద్ధరణ కోసం సింగిల్ విండో క్లియరెన్స్ ఇవ్వాలని నిరంజన్‌రెడ్డి జీరో అవర్‌లో కోరారు. థియేటర్ ఫుడ్, బేవరేజెస్ ధరలపై నియంత్రణ తేవాలన్నారు.
విశాఖ మెట్రోకు ప్రతిపాదనలు
రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో సమాన భాగస్వామ్య నమూన కింద 46.23 కిమీ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం సవరించిన ప్రతిపాదనలను సమర్పించినట్లు కేంద్ర పట్టణాభివృది్ధశాఖ సహాయమంత్రి టోకాన్ సాహు తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ గొల్ల బాబురావు ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. మెట్రో రైలు విధానం–2017 ప్రకారం అంచనా అవసరం, సాధ్యాసాధ్యాలు, వనరుల లభ్యతపై ఆమోదం ఆధారపడి ఉంటుందని చెప్పారు. అందువల్ల మంజూరు కోసం ఎటువంటి సమయం పేర్కొనలేమని తెలిపారు.


