
సాక్షి, విశాఖపట్నం: మాజీ సైనికుడి భూ వివాదం, విశాఖలో ల్యాండ్ గ్రాబింగ్, రెవెన్యూ సంబంధిత భూములపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గురువారం లేఖ రాశారు. ఎండాడలో మాజీ సైనికుడి భూవివాదంపై విచారణ కోరుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రెవెన్యూ మంత్రికి సైతం ఆయన లేఖ రాశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ..‘ఎండాడలో మాజీ సైనికుడి భూవివాదంపై విచారణ కోరుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రెవెన్యూ మంత్రికి సైతం ఆయన లేఖ రాశారు. ‘ప్రీహోల్డ్ భూముల స్వాధీనం వంటి వివాదాస్పద ఘటనల పట్ల తీవ్ర ఆందోళన చెందిన విషయాన్ని లేఖలో రాశాను. మీడియా ద్వారా ఈ వ్యవహారాలు ప్రస్తుతం మీ దృష్టికీ వచ్చాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన ఆధారాలనూ ఈ లేఖకు జత చేశాను. ఆయా భూములు స్వాధీనపరచడం, రిజిస్ట్రేషన్ ప్రక్రియలు, సీనియర్ అధికారులు, రాజకీయ నేతల ప్రమేయం వంటి అంశాల్లో తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
ముఖ్యంగా అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రెవెన్యూ శాఖలో ముఖ్య కార్యదర్శి స్థాయిలోనూ ఇందులో ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా ఈ విషయంపై న్యాయ విచారణ అవసరమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై తక్షణ చర్యలు తీసుకుని, నిష్పక్షపాతమైన విచారణ ద్వారా వాస్తవాలను వెలికి తీయాలి. ప్రజల్లో పరిపాలనపై విశ్వాసం పునరుద్ధరించడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. భూ కబ్జాదారులు, తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి’ అని ఆ లేఖలో బొత్స కోరారు.