అమరావతి రైతులకు అండగా ఉంటాం | YSRCP legal fight to protect farmers lands | Sakshi
Sakshi News home page

అమరావతి రైతులకు అండగా ఉంటాం

Jun 3 2026 5:07 AM | Updated on Jun 3 2026 5:07 AM

YSRCP legal fight to protect farmers lands

తన పొలాన్ని తనకు తెలియకుండానే వేరే వారికి రిజిస్ట్రేషన్‌ చేశారంటూ వైఎస్‌ జగన్‌కు పత్రాలు చూపిస్తున్న రైతు వెంకటరెడ్డి

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ స్పష్టీకరణ 

వైఎస్సార్‌సీపీ తరఫున లీగల్‌ ప్యానెల్‌ ఏర్పాటు 

అక్కడి రైతుల భూములు కాపాడేందుకు న్యాయ పోరాటం 

భూములు బలవంతంగా లాక్కోవడం దారుణం.. ఇప్పటికే 50 వేల ఎకరాలు తీసుకున్నాక.. ఇంకా 50 వేల ఎకరాలెందుకు? 

బాబు తీరుతో మరో 30 ఏళ్ల తర్వాతా రాజధాని కనిపించదు 

అక్కడ నిరంతరం పనులు, కమీషన్లు.. అదే ప్రభుత్వ లక్ష్యం  

అందుకే ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్లు, పోర్టు, మెడికల్‌ కాలేజీలున్న ‘మావిగన్‌’ ప్రతిపాదన చేశాం  

అమరావతి రైతులు ఏం కావాలంటే అది చేస్తాం.. బలవంతపు భూ సేకరణ ఉండదు.. అవసరమైతే భూములు వెనక్కు ఇస్తాం 

సాక్షి, అమరావతి: ‘రైతులను సంతోష పెట్టే విధంగా ఉండాలన్నదే మా అభిమతం.. ముందు నుంచి మా వైఖరి అదే.. మీకు అన్ని విధాలా అండగా ఉంటాం’ అని రాజధాని అమరావతి ప్రాంత రైతులకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. రైతుల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడం దారుణమని, బాధితుల తరఫున న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. వారికి బాసటగా నిలిచారు. రైతుల భూములను లాక్కోవడానికి దౌర్జన్యం చేస్తున్న వారందరి పని పడతామని, తప్పు చేస్తున్న ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. 

రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, ఎర్రపాలెం, కురగల్లు గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. భూ సమీకరణ పేరుతో ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, బెదిరింపులను వైఎస్‌ జగన్‌కు వివరించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి కష్టాలు, బాధలు విన్న వైఎస్‌ జగన్, రైతులకు అండగా ఉంటామని ప్రకటించారు. పార్టీ తరఫున న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంకా ఏం అన్నారంటే..

అందుకే మావిగన్‌ ప్రతిపాదన
‘‘ఇప్పటికే 50 వేల ఎకరాలు తీసుకున్నారు. ఇంకా 50 వేల ఎకరాలు అవసరం ఏముంది? అందుకే ‘మావిగన్‌’ ప్రతిపాదించాం. ఇప్పటికే గన్నవరంలో విమానాశ్రయం ఉంది. దానికి దగ్గర్లోనే మరో ఎయిర్‌పోర్టుకు అనుమతి ఇవ్వరు. మావిగన్‌లో పోర్టు కూడా ఉంది. అది మచిలీపట్నంలో ఉంది. చంద్రబాబు తీరుతో మరో 30 ఏళ్ల తర్వాత కూడా మనకు రాజధాని కనిపించదు. ఎందుకంటే పనులు జరగవు. కారణం అక్కడ కనీస మౌలిక వసతుల కల్పన కోసం ఎకరానికి రూ.2 కోట్లు కావాలని 12 ఏళ్ల క్రితమే బ్యాంకులకు నివేదిక ఇచ్చారు. నిజానికి ఇప్పటికి ఆ రేటు పెరిగింది. ఈ లెక్కన రోడ్లు, డ్రైనేజీ, నీరు, కరెంటు వీటిన్నింటికే ఎన్నేళ్లు ఎన్ని కోట్లు ఖర్చు చేయాలి?

చంద్రబాబు ఉద్దేశం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం 
మాది రైతు పక్షపాత ప్రభుత్వం. రైతులను సంతోష పెట్టే విధంగా ఉండాలనేదే మా అభిమతం. ముందు నుంచి మాది అదే వైఖరి. కొండవీటి వాగుపై ఎత్తిపోతల పథకం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఇక్కడ రైతులకు నష్టం కలగకూడదనే మావిగన్‌ను ప్రతిపాదించాం. ఆ ప్రాంతంలో ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్లు, పోర్టు, మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. కానీ, ఈ ప్రభుత్వం మాత్రం జీరో నుంచి కడతామని అమరావతిపై వెనక్కు తగ్గడం లేదు. అక్కడ నిరంతరం పనులు.. నిరంతరం కమీషన్లు.. అదే ప్రభుత్వ లక్ష్యం. ఇంకా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం.. అదే చంద్రబాబు ఉద్దేశం. రాజధాని పనుల్లో భారీగా అవినీతి జరుగుతోంది. 

అవసరం అయితే భూములు వెనక్కు
అమరావతి రైతులు ఏం కావాలంటే అది చేస్తాం. బలవంతంగా భూ సేకరణ అనేది ఉండదు. అవసరం అయితే భూములు వెనక్కు ఇస్తాం. ఇప్పుడు మీ పోరాటంలో మా పార్టీ న్యాయ విభాగం కూడా పాలు పంచుకుంటుంది. మా లీగల్‌ టీమ్‌ మీకు అన్ని విధాలుగా సహాయ, సహకారిగా ఉంటుంది. పార్టీ తరఫున లీగల్‌ ప్యానెల్‌ ఏర్పాటు చేస్తాం. మీ తరఫున గట్టిగా పోరాడతాం. మనం ఇప్పుడు చేయగలిగింది న్యాయ పోరాటం మాత్ర­మే. మూడేళ్ల తర్వాత దేవుడి దయ వల్ల మన ప్రభుత్వం ఏర్పడితే, మీకు పూర్తి న్యాయం చేస్తాం. అవకాశం ఉంటే భూములు కూడా తిరిగి ఇస్తాం.

దౌర్జన్యం చేసే వారికి శిక్ష తప్పదు
ముఖ్యమంత్రిగా చేయకూడని పని చంద్రబాబు చేస్తున్నారు. రైతులు భూమి ఇవ్వకపోతే కక్షగట్టడం దారుణం. ప్లాట్లు కేటాయించి రిజిస్ట్రేషన్‌ చేయడం, కాలువ తవ్వడం, రోడ్లు వేయడం, తోడిన నీరు పంపింగ్‌ చేయడం, దగ్గర్లో రిజర్వాయర్లు ఉంటే గండి కొట్టి, నీరు పారేలా చేయడం దారుణం. ఇప్పుడు పలు రకాలుగా దౌర్జన్యం చేస్తున్న వారందరికీ శిక్ష పడేలా చేస్తాం. మీకు న్యాయం చేస్తాం. ఇప్పుడు తప్పు చేస్తున్న ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించేలా చేస్తాం. మీ తరఫున పోరాడేందుకు లీగల్‌ కమిటీ వేయడం ద్వారా అమరావతి రైతులకు న్యాయం చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తాం’’ అని వైఎస్‌ జగన్‌ అమరావతి రైతులకు భరోసా ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement