సంకల్పం సాక్షిగా మార్పు

YSRCP Leaders Special Events Continued Second Day Across AP - Sakshi

వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారని ప్రజల కితాబు

రెండవ రోజు ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమైన వైఎస్సార్‌సీపీ శ్రేణులు

ఊరూరా పాదయాత్రలు, సమస్యల ఆలకింపు

సాక్షి నెట్‌వర్క్‌ : ‘నిన్నటి కంటే ఈ రోజు బావుండాలి. ఈ రోజు కంటే రేపు ఇంకా బావుండాలి. అందరి జీవితాల్లో ఇలాంటి మార్పే నా లక్ష్యం. మీ అందరి చల్లని దీవెనలతో రేపు ఆ మార్పు సాధిస్తామని ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ తన ప్రజా సంకల్ప యాత్రలో తరచూ చెప్పేవారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే ఆ దిశగా అడుగులు వేశారు. 17 నెలలు తిరక్కుండానే ఆ మార్పును సాకారం చేశారు’ అని ఊరూరా ప్రజలు వైఎస్సార్‌సీపీ నేతల ఎదుట ప్రస్తావిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు శనివారం ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగించాయి. ‘ప్రజల్లో నాడు–ప్రజల కోసం నేడు’ అంటూ భారీ ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ఆ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజల్ని ఆరా తీశారు. సమస్యలను ఆలకించారు. చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని సమస్యల పరిష్కారానికి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
గుంటూరులో పాదయాత్ర చేస్తున్న ఎమ్మెల్సీ జంగా, ఎమ్మెల్యే ఎం. గిరిధర్‌ 
 
► అనంతపురం జిల్లాలో మంత్రి శంకర్‌నారాయణ, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాదవ్, ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జగన్‌ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారని ప్రజలు చెప్పారు. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డెప్ప ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, వైఎస్సార్‌ జిల్లా రాయచోటిలో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, ఎంపీ మిథున్‌రెడ్డి, చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రజా చైతన్య కార్యక్రమాలు కొనసాగాయి.
శ్రీకాకుళం జిల్లా బ్రాహ్మణతర్లా– లక్ష్మీపురం మధ్య పాదయాత్రలో ప్రజలతో మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు 

► శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు ర్యాలీలు చేపట్టారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రజలను కలిసి ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఇంత తక్కువ సమయంలో వైఎస్‌ జగన్‌ ఇన్ని హామీలు నెరవేరుస్తారని అనుకోలేదని పలుచోట్ల ప్రజలు తెలిపారు. కృష్ణా జిల్లా వెణుతురుమిల్లిలో మంత్రి కొడాలి నాని పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.  తూర్పు గోదావరి జిల్లాలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు గ్రామ, గ్రామాన ప్రజలను కలుసుకున్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. పశ్చిమగోదావరి జిల్లాలో మంత్రులు ఆళ్ల నాని, శ్రీరంగనాథరాజు, తానేటి వనిత పాదయాత్రలో పాల్గొన్నారు.
► విజయనగరం జిల్లా మెట్టపల్లిలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ ర్యాలీలో పాల్గొన్నారు. విశాఖ జిల్లా భీమిలిలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, గాజువాకలో ఎంపీ సత్యనారాయణ పాదయాత్ర చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు పాదయాత్ర చేపట్టారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top