పండుగలా ప్రజాచైతన్య యాత్రలు

YSRCP Leaders held a statewide public awareness events - Sakshi

సాక్షి నెట్‌వర్క్‌: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు మూడో రోజైన ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాచైతన్య కార్యక్రమాలు పండుగలా నిర్వహించారు. ‘ప్రజల్లో నాడు–ప్రజల కోసం నేడు’ పేరిట మంత్రులు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ.. ప్రజలకు ఆయా పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. గుంటూరు జిల్లాలో పాదయాత్రలు కొనసాగాయి. రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత వట్టిచెరుకూరు మండలం కోవెలమూడిలో, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దుర్గిలో, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు కనగాల–చెరుకుపల్లి, మరో ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు.

కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని, జగ్గయ్యపేటలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పర్యటించగా.. వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పాదయాత్రలు జరిపారు. విశాఖ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు, ర్యాలీలు నిర్వహించారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ప్రభుత్వ విఫ్‌ బూడి ముత్యాలనాయుడు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు పాదయాత్రల్లో పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యేలు ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నేతల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు జరిగాయి.
శ్రీకాకుళం పట్టణంలో నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, పార్టీ శ్రేణులు  

తూర్పు గోదావరి జిల్లాలో ఎంపీ వంగా గీతావిశ్వనాథ్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తాళ్లపూడి మండలంలో  స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ పాదయాత్రలో పాల్గొన్నారు. జిల్లాలో పలుచోట్ల ప్రజాచైతన్య యాత్రలు జరిగాయి. అనంతపురం జిల్లాలో మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, విప్‌ కాపు రామచంద్రారెడ్డి,  ఎంపీ గోరంట్ల మాధవ్‌ తదితరులు సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లావ్యాప్తంగా పాదయాత్రలు జరిగాయి. వైఎస్సార్‌ జిల్లాలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రజాసమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. చిత్తూరు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రజాచైతన్య కార్యక్రమాలు కొనసాగాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top