విద్యాసంస్థపై వేటు.. రెడ్‌బుక్‌ కాటు | YSRCP leaders educational institutions are the target for tdp | Sakshi
Sakshi News home page

విద్యాసంస్థపై వేటు.. రెడ్‌బుక్‌ కాటు

May 24 2025 3:50 AM | Updated on May 24 2025 3:50 AM

YSRCP leaders educational institutions are the target for tdp

సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీ అరాచక పర్వం

వైఎస్సార్‌సీపీ నాయకుల విద్యాసంస్థల టార్గెట్‌ 

కుప్పం మున్సిపల్‌ చైర్మన్‌ ఉప ఎన్నికలో పోటీ చేశారని కక్ష 

కుప్పంలోని స్కూల్‌ 8–10 తరగతులకు అనుమతులు రద్దంటూ రగడ 

రెండేళ్ల కిందటే స్టేట్‌ సిలబస్‌ నుంచి సీబీఎస్‌ఈకి మార్పు 

కానీ, ఇబ్బందిపెట్టాలని ఎస్‌ఎస్‌సీ రద్దు అంటూ హడావుడి 

పాఠశాలకే పర్మిషన్‌ లేదంటూ సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం 

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: పిల్లలు చదివే పాఠశాలలనూ అధికార టీడీపీ నేతలు కక్షసాధింపునకు వాడుకుంటున్నారు..! విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం ఆడుతున్నారు..! చిన్న రైతు స్థలాన్నీ వదలడం లేదు..! దళిత సర్పంచ్‌నూ దుర్భాషలాడుతున్నారు..! ఇదంతా మరెక్కడో కాదు.. సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పం, సొంత జిల్లా చిత్తూరులో..కూటమి నేతల ఆగడాలకు అడ్డూఅదుపు ఉండడం లేదు..! తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకోవడం.. ఆస్తులపై దౌర్జన్యం చేయడం.. దుర్భాషలాడడం వారికి సాధారణమైపోయింది..! రోజురోజుకు అరాచకాలు శ్రుతిమించుతున్నాయి. 

చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపల్‌ చైర్మన్‌ ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తొమ్మిదో వార్డు కౌన్సిలర్‌ హఫీజ్‌పై తాజాగా వేధింపులకు దిగారు. కుప్పంలో హఫీజ్‌కు హాకింగ్‌ ఇంటర్నేషనల్‌ పేరిట స్కూల్‌ ఉంది. దీనిని రెండేళ్ల కిందటే ఎస్‌ఎస్‌సీ నుంచి సీబీఎస్‌ఈకి మార్చుకున్నారు. అయితే, ఇప్పుడు ఈ పాఠశాల 8, 9, 10 ఎస్‌ఎస్‌సీ అనుమతులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పాఠశాల మొత్తానికే పర్మిషన్‌ లేదని.. టీసీలు తీసుకెళ్లాలని డీఈవో ఆదేశించినట్లు  దుష్ప్రచారానికి దిగారు. 

అసలు ఎస్‌ఎస్‌సీనే లేనందున.. కేవలం ఇబ్బందిపెట్టాలనే ఇలా హడావుడి చేసినట్లు స్పష్టమవుతోంది. తద్వారా.. ఈ పాఠశాలలోని 950 మంది విద్యార్థుల చదువులను, 150 మంది సిబ్బంది జీవితాలను దెబ్బతీస్తున్నారు. ఇక వైఎస్సార్‌సీపీ నాయకుడికి చెందిన రామకుప్పంలోని శాంతినికేతన్‌ స్కూల్‌కూ గుర్తింపు లేదని ప్రకటించారు. వాస్తవానికి ఇది చాలా ఏళ్ల నుంచి ఉన్న పాఠశాల. అయినప్పటికీ ప్రభుత్వం ఇలా చేయడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధంతరంగా గుర్తింపు రద్దు చేస్తే తమ పిల్లల భవిష్యత్తు ఏమిటనిప్రశ్నిస్తున్నారు.

చంపేస్తా నా కొ..!
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ఆకనంబట్టు దళిత సర్పంచ్‌ మణిని టీడీపీ నాయకుడు జయప్రకాష్‌నాయుడు తీవ్ర స్థాయిలో దూషించాడు. తమపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసును ఉపసంహరించుకోవాలని మణికి ఫోన్‌ చేసి.. దుర్భాషలాడుతూ హెచ్చరికలు చేశాడు. కేసును వెనక్కు తీసుకోకుంటే కనిపించనచోటల్లా కొడతా, ఇంటికి వచ్చి కొడతా, కాళ్లూచేతులు తీసేస్తా, చంపేస్తా.. నా కొడకా అంటూ  తిడుతూ బెదిరింపులకు దిగాడు. ‘‘ఎంపీడీవో ఆఫీసుకు రావొద్దు. ప్రభుత్వం మాదే.  ఏం చేసినా ఎవరూ ఏమీ చేయలేరు. 

కనిపిస్తే కాళ్లు చేతులు తీయించేస్తా. నీ కొడుక్కి పెళ్లి కాకుండా చేస్తా’’ అంటూ బెదిరించారు. ‘‘రెడ్లు ఎవరూ నిన్ను కాపాడలేరు. శ్రీకాంత్‌రెడ్డిని కూడా కొట్టాం. ఏమీ చేయలేకపోయారు’’ అంటూ పత్రికలో రాయలేని విధంగా బూతులు తిట్టారు. ఎమ్మెల్యే తమవైపే ఉంటాడని, మా పార్టీ వాళ్లు ఎవరైనా సపోర్ట్‌ వస్తే వాళ్ల కథకూడా చూస్తానంటూ తిట్లు అందుకున్నారు. దళిత సర్పంచ్‌ మణిని టీడీపీ నేత జయప్రకాష్‌నాయుడు ఫోన్‌ చేసి బెదిరించిన సంభాషణ సోషల్‌మీడియాలో వైరల్‌ అయినా పోలీసులు స్పందించలేదు. దీనిపై దళిత సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

మామిడి చెట్లను కొట్టేసి అరాచకం..
చిత్తూరు జిల్లా పుంగనూరులో 88 సెంట్ల భూమిని ఆక్రమించుకునేందుకు టీడీపీ నేత ఓ కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తున్నాడు. ఇప్పటికే మూడుసార్లు ఆ కుటుంబంపై దాడికి యత్నించి గాయపరిచాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన కరువైంది. బాధిత కుటుంబీకుల వివరాల మేరకు.. మంగళం పంచాయతీ కంగానెల్లూరు గ్రామానికి చెందిన చిన్నరెడ్డెప్పకు 2.66 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సర్వే నంబర్‌ 241/3లో 88 సెంట్ల భూమికి చిన్నరెడ్డెప్ప తన పేరున పాస్‌ పుస్తకం పొందారు. 

మామిడి పంట సాగులో ఉన్న ఈ భూమిని ఎలాగైనా కలుపుకొనేందుకు టీడీపీ నేత పథకం వేశాడు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చిన్నరెడ్డెప్ప కుటుంబాన్ని భూమిలోకి అడుగుపెట్టనీయడం లేదు. వెళ్లేందుకు ప్రయత్నించగా ఫిబ్రవరి 20న చిన్నరెడ్డెప్పను తీవ్రంగా గాయపరచడంతో ఆసుపత్రిపాలయ్యాడు. మొదట పోలీసులకు, అదే నెల 24న చిత్తూరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 

అధికారుల నుంచి ఎలాంటి చర్యలు లేవు. మరో రెండుసార్లు చిన్నరెడ్డెప్పపై దాడికి యత్నించినట్లు బాధిత కుటుంబీకులు వాపోయారు. తాజాగా శుక్రవారం పొలానికి వెళ్లిన చిన్నరెడ్డెప్పపై మళ్లీ దాడికి యత్నించాడని చెప్పారు. కోతకొచ్చిన మామిడి చెట్లను దౌర్జన్యంగా తొలగించారని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement