సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వ బ్రాండ్ పాలనలో అన్యాయాలు, అక్రమాలు రాజ్యమేలుతున్నాయని.. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సాకే శైలజానాధ్ మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి వచ్చిన డీఎస్సీ బాధితులు మాజీ సీఎం వైఎస్ జగన్‌ని కలిసి తమ ఆవేదనను పంచుకున్నారని తెలిపారు. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత పూర్తిగా లోపించిందని, దీనిపై తక్షణమే కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) చేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే..
మెగా డీఎస్సీ పేరుతో భారీ కుంభకోణం:
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు, అన్యాయాలు జరిగాయి. పారదర్శకత లేని వన్ ఈస్ట్ వన్ (1:1) విధానంలో.. పరీక్ష మెరిట్ లిస్ట్ ప్రకటించకుండానే నేరుగా 1:1 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు పిలవడం వెనుక పెద్ద మతలబు ఉంది. వెరిఫికేషన్ పూర్తయ్యాక కొందరి పేర్లు సెలక్షన్ లిస్ట్‌లో కానీ, రిజెక్షన్ లిస్ట్‌లో కానీ లేకుండా మాయం చేశారు.
స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు:
పరీక్ష లేకుండా స్పోర్ట్స్ కోటా పోస్టులు భర్తీ చేస్తామని మొదట చెప్పి, ఆ తర్వాత పరీక్ష పెట్టాలంటూ జీవోలు మార్పు చేశారు. మన్యం జిల్లాకు చెందిన ఒక నేషనల్ గోల్డ్ మెడలిస్ట్‌కు ఉద్యోగం రాలేదు.. అసలు పరీక్షే రాయనటువంటి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారు. బ్రిడ్జ్ గేమ్స్ ఆడిన వారికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలిచ్చి.. వారు స్కూళ్లలో మ్యాథ్స్, సైన్స్ ఎలా బోధిస్తారని ప్రశ్నించారు.
రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు పాతర:
ఓపెన్ కాంపిటేషన్ మార్కులు సాధించిన రిజర్వేషన్ అభ్యర్థులను జనరల్ కోటాలో భర్తీ చేయకుండా, రిజర్వేషన్ కేటగిరీ కింద చూపడం దళిత, బహుజన, మైనారిటీ వర్గాలకు చేస్తున్న ద్రోహమే. డీఎస్సీ నియామకాల వెనుక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని వార్తలు వస్తున్నందున, రాష్ట్ర ప్రభుత్వ సిట్ (SIT)ల మీద నమ్మకం లేదు, తక్షణమే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీబీఐ చేత నిష్పాక్షపాత విచారణ జరిపించాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎలాంటి అల్లర్లు, ఆందోళనలు లేకుండా 1.30 లక్షల మందికి పైగా సచివాలయ ఉద్యోగాలను అత్యంత పారదర్శకంగా భర్తీ చేశాం.
సూపర్ సిక్స్ మోసం:
ఎన్నికల హామీలైన 'సూపర్ సిక్స్'లో ఒక్కటీ అమలు చేయకుండానే, హఠాత్తుగా 'సూపర్ సిక్స్ సూపర్ హిట్' అని ప్రకటించుకోవడం హాస్యాస్పదం. దీనిపై ప్రశ్నిస్తే ప్రజలను బెదిరిస్తున్నారు.
విద్యార్థులపై నిర్లక్ష్యం:
జూన్ నెలలో పాఠశాలలు ప్రారంభం కానున్నప్పటికీ.. విద్యార్థులకు ఇంతవరకు పుస్తకాలు, యూనిఫామ్‌లు, బెల్టులు, బ్యాగులు, షూస్ అందించని దద్దమ్మ ప్రభుత్వం ఇది. 'బాబు వస్తే జాబు వస్తుంది' అని గోడల మీద రాసుకున్నారని, మరి 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే వైఎస్ జగన్‌కు సన్నిహితంగా ఉన్న కేఎన్నార్ లాంటి వారిపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారు.
గతంలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ రూ. 2 వేల కోట్ల ఐటీ నోటీసుల వ్యవహారంలో అమెరికా పారిపోయి, మళ్లీ బాబు అధికారంలోకి వచ్చాకే తిరిగి వచ్చాడు. మరోవైపు ఉచిత ఇసుక లేదు.. లిక్కర్ దోపిడీ, విద్యుత్ కొనుగోళ్లలో భారీ స్కామ్ ఇ లా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన అన్ని రంగాల్లోనూ దోపిడీ పర్వంగా మారింది.
రాష్ట్రంలో 'ఉచిత ఇసుక' అనేది కేవలం బోర్డులకే పరిమితమైంది. ఎక్కడా ఉచితంగా దొరకడం లేదు. ఎలాంటి బిల్లులు లేకుండా ప్రతి దశలోనూ భారీగా కలెక్షన్లు చేసుకుంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలసీ వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 750 కోట్లు ఆదాయం వచ్చేది, ఇప్పుడు అటు ప్రభుత్వానికి రాబడి లేకుండా, ఇటు ప్రజలకు ఇసుక దక్కకుండా చేస్తున్నారు.
బెల్ట్ షాపుల విజృంభణ:
బెల్ట్ షాపులు లేకుండా చేస్తామన్న హామీని తుంగలో తొక్కారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయి. మద్యం సీసాపై రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రూ.3.49లకే విద్యుత్ కొనుగోలు చేస్తే గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. నేడు తన హయాంలో ఏకంగా రూ. 4.65 ల అధిక ధరలకు కరెంట్ కొనుగోలు చేస్తూ పెద్ద స్కామ్‌కు తెరలేపారు.
రూ. 5 వేల కోట్ల భూముల బంధుప్రీతి – అమరావతిపై ప్రశ్నలు
చంద్రబాబు నాయుడు తన కుమారుడి తోడల్లుడు, ఎంపీ భరత్‌కు చెందిన విద్యాసంస్థలకు ఏకంగా రూ. 5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అప్పనంగా కట్టబెట్టారని శైలజానాధ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే 'సత్వా' వంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకు కేవలం 99 పైసలకే భూములను ధారాదత్తం చేశారు. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని కాదు, అది కేవలం దేవతల రాజధానిగా మిగిలింది. అత్యంత క్లిష్ట పరిస్థితులున్న ప్రాంతాల్లో కూడా చదరపు అడుగు రూ. 18 వేలు, రూ. 19 వేలకు కడుతున్నారు, కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు.
"కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ఇసుక, లిక్కర్, భూముల పందేరం మరియు అవినీతిపై చర్చకు మేము సిద్ధం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు వారి కూటమి నాయకులు సిద్ధమా?" అని మాజీ మంత్రి సాకే శైలజానాధ్ సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, కేవలం బంధుప్రీతి, అవినీతి, దోపిడీలకే పరిమితమైందని సాకే శైలజానాధ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మెగా డియస్సీ పేరుతో నిరుద్యోగ పేద కుటుంబాల ఆశలను అడియాసలు చేయడం దుర్మార్గమన్నారు. బాధితులు ఇప్పటికే కోర్టులను ఆశ్రయించారని, ప్రభుత్వం ఇప్పటికైనా తన తప్పులను ఒప్పుకుని విద్యాశాఖ కార్యదర్శికి తగిన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.


