YSR Vahana Mitra: మూడేళ్ల కంటే మిన్నగా.. 

YSR Vahana Mitra Scheme Financial assistance to Auto cab drivers - Sakshi

ఆటో, ట్యాక్సీ, మాక్సీక్యాబ్‌ గల డ్రైవర్లకు వరుసగా నాలుగో ఏడాది అందజేత

మొత్తం రూ.261.51 కోట్లు పంపిణీ చేయనున్న ప్రభుత్వం

నాలుగేళ్లలో మొత్తం రూ.1,025.96 కోట్ల ఆర్థిక సహాయం

సాక్షి, అమరావతి: అర్హులైన ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు వరుసగా నాలుగో ఏడాది ‘వైఎస్సార్‌ వాహనమిత్ర’ భరోసా లభించనుంది. 2022–23 సంవత్సరానికి గాను రాష్ట్రంలో 2,61,516 మంది సొంత ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్‌ కలిగిన డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున ఈ ఏడాది రూ.261.51 కోట్ల మేర డ్రైవర్లకు ప్రయోజనం కలగనుంది. గత మూడేళ్ల కంటే ఈ సారి ఎక్కువ మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందనుండటం విశేషం. వాహనాల మరమ్మతులు, బీమా ఖర్చులు తడిసిమోపెడవుతుండటంతో డ్రైవర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని పాదయాత్ర సందర్భంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే డ్రైవర్లను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ఆ హామీని నెరవేరుస్తూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి ఏడాదే ‘వైఎస్సార్‌ వాహనమిత్ర’ పథకాన్ని ప్రకటించారు. 2022–23కు గాను అర్హత గల డ్రైవర్ల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. గతంలో లబ్ధిదారులుగా ఉన్నవారితోపాటు కొత్తవారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పరిశీలించి రవాణా శాఖకు పంపించారు. ఈ ఏడాది మొత్తం 2,61,516 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. ఈ నెల 15న విశాఖపట్నంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లబ్ధిదారులకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.261.51 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. 

బడుగు, బలహీన వర్గాల లబ్ధిదారులే సింహభాగం
సామాజిక వర్గాల వారీగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల నుంచి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో ఆర్థిక సహాయం జమ కానుంది. వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం లబ్ధిదారుల్లో మొదటి స్థానంలో బీసీలు ఉండగా.. రెండో స్థానంలో ఎస్సీలు ఉన్నారు. 2022–23కు గాను మొత్తం లబ్ధిదారులు 2,61,516 మంది ఎంపిక కాగా.. వారిలో బీసీ లబ్ధిదారులు 1,44,164 మంది (55 శాతం) ఉన్నారు. తరువాత స్థానంలో ఎస్సీలు 63,594 మంది, ఎస్టీలు 10,472 మంది ఉన్నారు.

నాలుగేళ్లలో రూ.1,025.96కోట్లు
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటివరకు మూడుసార్లు (2019–20, 2020–21, 2021–22) వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం కింద ఆర్థిక సహాయం చేశారు. 2022–23కు కూడా ఆర్థిక సహాయం చేసేందుకు లబ్ధిదారులను గుర్తించారు. మొత్తంగా ఈ నాలుగేళ్లలో ఏకంగా 10.25 లక్షల మంది డ్రైవర్లకు రూ.1,025.96 కోట్లను ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించినట్టు అవుతుంది. లబ్ధిదారుల సంఖ్య ఏటా పెరుగుతున్నా సరే ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఈ పథకాన్ని అందిస్తోంది. కరోనా పరిస్థితులతో రెండేళ్లు ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా పేదలైన డ్రైవర్లను ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top