సాక్షి, తాడేపల్లి: కాకినాడ జిల్లా అగ్ని ప్రమాదం ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. బాధితులు ఇబ్బంది పడకుండా వసతి, ఆహారం అందించి వారికి ప్రభుత్వం అండగా నిలవాలని, తక్షణ సాయంగా ఒక్కో బాధిత కుటుంబానికి లక్ష రూపాయలు అందజేయాలని డిమాండ్ చేశారు.
కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంకపల్లె అగ్ని ప్రమాదంపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్..‘మన్యంలో మారుమూలన ఉండే ఈ తండాలోని 38 పూరిళ్ళు పూర్తిగా కాలిపోయాయి. 120 మంది గ్రామస్థులు కట్టుబట్టలతో మిగిలారు. మంటలు దావానలంలా వ్యాపించి క్షణాల్లో ఊరంతా భస్మీపటలం అవడం తీవ్ర విచారకరం. బాధితులు ఇబ్బంది పడకుండా వసతి, ఆహారం అందించి వారికి ప్రభుత్వం అండగా నిలవాలి. వారికి తక్షణ సాయంగా ఒక్కో బాధిత కుటుంబానికి లక్ష అందజేయాలి. ఇల్లు కోల్పోయిన ప్రతి బాధిత కుటుంబానికి కొత్త ఇల్లు మంజూరు చేయాలి. కొత్త ఇల్లు నిర్మించి ఇచ్చే వరకు వారికి అవసరమైన వసతి, ఇతర సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
కాగా, సార్లంకపల్లె.. అగ్ని ప్రమాదంలో చిక్కుకొని నిమిషాల్లో బూడిదైపోయింది. మన్యంలో మారుమూలన ఉండే ఈ తండాలోని మూడు పక్కా ఇళ్లు మినహా, 38 పూరిళ్లు కాలిపోయాయి. ఈ ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. అడవిని నమ్ముకొని జీవించే సార్లంక గిరిజనులు సంక్రాంతి సందర్భంగా సరకుల కొనుగోళ్లకు సోమవారం సాయంత్రం తుని పట్టణానికి వెళ్లారు. అంతలోనే ఇంత ఘోరం జరిగిపోయింది. ఊరంతా శ్మశానంగా మారింది. ఊరికి 50 కి.మీ. దూరంలోని తుని నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చేటప్పటికే ఊరంతా మంటల్లో ఆహుతైపోయింది.


