సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో వరుసగా కొనసాగుతున్న విధ్వంసకాండపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై యథేచ్ఛగా దాడులు చేయడం, నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, నామినేషన్ పత్రాలను లాక్కుని చింపివేయడం వంటి పరిణామాలపై మండిపడుతున్నారు.
చివరకు పార్టీ లోక్‌సభ పక్షనేత పీవీ మిధున్‌రెడ్డిపై పుంగనూరులో జరిగిన హత్యాయత్నం, పులివెందులలో శనివారం పోలీసులు గాలిలోకి కాల్పులు జరపడం, బాష్పవాయువు ప్రయోగించడం వంటి తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో వైఎస్ జగన్ ఆదివారం ఉదయం 11 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, శాంతిభద్రతలపై ఈ ప్రెస్మీట్లో ఎండగట్టనున్నారు.
రాజ్‌భవన్‌కు వైఎస్ జగన్
మీడియా సమావేశం అనంతరం, విజయవాడలోని రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో వైఎస్ జగన్ సాయంత్రం భేటీ కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సమయంలో చోటుచేసుకున్న దారుణాలు, వైఎస్సార్సీపీ శ్రేణులపై జరిగిన దాడుల వివరాలను గవర్నర్‌కు స్వయంగా నివేదించనున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ జరుగుతున్న ఈ దాడులపై జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరనున్నారు.



