జనసైనికుల ఆర్తనాదాలు.. నమ్మించి.. ఆపై నిండా ముంచిన పవన్‌ కల్యాణ్‌?! | Pithapuram Janasena Internal Rift Explodes Over Local Body Election Tickets | Sakshi
Sakshi News home page

జనసైనికుల ఆర్తనాదాలు.. నమ్మించి.. ఆపై నిండా ముంచిన పవన్‌ కల్యాణ్‌?!

Oct 18 2026 10:24 AM | Updated on Oct 18 2026 10:30 AM

Pithapuram Janasena Internal Rift Explodes Over Local Body Election Tickets

సాక్షి,కాకినాడ: పిఠాపురం జనసేన పార్టీలో మున్సిపల్ ఎన్నికల వేళ తీవ్ర అసంతృప్తి, అంతర్గత విబేధాలు భగ్గుమన్నాయి. పిఠాపురం మున్సిపల్ ఛైర్మన్ పదవి అభ్యర్థిత్వం ఖరారు చేసే ప్రక్రియ జనసేన శ్రేణుల్లో పెద్ద చిచ్చు రేపింది. పార్టీని నమ్ముకుని, అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ మేరకు తన గౌరవప్రదమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఉన్నతాధికారిని చివరి నిమిషంలో జనసేన అధిష్టానం నిండా ముంచింది.  

వివరాల్లోకి వెళ్తే.. పిఠాపురం మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం జనసేన పార్టీ తొలుత ప్రముఖ వైద్యులు డాక్టర్ బీరా విజయ శేఖర్ పేరును పరిశీలనలోకి తీసుకుంది. ఆయన కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)లో డిప్యూటీ సివిల్ సర్జన్ (డీసీఎస్‌) గా బాధ్యతాయుతమైన ప్రభుత్వ విధులను నిర్వహిస్తున్నారు. మున్సిపల్ ఛైర్మన్ పీఠం దక్కుతుందనే భరోసా, పార్టీ పెద్దల నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో డా. విజయ శేఖర్ ఛైర్మన్ పదవికి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే తన ప్రభుత్వ ఉద్యోగానికి ఆయన అత్యవసరంగా రాజీనామా సమర్పించారు.

చివరి నిమిషంలో దానం లాజర్ బాబుకు అవకాశం
డాక్టర్ విజయ శేఖర్ తన కెరీర్‌ను సైతం పణంగా పెట్టి ఎన్నికల బరిలోకి దిగగా.. జనసేన అధిష్టానం మాత్రం అనూహ్యంగా మాట మార్చింది. ఉద్యోగానికి రాజీనామా చేసి సిద్ధంగా ఉన్న విజయ శేఖర్‌ను పక్కనబెట్టి, చివరి నిమిషంలో దానం లాజర్ బాబు పేరును పిఠాపురం మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంపై డాక్టర్ విజయ శేఖర్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. పవన్ కల్యాణ్ తనను రాజకీయంగా నిండా ముంచారని, ఇచ్చిన మాట తప్పి నడిరోడ్డుపై నిలబెట్టారంటూ ఆయన సన్నిహితుల వద్ద కన్నీటి పర్యంతమైనట్లు తెలుస్తోంది.

జనసేన క్యాడర్‌లో కలకలం
ఉద్యోగం పోయి, ఇటు పార్టీ పదవి దక్కక డాక్టర్ విజయ శేఖర్ పరిస్థితి రెండింటికీ చెడ్డ రేవడిలా తయారైందని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఒక ప్రభుత్వ ఉద్యోగిని నమ్మించి ఇలా రాజకీయంగా బలిపశువును చేయడం ఏంటని జనసేనలోని ఒక వర్గం నాయకులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement