ఆదర్శ సీఎం వైఎస్‌ జగన్‌

YS Jagan Praja Sankalpa Yatra end Completes three year - Sakshi

మేనిఫెస్టోలోని 90 శాతం హామీలు నెరవేర్చిన అరుదైన నేత

వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ముగిసి మూడేళ్లు పూర్తి

పార్టీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు

సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 90 శాతం హామీలను నెరవేర్చి దేశంలో ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా నిలిచారని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఇది ఏపీకి ఎంతో గర్వకారణమని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల కష్టాలన్నింటినీ కళ్లారా చూసి, వాటిని మేనిఫెస్టోలో హామీల రూపంలో పొందు పరిచి, ఆచరణలో చేసి చూపించిన అరుదైన నేత అని కొనియాడారు. వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ముగిసి నేటికి మూడు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా భారీ కేక్‌ కట్‌ చేశారు. అనంతరం మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ తన 3,648 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్రలో కోట్లాది మంది ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సీఎం జగన్‌ అందరి ఆదారాభిమానాలు చూరగొంటూ ముందుకు సాగుతున్నారన్నారు. ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్‌ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి.. దిక్కుతోచని స్థితిలో ప్రతిపక్షాలు దుష్ప్రచారం, కుట్రలు చేస్తున్నాయని అన్నారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ స్పష్టమైన విజన్‌తో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నారని చెప్పారు.
 
పాదయాత్రికులకు సత్కారం
నాడు వైఎస్‌ జగన్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్న రోశయ్య (అద్దంకి నియోజకవర్గం), డానియేల్, (ప్రత్తిపాడు నియోజకవర్గం), హరికృష్ణ (తిరుపతి నియోజకవర్గం), సురేష్‌ (నారావారిపల్లె), విక్రమ్‌ (కైకలూరు), ఇక్బాల్‌ బాషా (నంద్యాల), గోవిందరాజు (సత్తెనపల్లి), ఆనందరావు (పెదకూరపాడు), శ్రీనివాసరరెడ్డి (పాణ్యం), శ్రీను(అమలాపురం), వెంకటేశ్వరరెడ్డి (నరసరావుపేట), సతీష్‌ (పార్వతీపురం) తదితరులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫైబర్‌నెట్‌ చైర్మన్‌ పూనూరు గౌతంరెడ్డి, నవరత్నాల అమలు ప్రోగ్రామ్‌ వైస్‌ చైర్మన్‌ ఎ.నారాయణమూర్తి, తిరుపతి స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ నారమల్లి పద్మజ పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top