
ఎన్టీఆర్, సాక్షి: కూటమి నేతల అక్రమ కేసులతో అరెస్టయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)కి వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వంశీని పరామర్శించేందుకు మంగళవారం ఉదయం విజయవాడ సబ్ జైలుకు వెళ్లారు.
వంశీతో వైఎస్ జగన్ ములాఖత్ అయ్యారు. జరిగిన పరిణామాలన్నీ వంశీని అడిగి తెలుసుకుంటున్నారాయన. జగన్ వెంట వంశీ భార్య పంకజశ్రీ లోపలికి వెళ్లారు. ములాఖత్ ముగిశాక బయటకు వచ్చి వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. జగన్ రాక సందర్భంగా జైలు వద్ద కోలాహలం నెలకొంది.

వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణులు జైలు వద్దకు భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు. జైలు వద్ద అప్రకటిత ఆంక్షలు అమలు చేస్తున్నారు. బారికేడ్లు ఉంచి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. జైలు పరిసరాలకు 500 మీటర్లలోపు ఎవరినీ ఉండనివ్వకుండా వెళ్లగొడుతున్నారు. తొలుత జైలు వద్దకి వచ్చిన వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ కారును అడ్డుకుని.. ఆమెను నడుచుకుంటూ వెళ్లాలని పోలీసులు సూచించారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు జైలు వద్దకు చేరుకునే ప్రయత్నం చేయగా.. వాళ్లనూ అడ్డుకున్నారు. పోలీసుల ‘అతి’పై వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంకోవైపు.. మీడియా ప్రతినిధులను కూడా అక్కడ ఉండనివ్వకుండా పోలీసులు దూరంగా పంపించి వేస్తుండడం గమనార్హం.