గుండుకొట్టించడం లాంటి ఘటనలు తప్పు..

YS Jagan Mohan Reddy Meeting With Police Officials Head Shaving Case - Sakshi

తప్పు చేస్తే ఎంతటివారైనా చర‍్యలు తప్పవు: సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: దళితులమీద దాడులు సహా రాష్ట్రంలో చోటుచేసుకున్న ఇతరత్రా ఘటనలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు గతంలో పట్టించుకునేవారు కాదన్నారు. గత ప్రభుత్వానికి, ఇప్పటికి ప్రభుత్వానికి తేడా ఉందని.. తప్పు ఎవరు చేసినా తప్పే.. చర్యలు తప్పవన్నారు. ఏదైనా పొరపాటు చేస్తే.. ఎస్సైని కూడా జైల్లో పెట్టిన ఘటన గతంలో జరగలేదన్నారు సీఎం జగన్‌. తప్పు చేసింది ఎస్సై అయినా సీఐ అయినా సరే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. వ్యవస్థలో మార్పులు రావాలనే ఈ చర్యలు అన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మన బంధువులే బాధితులైతే.. ఉపేక్షిస్తామా. ఈ ప్రశ్నలు మనకు మనం వేసుకుని నిష్పక్షపాతంగా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. ఈ సందేశాన్ని పోలీసు అధికారులు కింది స్థాయికి తీసుకెళ్లాలి అని సీఎం జగన్‌ కోరారు. (చదవండి: మలుపు తిరిగిన శిరోముండనం ఘటన)

కానిస్టేబుళ్లు, ఏఎస్సైలు, ఎస్సైలు, తదితర స్థాయిలో ఉన్నవారికి ఓరియెంటేషన్‌ నిర్వహించాలన్నారు సీఎం జగన్‌. మానవత్వంతో వ్యవహరించడంతో పాటు.. ప్రజలకున్న హక్కులేంటి.. మనం ఎంత వరకు వెళ్లాలి.. ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దాని పైన అవగాహన కలిగించాలని ఆదేశించారు. గుండుకొట్టించడం లాంటి ఘటనలు తప్పు.. అలాంటి చర్యలకు ఎవ్వరూ పాల్పడకూడదని స్పష్టం చేశారు. వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి కఠినంగా వ్యవహరిస్తున్నమన్నారు సీఎం జగన్‌. ఎస్పీలు, ఏఎస్పీలు ఈ సందేశాన్ని దిగువస్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర హోంమంత్రి దళితురాలు, డీజీపీ ఎస్టీ అని గుర్తు చేశారు. సమాజంలో దిగువున ఉన్నవారికి రక్షణగా నిలబడాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు. అక్రమ మద్యం తయారీ, ఇసుక రవాణాను అరికట్టడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు ఎవ్వరూ కూడా చట్టానికి అతీతులు కారన్నారు. ఇది మనసులో పెట్టుకుని విధులు నిర్వహించాలన్నారు. అవినీతికి ఎక్కడా కూడా ఆస్కారం ఉండకూడదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. (కోవిడ్‌ చికిత్సలకు అధిక రేట్లు.. సీఎం జగన్‌ సీరియస్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top