పుర పోరులో ‌సామాన్యుడికి పట్టం కట్టిన సీఎం జగన్‌

YS Jagan Mohan Reddy Give Majority Seats To Common People In Municipal Elections - Sakshi

మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపొందిన సామాన్యులు

బడుగు, బలహీన వర్గాల వారికి పాలనా పగ్గాలు అందించిన సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: రాజకీయాలంటే బాగా డబ్బున్న వాళ్లు.. ఉన్నత వర్గానికి చెందిన వారు.. బలమైన బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నవారికి మాత్రమే అనే భావన బలంగా ఉంది సమాజంలో. అధికారంలో ఉన్న వారు కూడా తాము పేదల పక్షం అని చెప్తారు. కానీ ఎన్నికల బరిలో నిలబడే విషయంలో మాత్రం పేరు ప్రఖ్యాతులు, అంగబలం, అర్థబలానికే అగ్రతాంబులం ఇస్తారు. సామాన్యులంటే ఓటు వేయడానికి మాత్రమే అని భావించే నేతలున్న దేశం మనది. అయితే ఈ అభిప్రాయాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తప్పని నిరూపించారు. నీతి నిజాయతీ, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న వారు రాజకీయాల్లోకి రావాలనేది సీఎం జగన్‌ అభిమతం.

అందుకే మున్సిపల్‌ ఎన్నికల్లో సామాన్యులకు టికెట్‌ ఇచ్చి.. వారిని మున్సిపల్‌ చైర్మన్‌, మేయర్లుగా నియమించి.. ఇచ్చిన మాటలను నిజం చేసే నాయకుడిని అని మరోసారి నిరూపించుకున్నారు‌. కట్టెలు కొట్టి బతకు బండిని లాగే వ్యక్తికి.. కూరగాయలు అమ్ముకునే వ్యక్తికి.. అటెండర్‌ కోడలికి.. తోపుడు బండి వ్యాపారికి మున్సిపల్‌ ఎన్నికల్లో అవకాశం ఇచ్చి.. బడుగు వర్గాలకు పాలనా పగ్గాలు అందించి దేశ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టానికి సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారు. మున్సిపల్‌ చైర్మన్‌, మేయర్లుగా నియమితులైన ఆ సామాన్యుల వివరాలు...


రాయచోటి మున్సిపల్‌ చైర్మన్‌గా కూరగాయల వ్యాపారి
రాయచోటికి చెందిన షేక్‌ బాష డిగ్రీ వరకు చదువుకున్నారు. ఉద్యోగం దొరక్కపోవటంతో గ్రామంలోనే కూరగాయలు అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నారు. స్థానికంగా ప్రజల్లో మంచి పేరున్న షేక్‌ భాషకు వైఎస్సార్‌ సీ‌పీ మున్సిపాలిటీ ఎన్నికలలో కౌన్సిలర్‌ టికెట్‌ ఇచ్చింది. దీంతో ప్రజలు షేక్ ‌భాషను గెలిపించారు. గురువారం రాయచోటి మున్సిపాలిటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా షేక్‌ బాష సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తన జీవితంలో ఇలాంటి అవకాశం వస్తుందని ఊహించలేదన్నారు.


తోపుడుబండి వ్యాపారి.. మునిసిపల్‌ చైర్మన్‌
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్‌ చైర్మన్‌గా తలారి రాజ్‌కుమార్‌ ఎన్నికయ్యారు. ఇంటర్‌ చదివిన రాజ్‌కుమార్‌కు భార్య విజయలక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ పోషణకు తోపుడుబండిపై పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వైఎస్సార్‌సీపీపై అభిమానంతో కార్యకర్తగా సేవలందిస్తున్నారు. మునిసిపల్‌ ఎన్నికల్లో 10వ వార్డు బీసీ జనరల్‌కు రిజర్వు కాగా.. వైఎస్సార్‌సీపీ టికెట్‌ రాజ్‌కుమార్‌కు లభించింది. ఎన్నికల్లో పోటీకైతే దిగాడు కానీ కనీస ఖర్చు కూడా పెట్టుకునే ఆర్థిక స్థోమత లేకపోయింది. కానీ సీఎం వైఎస్‌ జగన్‌పై ప్రజలకున్న అభిమానం రాజ్‌కుమార్‌కు ఓట్ల వర్షం కురిపించి కార్పొరేటర్‌గా గెలిపించింది. ఇప్పుడు ఏకంగా మునిసిపల్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.


నాడు కట్టెలు కొట్టిన మహిళ.. నేడు చిత్తూరు మేయర్‌
చిత్తూరు కార్పొరేషన్‌ నూతన మేయర్‌గా ఎన్నికైన అముద ప్రస్థానం.. కష్టాల్లో ఆగిపోకుండా నిలదొక్కుకోవాలనే ఎందరో మహిళలకు ఆదర్శం. కుటుంబం గడవడం కోసం ఒకప్పుడు అముద కట్టెలు కొట్టి అమ్మారు. ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతున్నారు. జగన్‌ రూపంలో అదృష్టం ఆమె తలుపు తట్టింది. వైఎస్సార్‌సీపీ తరఫున కార్పొరేటర్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలవడమేగాక ఇప్పుడు ఏకంగా చిత్తూరు మేయర్‌గా ఎన్నికయ్యారు.


మామ అటెండర్‌గా పనిచేసిన చోట..నేడు కోడలు మేయర్‌
మునెయ్య.. ఆరేళ్లక్రితం వరకు తిరుపతి మునిసిపాలిటీలో అటెండర్‌గా పనిచేశారు. కార్పొరేషన్‌ స్థాయికి ఎదిగిన తిరుపతికి ఈసారి మొదటిసారి ఎన్నికలు నిర్వహించారు. మునెయ్య కోడలే ఇప్పుడు తిరుపతి కార్పొరేషన్‌కు తొలి మేయర్‌గా ఎన్నికయ్యారు.


నిన్న వలంటీర్లు.. నేడు కౌన్సిలర్, కార్పొరేటర్లు
నిన్నమొన్నటివరకు విశేష సేవలందించి అందరి ప్రశంసలు పొందిన ఇద్దరు వలంటీర్లు నేడు కౌన్సిలర్, కార్పొరేటర్‌గా ఎన్నికై రికార్డు సృష్టించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మునిసిపాలిటీలో 12వ వార్డు నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున వలంటీర్‌ లోకా కల్యాణి బరిలోకి దిగారు.  తన సమీప ప్రత్యర్థి టీడీపీకి చెందిన సరికొండ జ్యోతిపై 504 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు

విశాఖలో.. 
గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికల్లో ఓ వార్డు వలంటీర్‌ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 47వ వార్డు కంచర్లపాలెం అరుంధతినగర్‌ కొండవాలు ప్రాంతానికి చెందిన కంటిపాము కామేశ్వరి గతంలో వార్డు వలంటీర్‌గా పనిచేశారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసిన ఆమె తన సమీప ప్రత్యర్థిపై 3,898 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.

వీరితో పాటు మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ మహిళా సాధికారతకు, సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశారు సీఎం జగన్‌. చరిత్రలో తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 78 శాతం పదవులు ఇచ్చారు. దీంతోపాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ, తిరుపతి మునిసిపల్‌ కార్పొరేషన్ల మేయర్లుగా బీసీ వర్గానికి చెందిన ముగ్గురు మహిళలు ఎన్నిక కావడం ఊహలకు కూడా అందని పరిణామం. మహిళాభ్యున్నతిని చేతల్లో చూపించిన ముఖ్యమంత్రి జగన్‌... పార్టీ సాధించిన 11 కార్పొరేషన్లలో ఏకంగా ఏడింటి పగ్గాలు మహిళలకే అప్పగించారు. పురపాలక అధ్యక్ష పదవుల్లో 60.46 శాతం మహిళలకే దక్కటం ఒక రికార్డేనని చెప్పాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top