
‘ఈనాడు’ పత్రికపై వైఎస్ జగన్ వ్యాఖ్యలు వైరల్
‘సెకీ’ ఒప్పందంపై తప్పుడు కథనం ద్వారా అడ్డంగా దొరికిపోయిన ఈనాడు
దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు.. అధికార, ఉద్యోగ వర్గాల్లోనూ విస్తృత చర్చ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో చేసుకున్న ఒప్పందంపై కొద్ది రోజులుగా విషం కక్కుతున్న ‘ఈనాడు’ మరో తప్పుడు కథనం అచ్చేసి అడ్డంగా దొరికిపోయిన తీరుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. సెకీ మేనేజింగ్ డైరెక్టర్ రామేశ్వర్ ప్రసాద్ గుప్తాను ఇటీవల కేంద్ర ప్రభుత్వం పదవి నుంచి తొలగించడానికి.. ఏపీతో చేసుకున్న ఒప్పందమే కారణమని సదరు ఈనాడు దుష్ప్రచారంలో భాగంగా ‘సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది’ అంటూ తప్పుడు కథనం వండి వార్చింది.
వాస్తవానికి 2021 డిసెంబర్1న ఏపీ ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకుంది. 2023 జూన్ 13న రామేశ్వర్‌ప్రసాద్∙గుప్తా సెకీ సీఎండీగా నియమితులయ్యారు. ఇప్పుడు ఆయన్ను కేంద్రం పదవి నుంచి తొలగిస్తే గత ప్రభుత్వ ఒప్పందంతో ఏం సంబంధం ఉంటుంది? నిజానికి గుప్తా నియామకానికి రెండేళ్ల ముందే ఈ ఒప్పందం జరిగింది. ఈ వాస్తవాన్ని తొక్కిపెట్టి కేవలం గత ప్రభుత్వం, వైఎస్ జగన్‌పై బురద చల్లాలనే లక్ష్యంతో గుప్తా తొలగింపునకు ఈ ఒప్పందంతో ఈనాడు నిస్సిగ్గుగా ముడి పెట్టింది.
గురువారం మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ‘ఈనాడు’ తీరును కడిగి పారేశారు. ‘దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా ఉంది. దీన్నిబట్టి ఈనాడు స్థాయి టాయిలెట్ పేపర్‌కు ఎక్కువ.. టిష్యూ పేపర్‌కు తక్కువ అనిపిస్తుంది.. అంతా మాఫియా రాజ్యం.. మీడియా అని చెప్పుకోవడానికి సిగ్గు పడాలి’ అంటూ నిప్పులు చెరిగారు. ఈ వ్యాఖ్యలు శుక్రవారం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ట్విటర్, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా తదితర ప్లాట్‌ఫాంల ద్వారా ఒకరి నుంచి మరొకరికి పెద్ద సంఖ్యలో ఫార్వర్డ్ అయ్యాయి.
ఎక్కడ నలుగురు కలిసినా ఈ వ్యాఖ్యల ప్రస్తావన వచ్చింది. యూనిట్ విద్యుత్ రూ.2.49తో అందించే సెకీ ఒప్పందంపై ఇంతగా విషం చిమ్ముతున్న ఈనాడు.. దాదాపు అంతకు రెట్టింపు ధర యూనిట్ రూ.4.60తో చంద్రబాబు ప్రభుత్వం యాక్సెస్ అనే ప్రైవేటు సంస్థ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే మాత్రం పల్లెత్తు మాట అనలేదని చర్చించుకున్నారు.