
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్‌సీపీ నేత నారాయణరెడ్డి కుటుంబాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఫోన్ నుంచి కుటుంబ సభ్యులతో మాట్లాడిన వైఎస్ జగన్.. నారాయణరెడ్డి ఆత్మహత్యకు కారణాలను అడిగి తెలుసుకున్నారు.
ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన నారాయణరెడ్డిపై అక్రమంగా గంజాయి కేసు పెట్టి జైలుకు పంపడంతో ఆయన పరువు పోయిందని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అరెస్టు సమయంలో డబ్బులు ఇవ్వకపోవడంతో పోలీసులు తీవ్రంగా హింసించారని వైఎస్ జగన్‌కు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. పూలు అమ్ముకుని జీవించే నారాయణరెడ్డి మరణంతో భార్య, ఇద్దరి పిల్లల భవిష్యత్తు అంధకారంగా మారింది. అధైర్య పడొద్దని కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ ఓదార్చారు. వారి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
