వందేళ్ల తర్వాత చేపట్టిన మహాయజ్ఞం అది | YS Jagan on comprehensive land resurvey | Sakshi
Sakshi News home page

వందేళ్ల తర్వాత చేపట్టిన మహాయజ్ఞం అది

Jan 23 2026 5:15 AM | Updated on Jan 23 2026 5:15 AM

YS Jagan on comprehensive land resurvey

సమగ్ర భూ రీ సర్వేపై వైఎస్‌ జగన్‌

దేశంలో ఇదివరకెన్నడూ లేని విధంగా సర్వే 

భూ సమస్యలతో రైతుల ఇబ్బందులు పాదయాత్రలో కళ్లారా చూశాను 

ఆ రోజుల్లో రాష్ట్రంలో రెవెన్యూ పరిస్థితి ఎంతో దారుణం

ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారంగా సమగ్ర భూ సర్వే ఆలోచన 

సమగ్ర రీ సర్వే చేయిస్తామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం 

100 ఏళ్ల కిందట 1923లో బ్రిటీష్‌ ప్రభుత్వంలో భూముల సర్వే 

ఆ తర్వాత మేము అధికారంలోకి రాగానే 2020 డిసెంబర్‌ 21న సమగ్ర భూ రీసర్వేకు శ్రీకారం 

సర్వే కోసం విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు ఉపయోగించాం 

జియో కో ఆర్డినేట్స్‌ ఆధారంగా పారదర్శకంగా సర్వే.. భూ రికార్డులన్నీ అప్‌డేట్‌   

ట్యాంపర్‌ చేయడానికి ఆస్కారం లేని విధంగా భౌతికంగా, డిజిటల్‌ రూపంలో రికార్డులు 

అడ్వాన్స్‌డ్‌ సెక్యూరిటీ ఫీచర్స్, క్యూఆర్‌ కోడ్‌తో పట్టాదారు పాస్‌ పుస్తకాలు 

భూ యజమానులకు ప్రభుత్వమే గ్యారంటీగా క్లియర్‌ టైటిల్స్‌  

ఈ స్థాయిలో వ్యవస్థ నిర్వహణ కోసం ఒక వ్యవస్థ ఏర్పాటు  

ఇలా ఎంతో లోతుల్లోకి వెళ్లాం కాబట్టే దీనిని మహాయజ్ఞం అంటున్నాం 

వీటిల్లో ఏ ఒక్కటీ చేయని చంద్రబాబు ఇవాళ క్రెడిట్‌ చోరీకి పాట్లు 

సాక్షి, అమరావతి: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో అత్యాధునిక ప్రమాణాలు, సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలో ఇదివరకెన్నడూ లేని విధంగా సమగ్ర భూ రీ సర్వేను విప్లవాత్మక రీతిలో చేపట్టడం వల్లే మహా యజ్ఞం అంటున్నామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... 

వందేళ్ల తర్వాత మహా యజ్ఞం
2019కి ముందు చేపట్టిన నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రే భూముల రీ సర్వేకు మూలం. భూములకు సంబంధించిన సమస్యలతో రైతులు, ప్రజలు పడే ఇబ్బందులను పాదయాత్రలో కళ్లారా చూశాను. ఆ రోజుల్లో చంద్రబాబు సీఎంగా ఉన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ పరిస్థితి ఎంతో దారుణంగా ఉండింది. సరిపడా సర్వేయర్లు, సిబ్బంది లేరు. పరికరాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అంతకన్నా లేవు. 

భూముల క్రయవిక్రయాలు, కుటుంబాల మధ్య భూ పంపిణీ జరిగితే సబ్‌ డివిజన్, మ్యుటేషన్‌ ఊసే ఉండేది కాదు. దీనికి తోడు చంద్రబాబు ఎప్పుడు పడితే అప్పుడు భూములను ఎడాపెడా 22–ఏ జాబితాలో పెడుతున్న దుస్థితి అప్పట్లో ఉంది. ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారంగా సమగ్ర భూ సర్వే, సమగ్ర భూ సంస్కరణలు చేయాలనే ఆలోచన పుట్టుకొచ్చింది. జియో కో ఆర్డినేట్స్‌ ఆధారంగా రీ సర్వేను అత్యంత పారదర్శకంగా, అత్యంత కచ్చితత్వంతో చేపట్టాం.

పారదర్శకంగా భూముల సర్వే
» ప్రజలు, రైతులకు వివాదాలు లేకుండా పారదర్శకంగా భూముల సర్వే చేయడంతో పాటు, భూ రికార్డులు అన్నింటినీ అప్‌డేట్‌ చేయడం. 
»    ట్యాంపర్‌ చేయడానికి ఏ మాత్రం ఆస్కారం లేని విధంగా భౌతికంగా, డిజిటల్‌ రూపంలో రికార్డులను భద్ర పరచడం. 
»   భూ యజమానులకు, రైతులకు శాశ్వత యాజమాన్య పత్రాలు క్లియర్‌ టైటిల్స్‌ ఇవ్వడమే కాకుండా, ఆ క్లియర్‌ టైటిల్స్‌కు ప్రభుత్వమే గ్యారంటీగా నిలబడుతుంది.అత్యాధునిక ప్రమాణాలు(అడ్వాన్స్‌డ్‌ సెక్యూరిటీ ఫీచర్స్‌), క్యూఆర్‌ కోడ్‌తో పట్టాదారు పాస్‌ పుస్తకాలను ఇచ్చాం.  
»   భూముల క్రయవిక్రయాలు జరిగినా, లేదంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు, అన్నదమ్ముల మధ్య భూ పంపిణీ ద్వారా యాజమాన్య హక్కులు మారిన సందర్భాల్లో ఆటోమేటిక్‌ సబ్‌ డివిజన్, ప్రొటోకాల్‌ మ్యుటేషన్‌ జరిగేలా చేశాం.  
»  ఇందుకు సంబంధించిన రికార్డులు అన్నీ కూడా ఆ గ్రామ సచివాలయంలోనే ఉంటాయి. సచివాలయాల్లోనే రికార్డులన్నింటినీ ప్రజలకు అందుబాటులో ఉంచడమే కాకుండా, అక్కడే రిజి్రస్టేషన్‌ సేవలు ప్రారంభించాం. 
»   భూముల లావాదేవీలపై రియల్‌ టైమ్‌ అలర్ట్స్‌ను మొబైల్‌ ఫోన్‌కు పంపేలా ప్రభుత్వ పోర్టల్‌ను అభివృద్ధి చేశాం.    
» ఈ స్థాయిలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి, భూ సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేసి, ట్యాంపర్‌ చేయడానికి వీల్లేని పత్రాలు చేతిలో పెట్టి, తర్వాత కూడా వ్యవస్థను నిర్వహించాలని తపనపడ్డ మా వంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేదు. 
»  ఇలా ఎంతో లోతుల్లోకి వెళ్లాం. అందుకే దీన్ని మహాయజ్ఞం అంటున్నాం. అసలు ఎంత లోతుల్లోకి మేం వెళ్లాం.. చిత్తశుద్ధి చూపామనడానికి నాడు చేసి సమీక్షలే నిదర్శనం. (31.03.2022న సమీక్ష వీడియో ప్రదర్శించారు) ఎప్పుడైనా ఇలాంటివి విన్నావా.. చూశావా.. చేశావా.. 80 ఏళ్ల వయసున్న చంద్రబాబూ? 
»  ఇవన్నీ చేయని చంద్రబాబు ఏ రకంగా రికార్డును తన ఖాతాలోకి వేసుకుంటారు? క్రెడిట్‌ చోరీకి ఎలా పాల్పడతారు? వీటిలో ఏ ఒక్కటీ ఆయన హయాంలో జరగలేదు. మరి క్రెడిట్‌ చోరీ చేయడానికి సిగ్గుండాలి. 

ప్రతి ప్రయత్నం ఓ రికార్డు
»  సమగ్ర భూ సర్వేలో మేం చేసిన ప్రతీ ప్రయత్నం ఓ రికార్డు. 15 వేల గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశాం. ఇది ఒక రికార్డు. ఇది గతంలో ఎన్నడూ జరగలేదు. ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగుల చొప్పున ఒకే ఒక నోటిఫికేషన్‌తో 1.34 లక్షల ఉద్యోగులను నియమించాం. ఇది ఎవ్వరూ ఎప్పుడూ అధిగమించలేని సూపర్‌ రికార్డు. ప్రతి సచివాలయంలో వీఆర్‌వో (గ్రామ రెవెన్యూ అధికారి), సర్వేయర్, డిజిటల్‌ అసిస్టెంట్‌ చొప్పున దాదాపు 40 వేల మంది రీ సర్వేలో పాల్గొన్నారు. సర్వే కోసం విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు ఉపయోగించాం. 
»  రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని 2019 ఎన్నికల సందర్భంగా మా మేనిఫెస్టోలో సుపరిపాలన అంశంలో రాష్ట్రంలోని భూములన్నింటినీ సమగ్ర రీ సర్వే చేయించి, శాశ్వత భూ యాజమాన్య హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చాం. చెప్పిన మేరకు  2020 డిసెంబర్‌ 21న రీసర్వే అనే మహా యజ్ఞాన్ని ప్రారంభించాం. అంతకు ముందు వందేళ్ల కిందట 1923లో బ్రిటీష్‌ ప్రభుత్వం తర్వాత సమగ్ర భూ సర్వేను మా ప్రభుత్వం చేపట్టింది. 

గొప్ప వ్యవస్థను సృష్టించాం  
చంద్రబాబులా మేమెప్పుడూ కబుర్లు చెప్పలేదు. గొప్ప వ్యవస్థను సృష్టించి, అత్యాధునిక సాంకేతికతను దత్తత చేసుకుని గొప్పగా అడుగులు వేశాం. అంతటితో ఆగిపోలేదు. ఎక్కడికక్కడ వివాదాల పరిష్కారం కోసం మండలానికి ఇద్దరు అధికారుల చొప్పున 1,358 మండల మొబైల్‌ మేజిస్ట్రేట్  లను అందుబాటులోకి తెచ్చాం. రియల్‌ టైమ్‌ అప్‌డేట్స్‌తో ఏపీ ప్రభుత్వ ‘మీ భూమి’ వెబ్‌ పోర్టల్‌ను అప్‌గ్రేడ్‌ చేశాం. 

ల్యాండ్‌ పార్సిల్స్‌ (భూ కమతాలు)కు సంబంధించి ఏ లావాదేవీ జరిగినా, యజమానులకు రియల్‌ టైమ్‌ అలెర్ట్‌ వచ్చే విధంగా పోర్టల్‌ను తీర్చిదిద్దాం. చంద్రబాబు అనే వ్యక్తికి చిత్తశుద్ధి, బాధ్యత ఉండదు. ఎవరైనా చేస్తే ఆ క్రెడిట్‌ కొట్టేయడానికి మాత్రం ప్రయత్నిస్తాడు. రైతు, భూ యజమానికి సరిహద్దులు తెలిసేలా రాళ్లను పాతితేనే సర్వే పూర్తయినట్లు. ఆ భూమిలో సర్వే అయినట్టు ప్రత్యేక (డిస్టింక్ట్‌) రాయి ఉండాలి. 

ఏ రాయి పడితే ఆ రాయి పెట్టి.. ఇదే సర్వే రాయి అంటే సరిహద్దులు ఎలా ఉంటాయి? అందుకే ప్రత్యేక (డిస్టింక్ట్‌) తరహాలో సర్వే రాళ్లను ఉచితంగా ప్రభుత్వం రైతులకు సరఫరా చేసింది. రాళ్ల మీద శాశ్వత భూ హక్కు – భూ రక్ష పేరు పెట్టాం. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో 1923లో బ్రిటీష్‌ వాళ్లు పెట్టిన రాళ్లు కనిపిస్తాయి. (బ్రిటీష్‌ హయాంలో పెట్టిన సర్వే రాళ్లు చూపించారు) చంద్రబాబు ఏమో రాళ్లెందుకు అంటాడు?   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement