మరోసారి అడ్డంగా దొరికిన ‘ఈనాడు’

Yellow media has once again fake news spread on YS Jagan government - Sakshi

కట్టబెట్టేశారు.. కట్టుకథే

ఐటీ సెజ్‌లో భూమి కోసం 2016లోనే షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ దరఖాస్తు

అప్పుడే రూ.2.85 కోట్లు అడ్వాన్స్‌గా ఏపీఐఐసీకి చెల్లించిన సంస్థ

టీడీపీ హయాంలో ఈనాడుకు తప్పుగా కానరాని ఏపీఐఐసీ నిర్ణయం

కంపెనీలు రాకపోవడంతో ఐటీ సెజ్‌ను డీనోటిఫై చేస్తూ కేంద్ర వాణిజ్య శాఖ గెజిట్‌ 

సెజ్‌ హోదా లేనందున 49.80 ఎకరాలు షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు కేటాయింపు

ఉపాధి కల్పించే పరిశ్రమలకు ఇచ్చే భూములను మార్కెట్‌ ధరతో పోల్చి చూడకూడదు

తప్పుడు కథనాన్ని ఖండించిన ఏపీఐఐసీ 

Yellow media has once again fake news spread On AP CM: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై ఉన్న అక్కసును టీడీపీ అనుకూల మీడియా మరోసారి చాటుకుంది. టీడీపీ హయాంలో తప్పుగా కానరాని నిర్ణయాలు ఇప్పుడు చట్ట ప్రకారం నడుచుకుంటున్నా ఏదో ఘోరం జరిగిపోయినట్లుగా గుండెలు బాదుకోవడం ఓ వర్గం మీడియాకు ఆనవాయితీగా మారిపోయింది. గురువారం ఈనాడు దినపత్రిక ప్రచురించిన ‘ఐటీ సెజ్‌ భూములను కట్టబెట్టేశారు’’ కథనమే దీనికి నిదర్శనం. 2016లో వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలోని సీపీ బ్రౌన్‌ ఐటీ సెజ్‌ హోదా రద్దు కాకుండా భూముల కోసం అడ్వాన్సు తీసుకున్నప్పుడు తప్పుగా కనిపించని నిర్ణయం.. ఇప్పుడు సెజ్‌ హోదా రద్దైన తర్వాత కేటాయిస్తే సెజ్‌ భూములను కట్టబెట్టేశారంటూ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ఏపీఐఐసీ ఆధారాలతో దీన్ని ఖండించింది.

ఏం జరిగిందంటే..
కడపలో ఐటీ సెజ్‌ అభివృద్ధి చేసేందుకు 2007లో ఏపీఐఐసీ 52.76 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. ఐటీ కార్యాలయాలను నెలకొల్పేందుకు కె.రహేజా కార్పొరేషన్‌కు 2008 సెప్టెంబర్‌ 29న ఐదెకరాల భూమిని 30 ఏళ్లు లీజు విధానంలో కేటాయించింది. అయితే అనంతరం రహేజా కంపెనీ తన ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. దీంతో అప్పటి నుంచి ఏపీఐఐసీ వెబ్‌సైట్‌లో అది ఖాళీ స్థలంగానే ఉంది. ఈ క్రమంలో ఒక్క ఐటీ కంపెనీ కూడా ముందుకు రాకపోవడంతో ఐటీ సెజ్‌ హోదా రద్దు చేయాలని 2013 నవంబర్‌ 5న కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖను కోరారు. ఐటీ సెజ్‌ డీ–నోటిఫికేషన్‌ ప్రాథమిక అనుమతులను 2015 జూలై 8న టీడీపీ హయాంలోనే కేంద్రం జారీ చేసింది. ఐటీ కంపెనీలు రానందున ఇదే విధంగా విశాఖపట్నంలోని మధురవాడ, గంభీరం తదితర చోట్ల ఐటీ సెజ్‌లను డీ–నోటిఫికేషన్‌ చేశారు.

2016లోనే అడ్వాన్స్‌ చెల్లించిన షిర్డీసాయి 
షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కడపలో రూ.246.5 కోట్ల పెట్టుబడితో 400 మందికి ఉపాధి కల్పించేలా ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ యూనిట్‌కు 2016లో దరఖాస్తు చేసుకుంది. ఐటీ పారిశ్రామిక వాడలో భూమి కేటాయించాలని రూ.2.85 కోట్లు అడ్వాన్స్‌గా డీడీ రూపంలో ఏపీఐఐసీకి 2016 అక్టోబర్‌ 16న చెల్లించింది. ఆ భూమి కోసం ఇతర కంపెనీల నుంచి దరఖాస్తులు రాకపోవడంతో నిబంధనల ప్రకారం ఏపీఐఐసీ వేలం వేయకుండా కేటాయించింది.

అయితే అప్పటి నుంచి 2020 వరకు కేంద్రం నుంచి డీనోటిఫికేషన్‌ గెజిట్‌ రాకపోవడంతో షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ పనులను ప్రారంభించలేదు. ఇప్పుడు డీ–నోటిఫికేషన్‌ గెజిట్‌ రావడంతో ఏపీఎస్‌పీడీసీఎల్‌ అవసరాల కోసం కొంత భూమిని వదిలి మిగతాది షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు కేటాయించినట్లు ఏపీఐఐసీ పేర్కొంది. ఉపాధి నిమిత్తం పరిశ్రమలకు కేటాయించే భూములను మార్కెట్‌ ధర, గృహ సముదాయాల లే అవుట్ల ధరలతో పోల్చి చూడటం సరికాదని ఏపీఐఐసీ స్పష్టం చేసింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top