World Diabetes Day: కోవిడ్‌ వచ్చిపోయింది.. అయితే చాలామందిలో..

World Diabetes Day: Increased Sugar Cases Due to Corona - Sakshi

కరోనా కారణంగా పెరిగిన షుగర్‌ కేసులు 

కోవిడ్‌ రోగుల్లో కొత్తగా 30 శాతం మందికి 

వ్యాయామం, ఆహార నియంత్రణ ముఖ్యం 

మానసిక ఒత్తిడి తగ్గించుకుంటే మేలు 

నేడు వరల్డ్‌ డయాబెటీస్‌ డే 

సాక్షి, కర్నూలు (హాస్పిటల్‌): మధుమేహం అంటే అందరికీ అర్థం కాదు. షుగర్, చక్కెర రోగం అంటే చాలా మందికి తెలుస్తుంది. చక్కెర, తీపి పదార్థాలు ఎక్కువ తినే వారిలో ఇది వస్తుందని ఇప్పటికీ చాలా మంది నమ్మకం. కానీ ఈ వ్యాధి రావడానికి కచ్చితమైన కారణాలు ఇప్పటికీ తెలియనప్పటికీ మానసిక ఒత్తిడి, ఊబకాయం, వ్యాయామం లేకపోవడం, ఆహార నియంత్రణ లేకపోవడం వంటి కారణాల వల్ల వస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ విషయం గురించి తెలియక, షుగర్‌ వ్యాధి గురించి అవగాహన లేక చాలా మంది తీపిరోగంతోనే జీవిస్తున్నారు. ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు చేసిన పరీక్షల్లో మాత్రమే చాలా మందికి షుగర్‌వ్యాధి బయటపడుతోంది. కొందరికి ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఇటీవల చాలా మందికి కోవిడ్‌ వచ్చిపోయింది. కోవిడ్‌ వచ్చిపోయిన వారిలో అధిక శాతం మంది కొత్తగా షుగర్‌ రోగులుగా మారారని తాజాగా వైద్యులు గుర్తించారు. ఈ నెల 14వ తేదీన వరల్డ్‌ డయాబెటీస్‌ డే సందర్భంగా ప్రత్యేక కథనం.  

జిల్లాలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు నంద్యాలలోని జిల్లా ఆసుపత్రి, ఆదోనిలోని ఏరియా ఆసుపత్రితో పాటు 18 సీహెచ్‌సీలు, 87 పీహెచ్‌సీలు, 40 అర్బన్‌హెల్త్‌ సెంటర్లలో షుగర్‌ వ్యాధికి అవసరమైన వైద్యపరీక్షలు, చికిత్స చేస్తున్నారు. అన్ని చోట్లా షుగర్‌ మందులను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజ్‌(అంటువ్యాధికాని వ్యాధులు)లను చికిత్స చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 12 క్లినిక్‌లను నిర్వహిస్తున్నారు. ఇందులో గత ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు 12 క్లినిక్‌లలో 3,31,974 మందికి షుగర్‌ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇందులో మగవారు 1,74,146 మంది ఉండగా, మహిళలు 1,57,828 మంది ఉన్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందే ప్రజల్లో గ్రామీణ ప్రాంతాల్లో 15 శాతం, పట్టణ ప్రాంతాల్లో 20 శాతం మంది షుగర్‌ వ్యాధిగ్రస్తులు ఉండే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. షుగర్‌ వ్యాధి హార్మోన్‌ జబ్బు. ఇలాంటి హార్మోనల్‌ జబ్బులకు చికిత్స చేసేందుకు 15 ఏళ్ల క్రితం జిల్లాలో ఒక్కరే ఎండోక్రైనాలజిస్టు ఉండేవారు. ఇప్పుడు కర్నూలులోనే 10 మంది దాకా ఉన్నారు. దీనికితోడు జనరల్‌ ఫిజీషియన్‌లు సైతం ఈ వ్యాధికి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆయా వైద్యుల వద్దకు చికిత్స కోసం వచ్చే వారిలో షుగర్‌ జబ్బు ఉన్న వారే వస్తుండటం గమనార్హం.  

కరోనా బాధితుల్లో 30 శాతం మందికి షుగర్‌ వ్యాధి లక్షణాలు
గత సంవత్సరం, ఈ ఏడాది కోవిడ్‌ వచ్చి తగ్గిపోయిన వారిలో కొత్తగా షుగర్‌ రోగుల సంఖ్య పెరగడం ప్రారంభమైందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అప్పటికే షుగర్‌ ఉన్నా నియంత్రణలో ఉన్న వారు కోవిడ్‌ నుంచి సులభంగా బయటపడ్డారని, నియంత్రణలో లేని వారు ఐసీయులో చేరారని, కొందరు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,24,166 మంది కోవిడ్‌ బారిన పడ్డారు. ఇందులో కొత్తగా 30 శాతం మందికి షుగర్‌ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయని వైద్యులు భావిస్తున్నారు. ఎన్‌సీడీ చికిత్సల్లో భాగంగా డయాబెటీస్‌ గురించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.  

నివారణ చర్యలు 
ఆహారంలో కార్బొహైడ్రేడ్, కొవ్వు కలిగిన పదార్థాలను తగ్గించి తీసుకోవాలి. ఎక్కువగా పండ్లు, కూరగాయాలు, పీచు కలిగిన ఆహారం తినాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిని తగ్గించేందుకు, బరువు పెరగకుండా సహాయం చేస్తుంది.  

ఇన్సులిన్‌ ఉచితంగా ఇస్తున్నాం 
ఆసుపత్రిలో ప్రతి మంగళ, శుక్రవారాలు ఓపీ నిర్వహిస్తాం. ఇందులో మంగళవారం 400 ఓపీ ఉంటే అందులో 300 మంది షుగర్, శుక్రవారం 300 మంది ఓపీ ఉంటే 200 మంది షుగర్‌ వ్యాధిగ్రస్తులు చికిత్సకు వస్తారు. వీరిలో 60 శాతం మందికి మందులు, 40 శాతం మంది ఇన్సులిన్‌ చికిత్సను అందిస్తున్నాం. మాత్రలతో పాటు నెలకు సరిపడా ఇన్సులిన్‌ను కూడా రోగులకు ఉచితంగా అందిస్తున్నాం.  – డాక్టర్‌ పి.శ్రీనివాసులు, ఎండోక్రైనాలజిస్టు, పెద్దాసుపత్రి

స్టెరాయిడ్స్‌ వాడితే ప్రమాదం 
షుగర్‌ వ్యాధి ఉన్న వారు స్టెరాయిడ్‌ మందులు వాడకూడదు. ఇవి వాడితే షుగర్‌ స్థాయిలు వారి శరీరంలో మరింత పెరుగుతాయి. దీనివల్ల శరీరంలో ఇతర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కోవిడ్‌ బాధితులు స్టెరాయిడ్స్‌ అధికంగా వాడటం వల్ల వారిలో షుగర్‌ మరింతగా పెరిగింది. పరిమిత మోతాదులో వాడితే ఏ మందూ హాని చేయదు.  
– డాక్టర్‌ ఎస్‌.సరయూరెడ్డి, జనరల్‌ ఫిజీషియన్, కర్నూలు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top